NTV Telugu Site icon

Off The Record: వైసీపీలో ఫైనల్‌ లిస్ట్‌ టెన్షన్‌..

Ycp

Ycp

Off The Record: వైసీపీ అభ్యర్థులు, ఆశావహుల్లో నరాలు తెగే ఉత్కంఠ. ఆ క్షణం ఎప్పుడొస్తుందా అని ఎదురు చూపులు. టిక్కెట్‌ రాని వాళ్ళ సంగతి పక్కనబెడితే… ఇప్పటికే ప్రకటించిన పేర్లు కూడా ఫైనల్‌ లిస్ట్‌లో ఉంటాయా? లేదా అన్న టెన్షన్‌లో కంటి మీద కునుకు కూడా రావడం లేదట నేతలకు. అభ్యర్థుల తుది జాబితాను ఈనెల 16న ప్రకటించాలని డిసైడైంది వైసీపీ అధిష్టానం. ఇడుపులపాయలోని వైయస్ఆర్ ఘాట్ దగ్గర లిస్ట్‌ విడుదల చేస్తారు పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి. ఆ లిస్ట్‌లో ఉండే పేర్లే ఫైనల్‌ కావడంతో.. ఆశావహుల్లో టెన్షన్‌ డబులవుతోందట. ఇప్పటి వరకు 12 జాబితాలను విడుదల చేసిన వైసీపీ. రకరకాల మార్పులు చేర్పులతో అవి బయటికి వచ్చాయి. అయితే కొన్ని చోట్ల ముందు ప్రకటించిన అభ్యర్థుల పేర్లను తర్వాతి జాబితాలో మార్చిన సందర్భాలు ఉన్నాయి. దీంతో ఇప్పటిదాకా విడుదలైన 12 జాబితాల సంగతి ఎలా ఉన్నా.. 16న విడుదలవబోయే ఫైనల్‌ లిస్ట్‌ కోసమే ఎక్కువ మంది ఆశగా చూస్తున్నారు.

అదే సమయంలో ప్రకటించిన వాళ్ళలో ఎంత మందిని మారుస్తారోనన్న భయాలు కూడా పెరుగుతున్నాయి పార్టీ నేతల్లో. మార్పులకు రాజకీయ, సామాజిక సమీకరణాలను కారణాలుగా చూపుతోంది పార్టీ అధినాయకత్వం. అదే సమయంలో గెలుపు గుర్రాలకే అవకాశమని చెప్పకనే చెబుతోంది. ఎమ్మిగనూరు, జీడీ నెల్లూరు, అరకు, కందుకూరు, మంగళగిరి, అవనిగడ్డ అసెంబ్లీ నియోజకవర్గాల్లో ముందు ప్రకటించిన వారిని కాకుండా కొత్త వారికి అవకాశం ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది వైసిపి అధిష్టానం. ఇప్పుడు తుది జాబితా విడుదల చేసే టైం దగ్గర పడుతుండడంతో.. వాటితో పాటు ఇంకెన్ని నియోజకవర్గాలు ఉంటాయోనని నేతల్లో టెన్షన్ మొదలైందట. డిసెంబర్ నుంచి అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తూ.. క్లారిటీ ఇస్తోంది వైసీపీ. ఇప్పటి వరకు 54 అసెంబ్లీ నియోజకవర్గాలలో కొత్త వారికి అవకాశం ఇచ్చింది. 30 మందికి పైగా సిట్టింగ్ ఎమ్మెల్యేలను పక్కన పెట్టారు. అదే సమయంలో పలు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉన్న అసమ్మతి, అసంతృప్త నేతలను బుజ్జగించే పని కూడా జరుగుతోంది.

ఇక తుది జాబితా రెడీ అయిపోయింది… ప్రకటనే మిగిలి ఉందన్న సిచ్యుయేషన్‌ రావడంతో… ఉన్నదెవరు, ఊడిందెవరన్న చర్చ జోరుగా జరుగుతోంది పార్టీ వర్గాల్లో. కొందరు ఆశావహులైతే… పార్టీ పెద్దలతో తమకున్న పరిచయాలను వాడుకుంటూ… అన్నా నా పేరుందేమో కొంచెం చెప్పవా అంటూ ఆరాలు తీస్తున్నారట. టీడీపీ-జనసేన-బీజేపీ పొత్తు ఖరారవడంతో… తమ పార్టీ అభ్యర్థుల ఎంపిక మీద ఆ ప్రభావం ఎంత వరకు ఉందన్న లెక్కలు తెలుసుకునే ప్రయత్నాల్లో ఉన్నారు మరి కొందరు నేతలు. కూటమి అభ్యర్థుల జాబితాతో పోల్చుకుంటూ… ఆ సమీకరణాల ప్రకారం మన దగ్గర ఎవరికి ఛాన్స్‌ ఉంటుందంటూ చర్చించుకుంటున్నారట వైసీపీ నేతలు. ఆ క్రమంలోనే ఎక్కడ తమ టికెట్ విషయంలో పార్టీ నిర్ణయం తేడాగా ఉంటుందేమోనన్న కంగారు ఆశావహుల్లో పెరుగుతోందంటున్నారు. మొత్తంగా 16 కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు వైసీపీ నేతలంతా.

వైసీపీలో ఫైనల్ లిస్ట్ టెన్షన్..March 16 న విడుదల | Off The Record | Ntv