Site icon NTV Telugu

Off The Record: సీటు నాదే.. పోటీ నాదే.. రంజుగా అనకాపల్లి వైసీపీ రాజకీయం..!

Anakapalle

Anakapalle

Off The Record: ఆంధ్రప్రదేశ్‌ రాజకీయ పార్టీలు కూడా ఎలక్షన్‌ మూడ్‌లోకి వెళ్తున్నాయి. అయితే.. అధికార, విపక్షాల కంటే…సొంత పార్టీల్లో జరుగుతున్న అంతర్గత వ్యవహారాలే యమ రంజుగా మారుతున్నాయి. సీట్ల విషయంలో పెరుగుతున్న ఊహాగానాలు నేతల మధ్య విమర్శలకు, తెరచాటు ఎత్తుగడలకు కారణం అవుతున్నాయి. ఈ క్రమంలోనే ఉత్తరాంధ్రలో ఎక్కువ చర్చ జరిగే స్థానం అనకాపల్లి. మాజీమంత్రులు కొణతాల రామకృష్ణ, దాడివీరభద్రరావు, గంటా శ్రీనివాస్‌ లాంటి నేతలు గతంలో ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించారు. కాపు, గవర సామాజిక వర్గాలు ఇక్కడ ప్రధానమైనవి. అనకాపల్లి మీద మొదటి నుంచీ గవర నేతల ఆధిపత్యం కొనసాగగా.. 2009లో ఈ లెక్కలను మాజీమంత్రి గంటా శ్రీనివాసరావు బ్రేక్ చేశారు. 2019లో వైసీపీ ఈ విధానాన్నే పాటించి సక్సెస్ అయ్యింది. గత ఎన్నికల్లో ఇక్కడి నుంచి గెలిచిన గుడివాడ అమర్నాథ్ జగన్ మంత్రి వర్గంలో చోటు దక్కించుకున్నారు. తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచినా.. అమాత్య పీఠం ఎక్కిన వాళ్ళలో అమర్నాథ్ ఒకరు. నియోజకవర్గం మీద తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకోవాలనే ప్రయత్నాన్ని ఎమ్మెల్యే అయిన తొలిరోజు నుంచే మొదలు పెట్టారాయన. ఆ దిశగా మొదట్లో అంతా సానుకూలంగానే కనిపించినా తరవాత గ్రూపుల గోల ఎక్కువైంది. వీలు చిక్కిన ప్రతీసారీ మంత్రి, ఎంపీ, దాడి వర్గీయులు వేడిని రాజేసుకుంటూనే వున్నారు.

ఈ క్రమంలోనే వచ్చే ఎన్నికల్లో మంత్రి అమర్నాథ్ అనకాపల్లి నుంచి మరోసారి పోటీ చేయరనే ప్రచారం విస్తృతంగా జరిగింది. అయితే యలమంచిలి లేకపోతే పెందుర్తి సీటును సేఫ్ జోన్ గా భావిస్తున్నారనే ఊహాగానాలు ఎక్కువయ్యాయి. అదే సమయంలో కాపు సామాజిక వర్గానికి అనకాపల్లి ఎంపీ టిక్కెట్ కేటాయించాలనే ఆలోచనలో వైసీపీ హైకమాండ్ ఉందనే సమాచారం ఊపు తెచ్చింది. ఎంపీగా అమర్నాథ్ పేరును పరిశీలిస్తారనే మౌత్ పబ్లిసిటీ పెరిగింది. ఇవన్నీ సిట్టింగ్ సీటుపై కన్నేసిన సీనియర్ నేత దాడి వీరభద్రరావు, ఎంపీ సత్యవతమ్మ వర్గాలకు కలిసి వచ్చాయి. ఇక్కడ నుంచే ఎత్తులు,పై ఎత్తులు మరింత విస్త్రతం కాగా మంత్రి వెర్సస్ దాడి వర్గంగా వ్యవహారం ముదిరి పాకానపడింది. అమర్‌నాథ్‌ సీట్ ఖాళీ చేస్తే తన కుమారుడు రత్నాకర్ కు పోటీచేసే అవకాశం వస్తుందని చాలా కాలంగా దాడి వీరభద్రరావు ఎదురు చూస్తున్నారు. ఈసారి ఛాన్స్ రాకపోతే ఇక ప్రత్యక్ష రాజకీయాలు నడపడంలో అర్ధం లేదనేది ఆయన అభిప్రాయం. ఈ కారణంగానే ప్రతీ అవకాశాన్ని తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారు దాడి.

అనకాపల్లిలో పేరుకి తెలుగుదేశం ప్రతిపక్షం అయినప్పటికీ స్వపక్షంలో రాజుకున్న కుంపటి అమర్నాథ్ కు ఇబ్బందికరంగా మారిందని వైసీపీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. వైరి వర్గం ఈ ప్రచారాలను విస్త్రతం చేయడమే కాదు… మంత్రి కావాలనే… కీలకమైన గవర సామాజిక వర్గానికి ప్రాధాన్యత తగ్గించారనే అభిప్రాయం పెరగడంతో… అప్రమత్తమయ్యారాయన. అందుకే… కీలకమైన అనకాపల్లి జిల్లా అధ్యక్ష పదవిని గవర కార్పొరేషన్ చైర్మన్ బొడ్డేట ప్రసాద్‌కు ఇప్పించడంలో కీలకంగా వ్యవహరించారు. దాంతోపాటు నామినేటెడ్ పదవులు, పార్టీ విభాగాల్లో నియమకల్లో గవర సామాజిక వర్గానికి ప్రాధాన్యత పెంచడం ద్వారా సమతుల్యత పాటిస్తున్నానని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు.

ఇంత కాలం అంతర్గత ఎత్తుగడలను మౌనంగా భరించానని, ఇన్ని రోజులు ఒక ఎత్తు, ఇక నుంచి మరో ఎత్తు అని సన్నిహితులకు చెబుతున్నారట మంత్రి. వచ్చే ఎన్నికల్లో అనకాపల్లి సీటు నాదే… అక్కడ పోటీ చేసేదీ నేనేనని సినిమా స్టైల్‌లో డైలాగ్‌లు చెప్పేస్తున్నారట. అమర్నాథ్‌ స్టేట్‌మెంట్స్‌తో ఇన్నాళ్ళు స్తబ్దుగా ఉన్న కేడర్‌లో దూకుడు పెరిగిందని, క్లారిటీ వచ్చిందని అంటున్నాయి స్థానిక పార్టీ వర్గాలు. గృహ సారధుల సమావేశంలో మంత్రి చేసిన వ్యాఖ్యలు అందరికంటే ఎక్కువగా దాడి వర్గాన్ని కలవరపెట్టినట్టు ప్రచారం జరుగుతోంది. ఈసారి సీటు మారతానని టీడీపీ, జనసేన కావాలనే ప్రచారం చేస్తున్నాయని, వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదని అమర్నాథ్‌ చెప్పడంతో…. ఆశలు పెట్టుకున్న దాడి వర్గం నిరాశ పడ్డట్టు చెప్పుకుంటున్నారు. ఇదే దూకుడుతో రాజకీయంగా అనకాపల్లి వైసీపీలో దాడి కుటుంబానికి దారులు మూసేయాలన్న వ్యూహం కనిపిస్తోందంటున్నారు పరిశీలకులు. 2019లో దాడి ఫ్యామిలీ ఈ టిక్కెట్‌ ఆశించినా… అవకాశం దక్కలేదు.
2024లో అమర్నాథ్ ఖాళీ చేస్తే ఎంటర్ అవుదామని ఓపికగా ఎదురు చూస్తుంటే ఇప్పుడు దానికి కూడా గండి పడినట్టే కనిపిస్తోంది. ఎలక్షన్‌ టైం దగ్గర పడేకొద్దీ అనకాపల్లి వైసీపీ రాజకీయం ఎన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.

Exit mobile version