Off The Record: వైసీపీకి కొరకరాని కొయ్యగా మారిన అసెంబ్లీ నియోజకవర్గాల్లో విశాఖపట్నం తూర్పు ఒకటి. టీడీపీ తరపున వెలగపూడి రామకృష్ణ బాబు ఇక్కడ హ్యాట్రిక్ ఎమ్మెల్యే. 2009,14,19ల్లో ఆయన విజయం సాధించారు. ఆయనకు బ్రేకులు వేసేందుకు ఒకసారి పీఆర్పీ, రెండు సార్లు వైసీపీ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఇక్కడ ఎమ్మెల్యే సొంత సామాజిక వర్గం ఓటు బ్యాంకు కూడా అంతంత మాత్రమే. అయినా… వెలగపూడికి మెజారిటీ పెరుగుతోందే తప్ప తగ్గడం లేదు. ప్రజలతో సత్సంబంధాలు, వర్గ రాజకీయాలకు దూరం, అవినీతి మరకలు పడకపోవడం వంటివి ఆయనకు సానుకూల అంశాలు. అయితే… ఇప్పుడు వైనాట్ 175 అంటోన్న వైసీపీ హైకమాండ్ … విశాఖ తూర్పును సీరియస్‌గా తీసుకుందట. నియోజకవర్గంలో బీసీ నాయకత్వాన్ని బలోపేతం చేయడం ద్వారా ఎమ్మెల్యే కు చెక్ పెట్టే ప్రయత్నంలో ఉందట. అందుకే ఎమ్మెల్సీగా వంశీ కృష్ణ యాదవ్, VMRDA చైర్ పర్సన్ గా అక్కరమాని విజయ నిర్మల, మేయర్‌గా గోలగాని హరి వెంకట కుమారికి అవకాశం కల్పించిందట. అదే సమయంలో వచ్చే ఎన్నికల్లో తూర్పు నుంచి బీసీలకే ఛాన్స్ అనే అంచనాలతో ఈ మూడువర్గాలు టిక్కెట్ ఆశించి రాజకీయాలు నడుపుతున్నాయి. కానీ….అగ్ర నాయకత్వం ఆలోచన మాత్రం వీళ్ళెవరూ ఊహించని విధంగా.. మరోలా ఉందట.
నియోజకవర్గ సమన్వయకర్త బాధ్యతను వెలగపూడి రామకృష్ణబాబు సామాజికవర్గానికే చెందిన విశాఖ MP ఎం.వి.వి.సత్యనారాయణ చేతుల్లో పెట్టాలని నిర్ణయించింది వైసీపీ అధిష్టానం. ఈ ఆలోచన చాలా కాలం క్రితమే ఉన్నా… ఎంవీవీ పూర్తిస్థాయిలో సన్నద్దత ప్రకటించని కారణంగా ఆలస్యం అయింది. ఇప్పుడు ఎన్నికలకు సమయం దగ్గరపతుండటం,బలమైన రాజకీయ ప్రత్యర్థిని ఎదర్కోవాల్సి రావడంతో ఒకటి రెండు రోజు ల్లో కొత్త సమన్వయకర్త పేరు ప్రకటన వెలువడనుందట. ఈ దిశగా ఉమ్మడి విశాఖజిల్లా ఇన్ఛార్జ్ వైవీ సుబ్బారెడ్డితో ఎంవీవీ చర్చలు పూర్తయినట్టు తెలుస్తోంది. ఇప్పటికే నియోజకవర్గ పరిధిలో జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు ఎంవీవీ. ఇక్కడ నుంచే తూర్పు నియోజకవర్గం కేంద్రంగా అధికార వైసీపీలో ఆసక్తికరమైన రాజకీయం మొదలవుతుందనే చర్చ జరుగుతోంది. ఎంపీ ఎంట్రీతో వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ ఆశిస్తున్న గ్రూపులకు పూర్తి స్థాయిలో గండిపడినట్టేనట.
2017 తర్వాత అనూహ్యంగా రాజకీయాల్లోకి వచ్చారు ఎంపీ ఎంవీవీ. రియల్టర్ గా విశాఖతో 30ఏళ్ళ అనుబంధం ఒక లెక్క…..ఎంపీ గా ఈ నాలుగేళ్లు మరో లెక్క అనేలా ఉందట వ్యవహారం. విశాఖ అభివృద్ధి మీద ఆయనకంటూ ప్రత్యేక ముద్ర లేకపోయినా ఆర్ధికంగా బలమైన అభ్యర్థి అనే అంచనాలు ఉన్నాయి. కమ్మ సామాజికవర్గం కావడంతో ఎమ్మెల్యే రామకృష్ణ బాబును ఢీ కొట్టడం ఈజీ అవుతుందనేది హైకమాండ్ ఆలోచనగా చెప్పుకుంటున్నారు. అయితే…వెలగపూడిని ఢీ కొట్టడం కంటే.. ముందు ఎంపీకి ఇంటిపోరు పెద్ద టాస్క్ అన్న చర్చ జరుగుతోంది. ఎమ్మెల్సీ వంశీ కృష్ణ యాదవ్, ఎంపీ ఎంవీవీల మధ్య రాజకీయ వైరం ఉంది. షిప్పింగ్ వ్యాపారంలో ఉన్న వంశీకృష్ణ ప్రజారాజ్యం పార్టీతో రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 2009.,2014లో పీఆర్పీ,వైసీపీల నుంచి పోటీ చేసి ఓడిపోయారు. గత 12ఏళ్లుగా నియోజకవర్గంలో పార్టీకి ముఖ్య నాయకుడి గా చెలామణి అవుతున్నారు వంశీ. గ్రేటర్ మేయర్ పీఠం దక్కినట్టే దక్కి చేజారిపోయింది. దీంతో ఎమ్మెల్సీగా చాన్స్ ఇచ్చింది హైకమాండ్. ఈ నేపథ్యంలో 2024నాటికి పోటీకి సిద్ధమని వంశీకృష్ణ చెప్పుకుని తిరిగే వారు. ఇక్కడ రాజకీయ ప్రత్యర్థి వెలగపూడి కంటే ఎంపీ ఎంవీవీ తో ఉన్న వ్యక్తిగత విభేదాలు అసలు కారణం అనేది చర్చ. ఈ పరిస్థితుల్లో ఈసారి విశాఖ తూర్పు వైసీపీ అభ్యర్థి ముందు ఇంటి పోరును చక్కదిద్దుకుని వెలగపూడిని ఢీ కొట్టడానికి సిద్ధం కావాల్సి ఉంది.