Site icon NTV Telugu

Off The Record: గుంటూరు టీడీపీ ఆఫీస్‌లో కక్కుర్తి బ్యాచ్‌

Tdp

Tdp

Off The Record: అయిన వాళ్లకు ఆకులు, కానీ వాళ్లకు కంచాలన్న సామెతను గుర్తు చేస్తున్నారట గుంటూరు జిల్లా టీడీపీ నాయకులు. పార్టీ ఆఫీస్‌కి వచ్చిన కార్యకర్తలను, చోటామోటా నేతలను లోపలికి అడుగుపెట్టనివ్వడం లేదట. ఓపక్క ఎన్నికల ఫీవర్, మరోవైపు ఎండ వేడి సెగ పుట్టిస్తుంటే…పార్టీ కార్యాలయంలో కాసేపు సేదతీరుదామని, నాలుగు రాజకీయ ముచ్చట్లు చెప్పుకుందామని వస్తున్న నాయకులను మీకు ఇక్కడేం పని, వచ్చిన పని ఏయిపోయిందిగా ఇక పదండని మొహం మీదే చెప్పి బయటకు పంపించేస్తున్నారట ….ఇంకా గట్టిగా మాట్లాడితే పార్టీ ఆఫీస్‌కి తాళం వేసి చేతులు దులుపుకుంటున్నారట. గట్టిగా అడిగిన వాళ్ళని ఇదేమన్నా.. మీ ఇల్లా వచ్చి కూర్చోవడానికి అని దబాయించేస్తున్నారట. ఇదెక్కడి చోద్యం రా బాబూ… ఎలక్షన్‌ ఇయర్‌లో కూడా పార్టీ ఆఫీస్‌కి కార్యకర్తలు రాకుండా చేస్తున్నారని సణుక్కుంటున్నారట ద్వితీయ శ్రేణి నేతలు.

ఇంతకీ కారణం ఏంటని ఆరా తీస్తే… కళ్ళు బైర్లు కమ్మే విషయాలు తెలిశాయట. కార్యకర్తలకి ఫ్యాన్లు ,లైట్లు వేసి సమావేశం మందిరంలో కూర్చోబెడితే వచ్చే కరెంటు బిల్లు తట్టుకోలేక పోతున్నారట.వచ్చి పోయే వారికి మంచినీళ్లు, టీలు సరఫరా చేయలేక, ఆ ఖర్చంతా మనకెందుకు అని పార్టీలోని కొంతమంది ఇలాంటి ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది….పైపెచ్చు పార్టీ వ్యవహారాల్లో గ్రూపిజం ఎక్కువై ఏ నాయకుడిని ఇక్కడ ఉంచాలి? ఏ నాయకుడిని ఉంచకూడదు, ప్రెస్మీట్లకు ఎవరిని పిలవాలి, ఎవరిని పిలవకూడదు. పార్టీ కార్యక్రమాలకు ఎవరికి మెసేజ్ పంపించాలి, ఎవరికి అసలు పంపించకూడదు …లాంటి వన్నీ ఒక పథకం ప్రకారం జరుగుతున్నాయట. వ్యవహారాలన్నీ కొందరి కనుసన్నల్లోనే జరగటంతో పార్టీలో సెకండ్ గ్రేడ్ నాయకులు తీవ్ర ఆవేదన చెందుతున్నారట. ఒకప్పుడు ఉమ్మడి జిల్లాలో 17 నియోజకవర్గాలు ఉన్నప్పుడు కళకళలాడిపోయిన టిడిపి జిల్లా ఆఫీస్‌… ఆ తర్వాత రాష్ట్ర కార్యాలయంగా కూడా ఒక వెలుగు వెలిగింది. కానీ ఇప్పుడు మాత్రం భవనానికి ఆలానా పాలన లేక శిధిలావస్థకు చేరుకునేలా కనిపిస్తోంది…. పార్టీ నాయకులు డబ్బు ఇస్తున్నా….కనీసం రిపేర్లు చేయించే తీరిక కూడా ఇక్కడున్న నాయకులకు లేదట.

పేరుకి గుంటూరు పార్లమెంటు పరిధిలో ఉన్న నాయకులు అందరూ గుంటూరులోనే మకాం వేసి ఉన్నా.. ఎవరికీ ఇక్కడ పార్టీ కార్యాలయం మీద ప్రేమ గాని అభిమానం గాని ఉన్నట్లు కనిపించడం లేదన్నది కార్యకర్తల మాట. మరోవైపు జిల్లా పార్టీ కార్యాలయ నిర్వహణ కోసం నెల నెలా కీలక నాయకులు ఇస్తున్న సొమ్ముని కూడా సొంత ప్రాపర్టీ లా ఫీలవుతున్నారని, పార్టీ కార్యాలయాన్ని ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీల భావిస్తున్నారని, లోపలికి రావాలంటే పర్మిషన్ తీసుకోవాలా అంటూ ఆవేదన చెందుతున్నారు కార్యకర్తలు. ఈ పరిస్థితి కార్యకర్తలకే కాదని, అంతో ఎంతో పార్టీలో పరపతి ఉన్న కమిటీ కోఆర్డినేటర్లకు కూడా ఇదే పరిస్థితి దాపురించింది అనేది పార్టీ వర్గాలు అంటున్న మాట. కార్యకర్తలు లేకుండా నాయకులు వచ్చి కూర్చుని ఎవరికి ఏ సేవ చేస్తారో, పార్టీని ఎలా అధికారం లోకి తెస్తారో చెప్పాలనీ కార్యకర్తలు సెటైరిక్ కామెంట్లు వేస్తున్నారు. ఇలాగే ప్రవర్తిస్తే రాబోయే ఎన్నికల్లో జిల్లా పార్టీ కార్యాలయంలో కేవలం నాయకులు మాత్రమే మిగులుతారన్న కామెంట్లు వినిపిస్తున్నాయి…. మరి కార్యకర్తల గోడు నాయకులకు అర్థమవుతుందా! పార్టీ ఆఫీస్‌ని కార్యకర్తలకు, కమిటీలకు అందుబాటులోకి వచ్చే విధంగా పరిస్థితులు చక్కబడతాయా? లేక కరెంటు బిల్లులకు భయపడి తాళాలు వేలాడదీస్తారో చూడాలి.

Exit mobile version