NTV Telugu Site icon

Off The Record: ఉత్తరాంధ్రలో ఆ సామాజిక వర్గం పై వైసీపీ ఫోకస్ పెట్టిందా..?

Ysrcp

Ysrcp

Off The Record: ఉమ్మడి విశాఖ జిల్లాలో గవర్లకు ప్రత్యేక గుర్తింపు ఉంది. సీనియర్‌ లీడర్స్‌ దాడి వీరభద్రరావు, కొణతాల రామకృష్ణ ఈ సామాజికవర్గానికి చెందినవారే. అనకాపల్లి సిట్టింగ్‌ ఎంపీ భీశెట్టి సత్యవతి, విశాఖ పశ్చిమ నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే గణబాబు కూడా గవర్లే. ఉమ్మడి విశాఖ వరకు నామినేటెడ్ పదవుల్లోనూ వీళ్ళకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంటాయి రాజకీయపార్టీలు. ఉత్తరాంధ్రలో ఈ సామాజికవర్గానికి చెందినవారు దాదాపు 20 లక్షల మంది ఉన్నారు. విశాఖ పశ్చిమ, ఉత్తర, దక్షిణ, గాజువాక, పెందుర్తి, నియోజకవర్గాల పరిధిలో వీళ్ళే డిసైడింగ్‌ ఫ్యాక్టర్‌. అనకాపల్లిలో బలమైన సామాజిక వర్గంగా రాజకీయ ప్రాబల్యం చాటుకుంటున్నారు గవర్లు.

గతం ఎలా ఉన్నా.. దశాబ్దకాలంగా తమకు రాజకీయ ప్రాధాన్యం తగ్గుతోందన్న అసంతృప్తి గవర్లలో ఎక్కువైంది. ప్రస్తుతం దాడి వీరభద్రరావు, కొణతాల వంటి నేతలు తెర మరుగయ్యే ప్రమాదం ఏర్పడింది. అధికార పార్టీలోనే ఉన్నా… దాడి కుటుంబం స్తబ్దుగా వుంది. గత ఎన్నికల్లో టిక్కెట్ ఆశించినా… వైసీపీ ఛాన్స్ ఇవ్వలేదు. ఈసారి కూడా టిక్కెట్ రాకుంటే ఇక రాజకీయం వదిలేసుకోవడమే మేలన్న అభిప్రాయంతో ఉందట దాడి ఫ్యామిలీ. దీనికి బలమైన కారణం అనకాపల్లి కేంద్రంగా జరుగుతున్న వర్గ రాజకీయాలు. ఇక్కడ మంత్రి గుడివాడ అమర్నాథ్‍., ఎంపీ సత్యవతి ఒక గ్రూప్ అయ్యారు. వీరితో ఢీ అంటే ఢీ అంటోంది దాడి వర్గం. వచ్చే ఎన్నికల్లో సిట్టింగ్ సీటు నుంచి పోటీ చేసే ఆలోచనలో మంత్రి అమర్నాథ్‌ లేరనే ప్రచారం చాలా కాలంగా జరుగుతోంది. అదే నిజమైతే… ఆ టిక్కెట్‌ ఖచ్చితంగా దాడి కుటుంబానిదేన్న అంచనాలు ఇన్నాళ్ళు ఉండేవి. కానీ.. తాజాగా ఎంపీ సత్యవతి పోటీకి సిద్ధం అవుతున్నారట. మంత్రి తప్పుకుంటే.. సిట్టింగ్ ఎంపీగా తన అభ్యర్ధిత్వాన్ని పరిశీలించాలని హైకమాండ్‌కు ఇప్పటికే ప్రతిపాదించారట. దీంతో దాడి వర్గం వ్యూహాత్మక మౌనం పాటిస్తోంది. అటు, కొణతాల రామకృష్ణ యాక్టివ్ పాలిటిక్స్‌కు దూరమై చాలా కాలమే అయిపోయింది. అదే సమయంలో మొదటి నుంచి వెన్నంటి వున్న గవర్లకు ప్రాధాన్యతను కొనసాగిస్తూ వచ్చింది టీడీపీ.

గత ఎన్నికల్లో ఎమ్మెల్యే గణబాబు గెలవగా, బుద్ధా నాగజగదీష్ కు ఎమ్మెల్సీగా, అనకాపల్లి జిల్లా అధ్యక్షుడిగా అవకాశం కల్పించింది. బీసీ సామాజిక వర్గాల్లో… మరీ ముఖ్యంగా గవర, వెలమ,మత్స్యకార వర్గాల్లో పట్టు కారణంగానే ఇక్కడ టీడీపీ ఆధిక్యత ప్రదర్శించగలుగుతోంది. దీనికి కౌంటర్‌గా సోషల్ ఇంజనీరింగ్ కు మరింత పదును పెడుతోందట వైఎస్సార్ సీపీ. గవర సామాజిక వర్గానికి అన్యాయం జరుగుతోందనే అభిప్రాయాన్ని తొలగించే దిశగా అడుగులు వేస్తోంది. మాజీ ఎమ్మెల్యే మళ్ళ విజయప్రసాద్ కు ఏపీ విద్యాభివృద్ధి కార్పోరేషన్ చైర్మన్ ఇచ్చింది. విశాఖ పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త ఆడారి ఆనంద్ కుమార్ కు ఏపీ msme కార్పోరేషన్ చైర్మ న్ గా నియమించింది. వచ్చే ఎన్నికల్లో గవర సామాజిక వర్గంపై పూర్తిస్ధాయిలో పట్టు సాధించడమే లక్ష్యంగా అధికార పార్టీ నిర్ణయాలు తీసుకుంటోంది. అందులో భాగంగానే కీలకమైన అనకాపల్లి జిల్లా అధ్యక్ష పదవి నుంచి కాపు సామాజిక వర్గానికి చెందిన కరణం ధర్మశ్రీని తప్పించింది. ఆ స్ధానంలో గవర కార్పోరేషన్ చైర్మన్ బొడ్డేడ ప్రసాద్ ను నియమించింది.

కాపు, వెలమ సామాజిక వర్గాల ఓటు బ్యాంక్ ఎక్కువగా వున్న నియోజకవర్గాల్లో గవర్లు డిసైడింగ్ ఫ్యాక్టర్. చాలా స్ధానాల్లో వీరిలో ఏ రెండు కులాలు కలిసి వచ్చినా విజయం సాధ్యం అవుతుంది. ఈ లెక్కలు వేసుకున్న తర్వాత గవర్లకు తాము ఎంత ప్రాధాన్యత కల్పిస్తున్నామో చెప్పే ప్రయత్నం చేస్తోంది వైసీపీ. ఈ క్రమంలో అనకాపల్లిలో కొత్త అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్ భారీ ర్యాలీ నిర్వహించారు. మంత్రి అమర్నాథ్, పార్టీకి చెందిన ముఖ్య నాయకత్వం తరలి వచ్చింది. ఇదేదో అభినందన ర్యాలీగా మొదట్లో అనుకున్నా… ఈ ప్రయత్నం వెనుక గవర్లకు ఇస్తున్న ప్రాధాన్యతను బలంగా చెప్పడమే అసలు ఉద్దేశమని చర్చ జరుగుతోంది. ఒక విధంగా టీడీపీ కంటే తామే ఎక్కువ అవకాశాలు కల్పిస్తున్నామని….భవిష్యత్తులో మరింత రాజకీయ ప్రయోజనాలు లభించబోతున్నాయనే సంకేతాలు పంపే ప్రయత్నంలో ఉంది వైసీపీ. దీని ప్రభావం నాలుగైదు స్థానాల్లో ఉంటుందని అంచనా వేస్తున్నాయి పార్టీ వర్గాలు.