NTV Telugu Site icon

Off The Record: ఇద్దరినీ పక్కన పెట్టడంతో కేడర్‌లో అసహనం.. కంచుకోటకు బీటలు పడే ముప్పు ముంచుకొచ్చిందా?

Undi

Undi

Off The Record: ఉండి నియోజకవర్గం టీడీపీ రాజకీయం ఆసక్తికరంగా మారింది. ఇక్కడ పార్టీ టికెట్ ఆశించి భంగపడ్డ మాజీ ఎమ్మెల్యే కలవపూడి శివ ఇప్పుడు ఇండిపెండెంట్‌గా బరిలో ఉన్నారు. పదేళ్లపాటు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్న శివరామరాజు వచ్చే ఎన్నికల్లో తన బలం నిరూపించుకునేందుకు సై అంటే సై అంటున్నారు. దీంతో ఇన్నేళ్ళు పార్టీకి కంచుకోటగా ఉన్న నియోజకవర్గంలో టీడీపీ కేడర్‌ కన్ఫ్యూజన్లో పడిందట. గతంలో పదేళ్లపాటు ప్రాతినిధ్యం వహించిన కలవపూడి శివకుగాని, గడిచిన ఐదేళ్ళ నుంచి ఎమ్మెల్యేగా ఉన్న రామరాజుకుగానీ పార్టీ అధిష్టానం ఈసారి అవకాశం కల్పించకపోవడమే అందుకు కారణం అంటున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజుకుకు సీటు ఇవ్వకపోతే సహకరించేది లేదంటూ తెగేసి చెప్పినా.. టీడీపి అధిష్టానం ఆ విషయాన్ని సీరియస్‌గా తీసుకోలేదు. రామరాజు కే సీటివ్వాలంటూ ఆందోళనలు, నిరసనలు, రాజీనామాలు చేసినా… క్షేత్ర స్థాయిలో పనిచేసే క్యాడర్‌ని పార్టీ పెద్దలు లైట్ తీసుకున్నట్టు కనిపిస్తోందన్నది లోకల్‌ టాక్‌.

దీంతో హై కమాండ్‌ తమ మాటకు ఏమాత్రం విలువ ఇవ్వడం లేదన్న ఆవేదనలో ఉన్న నియోజకవర్గ కీలక నేతలు ఎన్నికల్లో తమ వైపు ఉండే నాయకుడికే మద్దతు పలకాలని ఫిక్స్ అయ్యారట. 2009 నుంచి 2019 వరకు ఎమ్మెల్యేగా పనిచేసిన కలవపూడి శివకు గత ఎన్నికల్లో పార్టీ అధిష్టానం నరసాపురం ఎంపీ సీటు ఇచ్చింది. అదే సమయంలో  ఉండి ఎమ్మెల్యే అభ్యర్థిగా రామరాజుకు అవకాశం దక్కింది. అప్పుడు శివ ఎంపీగా ఓడిపోగా,  శివరామరాజు ఎమ్మెల్యే అయ్యారు. ఇద్దరూ అవగాహనతోనే పనిచేసినందున ఉండి టిడిపి క్యాడర్‌కు ఎలాంటి సమస్య రాలేదు. ఇన్నేళ్లు పార్టీ బలోపేతానికి పని చేస్తూనే ఉన్నారు. అయితే… తాజా పరిణామాలతో మాజీ ఎమ్మెల్యేలు ఇద్దర్నీ పక్కన పెట్టడంతో సమస్య మొదలైంది. నియోజకవర్గ కీలక నేతలు పార్టీకి దూరం అవుతున్నారు. అలాగే సీటు దక్కని కలవపూడి శివ రివర్స్‌ అయ్యారు. 2019లో తాను త్యాగం చేసిన సీటును తిరిగి తనకే ఇవ్వాలని పట్టు పట్టినా పార్టీ పెద్దలు లెక్కచేయకపోవడంతో ఇండిపెండెంట్‌గా నామినేషన్‌ వేశారాయన. సేవా కార్యక్రమాలతో పాటు అందర్నీ కలుపుకొని వెళ్లే తత్వం శివకు ప్లస్‌ అవుతోంది. ఇండిపెండెంట్‌గా నిలబడ్డాసరే.. ఇది తనకు కలిసి వస్తుందంటూ… లెక్కలు వేసుకుంటున్నారాయన.

దీనికి తోడు నియోజకవర్గంలో కీలకంగా నిలిచే తెలుగుదేశం పార్టీ క్యాడర్ కూడా తాము ఆశించిన వ్యక్తికి సీటు ఇవ్వకపోవడంతో ఇప్పుడు కలవపూడి శివ వైపు మొగ్గుతున్నట్టు సమాచారం. ఈ వ్యవహారాలతో టీడీపీ కంచుకోటకు బీటలువారే ప్రమాదం ఉందంటున్నారు పరిశీలకులు. మరోవైపు టీడీపీలో జరుగుతున్న పరిణామాలతో  వైసిపిలో కొత్త ఉత్సాహం కనిపిస్తోందట. తెలుగుదేశం ఓట్ల చీలిక తమకు ప్లస్‌ అవుతుందని అధికార పార్టీ ఆశగా చూస్తున్నట్టు చెబుతున్నారు స్థానిక పరిశీలకులు. 2019 జగన్‌ ప్రభంజనంలోనూ ఉండిలో వైసీపీ జెండా ఎగరలేదు. అప్పటినుంచి విజయం కోసం ఎదురు చూస్తున్న వైసిపి అభ్యర్థి ఈసారి పరిస్థితులు తనకు కలిసివస్తాయని ధీమాగా ఉన్నారట. ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తున్న కలవపూడి శివ భారీగా టీడీపీ ఓట్లను చీలుస్తారన్నది లోకల్‌ వాయిస్‌. ఇది వైసీపీకి పరోక్షంగా కలిసి వస్తుందని అంటున్నారు. నామినేషన్ల ఉప సంహరణ తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయో చూడాలి మరి.