Site icon NTV Telugu

Off The Record: పటాన్‌చెరు కాంగ్రెస్‌లో ఆరని మంటలు.. పరిష్కారం కోసం ఇద్దరు సభ్యుల పార్టీ కమిటీ!

Patancheruvu Congress

Patancheruvu Congress

కాంగ్రెస్ పార్టీ అంటే అంతేనా? అక్కడ కమిటీలంటే కాలయాపన కోసమేనా..? ఓ వైపు భగభగమని మండిపోతూ తగలబడుతుంటే… నిదానంగా చూద్దాం, చేద్దాం అన్న జానర్‌ నుంచి పార్టీ పెద్దలు సైతం బయటికి రాలేరా? అంతా కంటి తుడుపు వ్యవహారమేనా? ఇంతకీ… అసలీ ప్రస్తావన ఇప్పుడెందుకు వచ్చింది? ఏ కమిటీ విషయమై పార్టీలో చర్చ జరుగుతోంది?

తెలంగాణ కాంగ్రెస్‌కి… బీఆర్‌ఎస్‌ నుంచి వచ్చి చేరిన ఎమ్మెల్యేలతో లాభం కంటే.. తలనొప్పి ఎక్కువైందన్న అభిప్రాయం బలపడుతోంది. ఇందులో అతి ముఖ్యమైనది మొదట్నుంచి వివాదాలకు కేరాఫ్‌గా ఉన్న పటాన్‌చెరు అసెంబ్లీ నియోజకవర్గం. గతంలో ఇక్కడి కాంగ్రెస్‌ నాయకులంతా…. రోడ్డెక్కి నానా రచ్చ చేశారు. దీంతో… అప్పట్లో ఇద్దరు సభ్యులతో కమిటీ వేసింది పీసీసీ. ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి, నియోజకవర్గ కాంగ్రెస్‌ ఇన్ఛార్జ్‌ కాటా శ్రీనివాస్ గౌడ్, మంత్రి దామోదర రాజనర్సింహ… సీనియర్‌ లీడర్‌ జగ్గారెడ్డి… ఇలా అందరితో భేటీ అయ్యింది కమిటీ. అలాగే ఇతర నేతలతో కూడా సమావేశమై అందరి అభిప్రాయాలు సేకరించింది. కానీ ఇప్పటి వరకు నివేదిక మాత్రం ఇవ్వలేదు. దీంతో ఇప్పుడు కొత్త అనుమానాలు వ్యక్తం అవుతున్నాయట పార్టీ వర్గాల్లో. అప్పట్లో కేవలం పటాన్‌చెరు కాంగ్రెస్ నేతల ఆగ్రహాన్ని చల్లార్చేందుకే కమిటీ వేశారా..? మమ అనిపించేసి మభ్యపెట్టారా అన్న డౌట్స్‌ పెరుగుతున్నట్టు తెలిసింది.

అలా కాకుంటే…. కమిటీ నివేదిక ఇవ్వడానికి ఎందుకు ఆలస్యం చేస్తోందన్నది స్థానిక నాయకుల క్వశ్చన్‌. పార్టీ నాయకత్వం సమస్యను సెటిల్ చేస్తే మంచిదేకదా? అయినా…. ఎందుకు తాత్సారం చేస్తున్నారన్న చర్చ నడుస్తోంది. రాష్ట్ర పార్టీకి కొత్త ఇన్ఛార్జ్‌గా మీనాక్షి నటరాజన్ వచ్చిన రోజునే కొంత సీరియస్‌గా రియాక్ట్ అయ్యారు. ఒరిజినల్ కాంగ్రెస్ నేతలకు అన్యాయం జరగనివ్వబోనని భారీ డైలాగులు కూడా కొట్టారు అగ్రనేతలు. కానీ… ఇప్పటికీ ఏ మార్పు లేదు. కమిటీ కమిటీలాగే ఉంది.. రిపోర్ట్‌ ఊసే లేదు. దీంతో సమస్య జటిలం అవుతోందంటున్నాయి పటాన్‌చెరు కాంగ్రెస్‌ వర్గాలు. ఈ క్రమంలో నియోజకవర్గంలోని మార్కెట్ కమిటీ చైర్మన్స్‌ నియామకంపై గందరగోళం పెరుగుతోందట. గతంలో వేసిన కమిటీలను పార్టీ మారి వచ్చిన ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి మార్చారని… కొత్తగా అంతా బీఆర్‌ఎస్‌ నుంచి వచ్చిన వాళ్ళకే పదవులు దక్కుతున్నాయంటూ…. కుతకుతలాడిపోతున్నారట పాత కాంగ్రెస్‌ నాయకులు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీ కోసం పని చేసినవాళ్ళంతా ఇప్పుడు నారాజ్‌గా ఉన్నట్టు చెబుతున్నారు.

మార్కెట్ కమిటీల్లో మార్పుల వ్యవహారం పటాన్‌చెరు కాంగ్రెస్‌లో కాస్త సీరియస్‌గానే ఉన్నట్టు సమాచారం. ఓ వైపు కాంగ్రెస్ వేసిన కమిటీ ఏం తేల్చకపోవడం… మరో వైపు బయట నుండి వచ్చిన వారి ముందు మేం అవమానాలు పాలవుతున్నామన్న ఫీలింగ్‌ పాత నాయకుల్లో బలంగా ఉందట. అయితే… ఇక్కడొక్క చోటే ఇంత రచ్చ ఎందుకు జరుగుతోంది? పార్టీ పెద్దలు ఎందుకు సెట్ చేయాలేకపోతున్నారన్నది మాత్రం మిలియన్‌ డాలర్‌ క్వశ్చన్‌ అంటున్నారు పరిశీలకులు. సాధారణంగా సమస్యని ఎంత నానబెడితే…అంత తేలిగ్గా పరిష్కారం అవుతుందన్నది కాంగ్రెస్‌ వైఖరి. కానీ పార్టీ కోసం పని చేసిన వాళ్ల విషయంలో కూడా ఇలాంటి ధోరణి సరికాదన్నది సీనియర్ నేతల సూచన. ఇంత సీరియస్‌గా లేకున్నా…. ఎమ్మెల్యేలు పార్టీ మారిన మిగతా తొమ్మిది నియోజకవర్గాల్లో కూడా ఇదే పరిస్థితి ఉందని, చాలామంది సీనియర్స్‌, అప్పడు పార్టీ కోసం పని చేసిన వాళ్ళు… ఇప్పుడు అంటీ ముట్టనట్టే ఉంటున్నారట. దీన్ని ఇలాగే వదిలేస్తే….ఎన్నికల నాటికి ఇదే పెద్ద సమస్యగా మారే ప్రమాదం ఉందంటున్నారు. స్థానిక నేతల వ్యవహారం ఎలా ఉన్నా… కనీసం రాష్ట్ర ఇన్ఛార్జ్‌ అయినా… దీనిమీద దృష్టి పెట్టి సెట్ చేయాల్సిన అవసరం ఉందని అంటున్నాయి కాంగ్రెస్‌ వర్గాలు. అలా చేయకుండా… ఎవరికి వారు.. అదంతేనని అనుకుంటే మాత్రం కార్యకర్తలలో ఆత్మస్థైర్యం దెబ్బతినే ప్రమాదం లేకపోలేదు.

Exit mobile version