రీల్ పోలీస్ యాక్షన్ కంటే ఒక ఆకు ఎక్కువగానే చేస్తున్నారట ఆ రియల్ పోలీస్ ఆఫీసర్. నేను మోనార్క్‌ని అంటూ… ఇల్లీగల్ దందాల మీద విరుచుకు పడుతున్నారట. ప్రజా ప్రతినిధులను సైతం జైలుకు పంపడంతో హీరో ఇమేజ్ సంపాదించుకున్న సదరు ఆఫీసర్ కూడా ఒక నాయకుడి విషయంలో కాస్త సాఫ్ట్ కార్నర్ ప్రదర్శిస్తున్నారట. అది తెలిసి మంత్రులకు కిందా మీదా కాలిపోతోందట ఇంతకీ ఎవరా ఆఫీసర్? ఏమా కథ? కరీంనగర్ పోలీసు కమిషనర్‌గా అసెంబ్లీ ఎన్నికల సమయంలో బాధ్యతలు తీసుకున్నారు అభిషేక్ మహంతి… ఎలక్షన్ టైంలో కఠినంగా ఉన్న సీపీ…తర్వాత కూడా అదే దూకుడు కంటిన్యూ చేస్తూ భూ కబ్జా దారుల విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్నారట… ఇందు కోసం ఏకంగా ఎకనమిక్ అఫెన్సెస్ వింగ్ పేరుతో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసి కబ్జాదారులకు నిద్ర లేకుండా చేయడం ఇప్పుడు కరీంనగర్‌లో హాట్ టాపిక్ అయింది. సీపీ ఫ్రీ హ్యాండ్ ఇవ్వడంతో భూ కబ్జాలు, పేకాట స్థావరాలు, ఇసుక దందాలు, చిట్ ఫండ్ మోసాలపై బాధితులకు న్యాయం చేసే దిశగా కదులుతున్నారు పోలీసులు. గత ఆరేడేళ్లుగా విపరీతమైన రాజకీయ ఒత్తిళ్ల కారణంగా.. పోలీసులు ఏ పనీ చేసేవారు కాదని ఇప్పుడు చర్చించుకుంటున్నారు స్థానికులు. గతంలో వచ్చిన ఫిర్యాదుల బూజు దులిపేందుకు అభిషేక్ మహంతి సిద్ధమవడంతో బాధితులంతా ఒక్కొక్కరుగా వచ్చి ఫిర్యాదు చేస్తున్నట్టు తెలిసింది. అందులో భాగంగానే.. ఇటీవల పలువురు బీఆర్ఎస్ కార్పోరేటర్లు, కొంతమంది బీఆర్ఎస్ నేతలను అరెస్ట్ చేశారు పోలీసులు. దీంతో కాంగ్రెస్ నేతలు కూడా భూములు కబ్జాలు చేశారంటూ.. సిట్ కు ఫిర్యాదు చేయడం మొదలు పెట్టారు బీఆర్‌ఎస్ లీడర్స్. ఇలా భూ కబ్జాలపై అరెస్టుల పర్వం కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో రాజకీయంగా దుమారం రేపుతోంది. ఇక పేకాట స్థావరాలపై కూడా సీపీ మరింత దూకుడు ప్రదర్శిస్తున్నారు. బీఆర్ఎస్ లో కేసీఆర్ కు కుడి భుజంలా ఉంటున్న ఓ నేతకు సంబంధించిన హోటల్ పై దాడి చేసి పేకాట రాయుళ్లను అరెస్టు చేయడం సంచలనం రేపింది.. అదే హోటల్‌పై దాడిచేసి లెక్కలు చూపని ఆరున్నర కోట్ల నగదును సీజ్ చేయడం చర్చనీయాంశంగా మారింది. గతంలో పోలీసులు ఆ హోటల్ వైపు చూడాలంటేనే వణికిపోయే పరిస్థితి నుంచి నేరుగా రూములన్నింటినీ తనిఖీ చేయడం కలకలం రేపుతోంది.. ఇక ఇసుక అక్రమ రవాణాపైన కూడా సీపీ అభిషేక్ మొహంతి కొందరిని పిలిచి సీరియస్ వార్నింగ్ ఇచ్చారట.
సీపీ అభిషేక్ మహంతి దూకుడు వెనుక పెద్ద కారణమే ఉన్నట్లు చర్చ జరుగుతోంది. గత సర్కార్‌కు భిన్నంగా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం దొంగ దందాలపై కఠినంగా ఉండాలని పోలీసులకు ఆదేశాలు ఇచ్చిందట. అందుకే కరీంనగర్ సీపీ కాస్త స్పీడ్ ప్రదర్శిస్తున్నారన్నది పోలీస్ వర్గాల సమాచారం. భూకబ్జాలు చేస్తున్నది అధికార పార్టీనా, ప్రతిపక్షమా అన్నది చూడటం లేదట.. అందిరిపైనా కేసులు పెడుతున్నట్టు తెలిసింది. మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా… కబ్జాలు చేసింది కాంగ్రెస్ నేతలైనా సరే వదిలిపెట్టొద్దని పోలీసులకు ఆదేశాలిచ్చినట్టు తెలిసింది. అందుకే ఇటీవల పేకాట, భూకబ్జాలు, ఇసుక దందాలు చేస్తున్న వారి తాట తీస్తున్నారట పోలీసులు. మరోవైపు గతంలో రాజకీయ నేతలకు కొమ్ముకాసిన కొందరు పోలీసు అధికారులను కూడా సీపీ పిలిచి వార్నింగ్ ఇచ్చినట్టు సమాచారం. ఓ కేసులో అయితే గజ్వేల్ ఎమ్మార్వోను అరెస్టు చేసి జైలుకు కూడా పంపడం సంచలనమైంది. ఇక్కడ వరకు బాగానే ఉంది…ఒత్తిళ్లకు తలొగ్గకుండా పనిచేస్తున్నారనే పేరు వచ్చినప్పటికీ… కొన్ని విషయాల్లో అధికార పార్టీ వారు సైతం ఇబ్బంది పడుతున్నట్టు తెలిసింది. జిల్లాకు చెందిన ఓ మంత్రి తన వద్ద ఇంత కాలం పనిచేసిన ఓ గన్‌మెన్‌ను తనకు తిరిగి కేటాయించాలని కోరితే ఆ విషయమే పట్టించుకోలేదట… పైగా మీరు మా పరిధిలోకి రారని అన్నట్టు సమాచారం. తాను వచ్చినా రెస్పాండ్ అవడం లేదని కినుక వహించారట మరో మంత్రి. జిల్లా ఇంచార్జ్ మంత్రి చెప్పినా కొన్ని విషయాలను పట్టించుకోవడం లేదనే గుసగుసలు వినిపిస్తున్నాయి… ఇటీవల కొందరు సీనియర్ ప్రజాప్రతినిధుల సిఫార్సులతో జరిగిన ఇన్స్‌పెక్టర్ల బదిలీ విషయంలో సీపీ అసంతృప్తిగా ఉన్నారనే టాక్ వినిపిస్తోంది. అందుకే అలా వచ్చినవారికి చుక్కలు చూపిస్తున్నారనే ప్రచారమూ సాగుతోంది. ఈ పరిణామాలన్ని మంత్రులకు కాస్త ఇబ్బందిగా మారాయనే చర్చ మొదలైంది… తమ సిఫార్సులకు విలువ లేదా అని ఉన్నతాధికారులతో సీరియస్‌గానే అన్నట్టు సమాచారం. అయితే ఓ జాతీయ పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధితో మాత్రం కొంత సానుకూలంగా వ్యవహరించడంతో మంత్రులు ఇరిటేట్ అవుతున్నట్టు సమాచారం. సీపీ చర్యలకు తాము ఎక్కడా అడ్డు చెప్పనప్పటికీ ఇలా వ్యవహరించడం పట్ల ఆగ్రహంగా ఉన్నారట మంత్రులు…. తన పరిధి కాని బదిలీల విషయంలో జోక్యం, కొత్తగా వచ్చిన వారిని ఇబ్బంది పెట్టడం, ఓ పార్టీ ప్రజా ప్రతినిధికి ప్రయార్టీ ఇస్తున్న అంశాలను తేలిగ్గా వదలకూడదని నిర్ణయించుకున్నారట జిల్లా మంత్రులు… ఈ విషయాన్ని సీఎం రేవంత్ దృష్టికి కూడా తీసుకెళ్ళాలనుకుంటున్నట్టు తెలిసింది.