బీఆర్‌ఎస్‌కు ఇప్పుడు ఎమ్మెల్యేల భయం పెరుగుతోందా? గంపగుత్తగా కారు దిగేసి వెళ్ళిపోతే పరిస్థితి ఏంటని టెన్షన్ పడుతోందా? అంతదాకా రాకుండా ముందే కొత్త రకం అస్త్రంతో మైండ్ గేమ్ మొదలైందా? ఇంతకీ ఎమ్మెల్యేల మీద బీఆర్‌ఎస్ ప్రయోగించాలనుకుంటున్న అస్త్రం ఏంటి? పార్టీ ప్లాన్ ఎలా ఉంది? అసెంబ్లీ ఎన్నికల్లో టైం బ్యాడై, రాశి ఫలాలు తిరగబడి…. జనం తిరస్కరించి… 39 సీట్లతో ప్రతిపక్షానికి పరిమితం అయింది బీఆర్‌ఎస్. కేవలం రెండు శాతం ఓట్ల తేడాతో మూడోసారి అధికారానికి దూరం అయ్యామని తెగ మధనపడిపోతున్నారు గులాబీ నేతలు. ఆ దిగులు అలా కొనసాగుతుండగానే… రకరకాలుగా తలనొప్పులు పెరుగుతున్నాయట పార్టీ అధిష్టానానికి. అన్నిటికీ మించి వలసలు కంగారుపెడుతున్నాయట. నీవు నేర్పిన విద్యయే కదా.. అన్నట్టుగా కాంగ్రెస్ కొడుతున్న దెబ్బలకు కారు పార్టీ విలవిల్లాడుతోందన్నది పొలిటికల్ టాక్. బీఆర్‌ఎస్ నుంచి గెలిచిన ముగ్గురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కండువా కప్పేసుకున్నారు. దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లమ్ వెంకట్రావు పార్టీ మారిపోయారు. ఖైరతాబాద్ నుంచి గెలిచిన దానం నాగేందర్ అయితే ఏకంగా సికింద్రాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. ఇక కడియం శ్రీహరి కూతురు కావ్యను వరంగల్ పార్లమెంట్ అభ్యర్థిగా బీఆర్‌ఎస్ ప్రకటించాక కూడా కాంగ్రెస్ లోకి వెళ్లి ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారామె. ఈ ముగ్గురే కాకుండా…ఇంకొంతమంది ఎమ్మెల్యేలు కూడా బీఆర్‌ఎస్‌ను వీడతారన్న ప్రచారం జోరుగా జరుగుతోంది. దీంతో కంగారు పడుతున్న గులాబీ అధిష్టానం ఆ వలసలకు చెక్ పెట్టడంపై దృష్టి సారించినట్టు తెలుస్తోంది. పార్టీ మారిన వారిని లా తో కొట్టాలనుకుంటున్నారట. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని స్పీకర్ కు లేఖ రాసింది. ఇక అదే సమయంలో స్పీకర్ చర్యలు తీసుకోవడం లేదంటూ న్యాయ పోరాటం కూడా మొదలుపెట్టింది. ఎమ్మెల్యేల పై అనర్హత వేటేసేలా చర్యలకు ఆదేశించమంటూ హై కోర్ట్‌లో పిటిషన్ వేశారు బీఆర్‌ఎస్ నేతలు. అయితే… ఆ విషయంలో స్పీకర్‌ను ఆదేశించలేమని కోర్ట్ చెప్పే అవకాశం ఉందని ముందే ఊహిస్తున్న కారు పార్టీ పెద్దలు పకడ్బందీ ప్రణాళికను సిద్ధం చేస్తున్నారట.
గతంలో పార్టీ మారిన ఎమ్మెల్యే లపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పట్టుకొని హై కోర్ట్‌కు వెళ్ళారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఖచ్చితంగా ఒక పార్టీ గుర్తు పై గెలిచి మరో పార్టీ లోకి వెళ్లిన ఎమ్మెల్యే లపై అనర్హత పడుతుంది ఆశిస్తోంది బీఆర్‌ఎస్. అదే సమయంలో ఎమ్మెల్యేలు పార్టీ మారిన స్థానాల్లో ఉప ఎన్నికలు ఖచ్చితంగా వస్తాయని, అప్పుడు డిపాజిట్స్ కూడా రాకుండా ఓడగొడతామంటూ మైండ్ గేమ్‌కు తెరలేపినట్టు తెలిసింది. ఇలా ఉప ఎన్నికల పేరు చెప్పి …పార్టీ మారాలనుకున్న వారిని భయపెట్టాలన్నది వ్యూహంగా తెలిసింది. సుప్రీంకోర్టు తీర్పు ను ఆస్త్రం గా చూపిస్తూ… మరింత మంది చేజారకుండా చూసుకోవాలన్నది తెలంగాణ భవన్ వర్గాల ప్లాన్ అట. అయితే అదే సమయంలో మరో ప్రశ్న కూడా వస్తోంది.
బీఆర్‌ఎస్ నుంచి ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఒకేసారి గంపగుత్తగా కాంగ్రెస్ వైపు వెళ్ళి… తామే ఎక్కుమ మందిమి ఉన్నాం కాబట్టి కాంగ్రెస్ ఎల్పీలో విలీనం చేయమంటే ఏం చేయాలో అర్ధంకాని పరిస్థితి బీఆర్‌ఎస్‌ది. అందుకే వాళ్ళు అంతదాకా వెళ్ళక ముందే న్యాయ పోరాటం పేరుతో బ్రేకులు వేయాలన్నది ప్లాన్‌గా తెలిసింది. గతంలో కాంగ్రెస్ నుంచి వెళ్ళిన ఎమ్మెల్యేలను బీఆర్‌ఎస్ అలాగే విలీనం చేసుకుంది. ఈ పరిస్థితుల్లో జంపింగ్ పాలిటిక్స్ రసవత్తరంగా మారుతున్నాయి.
