Off The Record: ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ శాఖలో జరుగుతున్న వ్యవహారాలు, వెల్లువెత్తుతున్న అవినీతి ఆరోపణలు తీవ్ర ప్రకంపనలు రేపుతున్నాయి. మరీ ముఖ్యంగా ఇటీవలి పరిణామాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయన్న అభిప్రాయం డిపార్ట్‌మెంట్‌లో పెరుగుతోంది. శాఖలో కింది నుంచి నుంచి పైస్థాయి వరకు అంతా… తన కనుసన్ననల్లో జరగాలని భావించిన చీఫ్ ఇంజనీర్ చివరికి ముచ్చటగా మూడోసారి కూడా ఏసీబీ వలలో చిక్కారు. అయితే… మొదటి రెండు విడతలకు భిన్నంగా ఈసారి మాత్రం అది రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం అయింది. చీఫ్ ఇంజనీర్ స్థాయిలో 35కోట్ల బిల్లు మంజూరు చేయడానికి 5కోట్ల రూపాయలు లంచం డిమాండ్ చేశారట సర్పవరపు శ్రీనివాస్. దానికి సంబంధించే… తొలి విడతలో పాతిక లక్షలు తీసుకుంటుండగా పట్టుకుంది ఏసీబీ. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒకేసారి అంత పెద్ద మొత్తంలో నగదును లంచంగా తీసుకుంటూ ఒక అధికారి పట్టుబడటం అదే మొదటిసారి. శ్రీనివాస్ మీద ఆ కేసు దర్యాప్తు కొనసాగుతోంది. మొదట్లో ఇది ఒక అధికారికి సంబంధించిన వ్యవహారమేనని అనుకున్నా… విచారణలో బయటపడుతున్న అంశాలు విస్తుగొలుపుతున్నాయట. ఇప్పుడీ ఎపిసోడ్ చాలామంది ఎమ్మెల్యేల్ని కూడా టెన్షన్ పెడుతున్నట్టు సమాచారం. ఏసీబీ… కేసు లోతుల్లోకి వెళ్ళేకొద్దీ ఉత్తరాంధ్రకు చెందిన కొందరు శాసనసభ్యులకు నిద్ర కూడా పట్టడం లేదట. తీగ లాగితే డొంక కదిలినట్టు…ఇదే ప్రాంతానికి చెందిన ఒక పెద్ద మంత్రి బండారం కూడా బయటపడుతుందన్న ప్రచారం కలకలం రేపుతోంది.
Read Also: Off The Record: పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలలో ఎంత మంది సేఫ్ జోన్ లో ఉన్నారు..?
ఈఎన్సీ శ్రీనివాస్ మీద సదరు సీనియర్ మినిస్టర్‌కు తొలి నుంచి సాఫ్ట్ కార్నర్ ఉందట. తనకు సంబంధంలేని గిరిజన శాఖలో ఇంజినీర్ ఇన్ చీఫ్‌గా పని చేస్తున్నా…ఆయనంటే ఈయనగారికి ఎనలేని ప్రేమ అట. గతంలో రెండు సార్లు పట్టుబడ్డ కేసులకు సంబంధించి ఆయనకు క్లీన్‌చిట్ ఇప్పించేందుకు మంత్రి నానా తంటాలు పడుతున్న టైంలోనే మూడోసారి పెద్ద మొత్తంతో దొరికిపోయారు సర్పవరపు శ్రీనివాస్. వరుసగా ఇలా ఎలా అని డౌట్‌పడ్డ అవినీతి నిరోధక శాఖ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేస్తున్న క్రమంలో…దీనికి పెనవేసుకుపోయిన నూలు తాళ్ళన్నీ ఒక్కొక్కటిగా విడిపోతూ విస్తుగొలిపే వాస్తవాలు వెలుగు చూస్తున్నాయట. తన సామాజిక వర్గానికే చెందిన ఈఎన్సీ శ్రీనివాస్‌కు ఏసీబీ కేసుల్లో క్లీన్ చిట్ ఇప్పించేందుకు సదరు సీనియర్ మంత్రివర్యులు దాదాపు 15 మంది ఎమ్మెల్యేల సిఫారసు లేఖలు తీసుకున్నట్టు సమాచారం. ఏసీబీ తాజా దర్యాప్తులో ఆ లేఖల బాగోతం మొత్తం బయటికి వచ్చినట్టు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. దీంతో అవాక్కయిన ఆఫీసర్స్ దీన్ని డైరెక్ట్‌గా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకు వెళ్ళినట్టు తెలుస్తోంది. దీంతో ఇప్పుడా లేఖలు ఇచ్చిన ఎమ్మెల్యేల పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుకల్లా మారిందట. ఏం చేద్దాం బ్రదర్ అంటూ వాళ్ళంతా పరస్పరం ఫోన్స్‌లో సంప్రదించుకుంటున్నారట. మేటర్ ఇంత సీరియస్ అవుతుందని తెలియక ఆయనేదో అడిగాడని లెటర్ ఇచ్చాం. ఇప్పుడిలా ఇరుక్కుపోయామంటూ మింగలేక కక్కలేక అన్నట్టుగా ఉన్నట్టు తెలుస్తోంది. సంబంధంలేని వ్యవహారంలో అనవసరంగా పేర్లు బయటికి వచ్చి రాజకీయంగా ఎక్కడ బద్నాం అయిపోతామోనన్న టెన్షన్ పెరుగుతోందట సదరు శాసనసభ్యుల్లో. ఇదిలా ఉంటే… అవినీతి అధికారిగా ముద్రపడ్డ శ్రీనివాస్…. ఆగస్ట్‌లో రిటైర్ అవ్వాల్సి ఉండగా అంతలోనే ఏసీబీకి మూడోసారి దొరికిపోయారు.
Read Also: Top Headlines @ 9 PM: టాప్ న్యూస్
కానీ… అంతకంటే ముందే ఆయన కోసం మరో పెద్ద తతంగమే నడిచిందట. రిటైర్ అయ్యాక కూడా అదే పదవిలో మరో రెండేళ్ళు కొనసాగించేందుకు ఫైల్ రెడీ చేశారన్న సమాచారం హాట్ టాపిక్ అయింది. అంటే… మూడోసారి ఏసీబీకి పట్టుబడకుండా ఉండిఉంటే… ఆయనకు ఈపాటికే ఎక్స్‌టెన్షన్ వచ్చి ఉండేదన్న మాట. దీనిమీద కూడా… అవినీతి నిరోధక శాఖ అధికారులు దృష్టి పెట్టినట్టు తెలిసింది. ఎక్స్‌టెన్షన్ ఫైల్ వెనక కూడా ఆ పెద్ద మంత్రి హస్తం ఉందా అన్న అనుమానాలు పెరుగుతున్నాయట ప్రస్తుత పరిస్థితుల్లో. ఇలా… మొత్తంగా శ్రీనివాస్ లంచావతార విశ్వరూపం ఉత్తరాంధ్ర రాజకీయంతో పెనవేసుకుపోయి ప్రకంపనలు రేపుతోంది. ముఖ్యంగా క్లీన్‌చిట్ కోసం సిఫారసు లేఖలు ఇచ్చిన ఎమ్మెల్యేల్యేలైతే… నిద్రలేని రాత్రులే గడుపుతున్నట్టు సమాచారం. వాళ్ళ ప్రత్యర్థులు మాత్రం చేసేదంతా చేసేసి… ఇప్పుడు తేలు కుట్టిన దొంగల్లా ఉంటారా అంటూ సెటైర్స్ వేస్తున్నారట.
