బీఎస్పీతో దోస్తీ బీఆర్ఎస్‌లో చిచ్చు పెట్టిందా? సీనియర్ లీడర్ కారు దిగడానికి కారణం అవుతోందా? నిన్నటి ఎన్నికల్లో నన్ను బండబూతులు తిట్టిన మనిషితో నేడు చెట్టపట్టాలేసుకుని తిరగమంటారా? నావల్ల కాదంటూ గులాబీకి బైబై చెప్పేసిన ఆ లీడర్ ఎవరు? పక్క పార్టీలో ఆయనకు లభించిన హామీ ఏంటి? సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప కారు దిగేస్తున్నారు. హస్తం గూటికి చేరేందుకు డేట్ ఫిక్స్ చేసుకునే పనిలో ఉన్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ పెద్దలతో భేటీ అయిన కోనప్ప ఈనెల 12 లేదా 15న కండువా మార్చేయవచ్చంటున్నారు. పార్టీ మార్పుపై క్లారిటీ వచ్చినా … అందుకు దారితీసిన పరిస్థితులపైనే నియోజకవర్గంలో చర్చ జరుగుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో సిర్పూర్ నుంచి పోటీ చేసిన బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్… తన గెలుపును దెబ్బతీశారన్న అభిప్రాయం మాజీ ఎమ్మెల్యేకు బలంగా ఉందట. ప్రవీణ్‌కుమార్ బీఆర్ఎస్ ఓట్లు చీల్చడం వల్లే తాను ఓడిపోయి.. బీజేపీ అభ్యర్థి హరీష్ స్వల్ప మెజార్టీతో గెలవగలిగారన్నది ఆయన అభిప్రాయంగా తెలిసింది.అలాగే ఎన్నికల సమయంలో తన పై బూతులు తిట్టి వ్యక్తిగత దూషణలకు దిగిన ప్రవీణ్ కుమార్‌తో బీఆర్ఎస్ జతకట్టడం తనకు నచ్చలేదని, పైగా మాట మాత్రం చెప్పకుండా ఆయనతో పొత్తు పెట్టుకోవడంతో హర్ట్ అయ్యానంటూ గులాబీ కండువా తీసి పక్కన పెట్టేశారు కోనప్ప. 2004లోకాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారాయన. ఆ తర్వాత 2014లో బీఎస్పీ నుంచి గెలిచి బీఆర్ఎస్‌లో చేరారు…2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ టిక్కెట్ మీదే మరోసారి ఎమ్మెల్యే అయ్యారు.
తాజా అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ తరపునే పోటీ చేసి మూడు వేల ఓట్ల తేడాతో ఓడిపోయారాయన. ఓడిపోయాక కూడా నియోజకవర్గంలో యాక్టివ్‌గా తిరుగుతూ పార్టీని అంటి పెట్టుకుని ఉన్నా… ఏ మాత్రం గౌరవం లేకుండా, తన మాటకు విలువ ఇవ్వకుండా అధిష్టానం ఏకపక్ష నిర్ణయం తీసుకుందని మండిపడుతున్నారట మాజీ ఎమ్మెల్యే. ఆర్ఎస్ ప్రవీణ్ తో కలిసి నడవాలన్న బీఆర్ఎస్ పెద్దల నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారాయన. అందుకే పార్టీకి రాంరాం చెప్పేస్తున్నట్టు తెలిసింది. తన హ్యాట్రిక్ విజయావకాశాలను దెబ్బకొట్టి, వ్యక్తిగత దూషణలకు దిగిన ప్రవీణ్‌తో చెట్టాపట్టాలేసుకునే ప్రసక్తే లేదని అంటున్నారట కోనప్ప. ఆ ఊపులోనే కాంగ్రెస్ పార్టీ పెద్దలతో సమావేశమైనట్టు తెలిసింది. మరోవైపు అసెంబ్లీ ఎన్నికల్లో సిర్పూర్ కాంగ్రెస్ అభ్యర్థిగా కోనప్ప మేనల్లుడు రావి శ్రీనివాస్ పోటీ చేశారు. ఇద్దరి మధ్య విభేదాలున్న పరిస్థితుల్లో ఇప్పడు కోనప్ప ఆయనతో కాంగ్రెస్ పార్టీలో ఎలా సర్దుకుపోతారన్నది ఆసక్తిగా మారింది. జిల్లా అధ్యక్షుడి హోదాలో ఉన్న కోనప్ప కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తే.. నియోజకవర్గ ఇంచార్జ్‌తోపాటు జిల్లా అధ్యక్షపదవి ఇస్తారా…అలా ఇస్తే మిగతా వాళ్లు ఒప్పుకుంటారా అనే ప్రశ్నలు వస్తున్నాయి. ఆయన అనుచరులు మాత్రం అన్నీ సవ్యంగానే జరుగుతాయంటూ ధీమాగా ఉన్నారట. మాజీ ఎమ్మెల్యే రాక తమకు ప్లస్ అవుతుందన్న అభిప్రాయం కాంగ్రెస్ కేడర్‌లో కూడా ఉండటం ప్లస్ అవుతుందంటున్నారు. బీజేపీ ఎమ్మెల్యే హరీశ్ బాబు ఉన్నారు కాబట్టి…సీనియర్‌గా, కోనప్ప ఏదో ఒక ప్రోటోకాల్ పోస్ట్‌లో ఉంటే బీజేపీ హవాకు కూడా చెక్‌పెట్టినట్టు ఉంటుందన్న అభిప్రాయం కూడా పెరుగుతున్నట్టు చెప్పుకుంటున్నారు. మొత్తం మీద కోనప్ప కాంగ్రెస్ గూటికి చేరడం ఖాయమైపోయినందున ఆయనకు పార్టీలో ఎలాంటి బాధ్యతలు అప్పగిస్తారన్నది ఆసక్తిగా మారింది.