Site icon NTV Telugu

Off The Record : వెల్లంపల్లి సీటు కింద సెగలు..ఈసారి టికెట్ రావడం కష్టమేనా ?

Vellampally

Vellampally

ఆ మాజీ మంత్రి సీటు కింద సెగ మొదలైందా? ఈసారి ఎన్నికల్లో టిక్కెట్‌ డౌట్‌లో పడిందా? నాడు ఓట్లేసి గెలిపించిన వాళ్ళే నాలుగేళ్ళు తిరిగేసరికి టిక్కెట్‌ ఇవ్వవద్దని నివేదికలు పంపడానికి కారణం ఏంటి? ఐ ప్యాక్‌ టీమ్‌ కూడా ఆయన కాస్త తేడాగా ఉన్నారని రిపోర్ట్‌ ఇచ్చిందా? ఎవరా నాయకుడు? ఎందుకు నెగెటివ్‌ రిపోర్ట్స్‌ పెరిగిపోతున్నాయి?

నియోజకవర్గంలో మొత్తం రెండు లక్షల 20వేల ఓట్లు ఉండగా అందులో మెజార్టీ వాటా మైనార్టీలదే. 60 వేలకు పైగా ముస్లిం మైనార్టీల ఓట్లు ఉన్నాయి ఇక్కడ. 2014 ఎన్నికల్లో వైసీపీ ఈ సీటును వారికే కేటాయించింది. 2019లో వెల్లంపల్లికి
ఇవ్వగా అయన గెలిచి మూడేళ్ల పాటు జగన్‌ కేబినెట్‌లో మంత్రిగా పని చేశారు. కానీ… ఎమ్మెల్యే అయ్యాక నియోజకవర్గంలో ఉన్న మైనార్టీ నేతలకు, ఆయనకు మధ్య గ్యాప్‌ వచ్చిందట. తమను పట్టించుకోవడం లేదన్న అసంతృప్తి ఆ వర్గంలో పెరిగిపోతోందని చెబుతున్నారు. రాను రాను మరింత ముదురుతూ… మెజార్టీ ఓట్లున్న తమకే ఈసారి సీటు ఇవ్వాలని డిమాండ్‌ చేసేదాకా వచ్చింది. గెలిచేదాకా బాగానే ఉన్నా… ఆ తర్వాతే ఎమ్మెల్యే తీరు మారిపోయిందన్న అసహనం స్థానిక ముస్లిం నేతల్లో ఉన్నట్టు చెబుతున్నారు. ఈ నియోజక వర్గానికి చెందిన తమను కాదని… టీడీపీ హయాంలో జలీల్‌ఖాన్‌తో సన్నిహితంగా ఉన్న వక్ఫ్‌బోర్డ్‌ మెంబర్‌, సెంట్రల్‌ నియోజకవర్గ నాయకుడు రుహుల్లాకి వెల్లంపల్లి అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నారన్నది లోకల్‌ లీడర్స్‌ ప్రధాన ఆరోపణ. దీంతో ఈసారి తమ వర్గానికే టిక్కెట్‌ ఇవ్వాలన్న డిమాండ్‌ను అధినాయకత్వం ముందు పెట్టారట స్థానిక నాయకులు. పశ్చిమ నియోజకవర్గానికే చెందిన మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఆసిఫ్ వర్గం కూడా ఎమ్మెల్యేకు దూరంగా ఉంటోంది. తనకు కాకుండా రుహుల్లాకు ఎమ్మెల్సీ వచ్చేలా అప్పట్లో మంత్రిగా ఉన్న వెల్లంపల్లి పావులు కదిపారని అసంతృప్తితో ఉన్నారు ఆసిఫ్.

మైనార్టీలతో పాటు నియోజకవర్గంలోని ఇతర సామాజికవర్గాలు కూడా మాజీ మంత్రి వ్యవహారశైలితో సంతృప్తిగా లేనట్టు చెబుతున్నారు. దీని మీద ఐ ప్యాక్ టీం ఇప్పటికే అధిష్టానానికి నివేదిక ఇచ్చినట్టు సమాచారం. నగరాల సామాజికవర్గం గురించి ఆ నివేదికలో ప్రత్యేకంగా ప్రస్తావించారట. మంత్రిగా ఉన్నప్పుడు నగరాలకు మేయర్‌ పదవి ఇప్పించడంలో కీలక పాత్ర పోషించిన వెల్లంపల్లి ఆ తర్వాత వారిలోనే చీలిక తెచ్చే ప్రయత్నం చేశారట. ఇప్పటికే ఉన్న అసోసియేషన్‌కు పోటీగా కొత్త సంఘాన్ని పెట్టించి వారిలో వారికే తంపులు పెట్టారన్నది లోకల్‌ టాక్‌. ఈ విషయంలో మొత్తం ఆ సామాజికవర్గమే అసంతృప్తిగా ఉందట. ఇలా అన్ని సామాజిక వర్గాలకు సంబంధించిన పూర్తి వివరాలను ఐ ప్యాక్‌ బృందం అధినాయకత్వానికి అందించినట్టు తెలిసింది. ఆ నివేదిక చూశాకే పార్టీ పెద్దలకు కూడా ఒక క్లారిటీ వచ్చి ఈసారి విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ప్రత్యామ్నాయం కోసం చూస్తున్నట్టు తెలిసింది. నివేదికల ప్రకారం వెల్లంపల్లి సీటు మారుస్తారా? అసలుకే ఎసరు వస్తుందా అన్నది చూడాలి.

Exit mobile version