Site icon NTV Telugu

Off The Record: ఆ సినిమా హీరోకు రాజకీయాల మీద మోజు పెరిగిందా? టికెట్‌ ఆశిస్తున్నారా..?

Nithin

Nithin

Off The Record: దిల్‌ సినిమా హీరో పాలిటిక్స్‌కు దిల్‌సే అంటున్నారట. చాలా రోజుల నుంచి ఆయన రక్త సంబంధీకులు రాజకీయాల్లో ఉన్నా….కలిసి పని చేద్దాం రమ్మని గతంలో కేంద్ర మంత్రి అమిత్‌ షా నేరుగా ఆహ్వానించినా… సున్నితంగా తిరస్కరించిన నితిన్‌ ఇప్పుడు మాత్రం పొలిటికల్‌ స్ర్కీన్‌ గురించి సీరియస్‌గా ఆలోచిస్తున్నారట. ఈసారి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓ టిక్కెట్‌ కోసం సీరియస్‌గా ప్రయత్నాలు చేస్తున్నారట. నాడు రా…రమ్మని ఆహ్వానించిన పార్టీని కాదని నేడు కాంగ్రెస్‌ పార్టీ వైపు చూస్తున్నట్టు తెలిసింది. నితిన్‌ త్వరలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డిని కలవాలనుకుంటున్నట్టు కూడా ప్రచారం జరుగుతోంది. అదేంటీ… మంచి ఫామ్‌లో ఉన్న సినిమా హీరో టిక్కెట్‌ కావాలనుకుంటే… ఇంత డొంక తిరుగుడు ఎందుకు? కాకితో కబురు పెడితే పార్టీలే పరుగెత్తుకు వచ్చి బీ ఫామ్‌ని చేతిలో పెట్టేస్తాయి కదా…నితిన్‌కు లాబీయింగ్‌ చేసుకోవాల్సినంత అనసరం ఏముందన్న డౌట్‌ వస్తోందా? కానీ… అసలు పాయింట్‌ అక్కడే ఉంది.

నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం మోపాల్ మండలానికి చెందిన నితిన్ కుటుంబం చాలా కాలంగా టాలీవుడ్ నిర్మాణ రంగంలో ఉంది. ఆయన బంధువులు కొందరు రాజకీయాల్లో ఉన్నారు. వారిలో నితిన్‌ మేనమామ నగేష్‌రెడ్డి యాక్టివ్‌ పాలిటిక్స్‌ చేస్తున్నారు. ప్రస్తుతం పీసీసీ కార్యదర్శిగా ఉన్న నగేష్‌రెడ్డి గతంలో మార్కెట్ కమిటీ ఛైర్మన్‌గా కూడా పనిచేశారు. ఈసారి ఎన్నికల్లో ఆయన నిజామాబాద్‌ రూరల్‌ అసెంబ్లీ టిక్కెట్‌ ఆశిస్తున్నారు. మేనమామ కోసమే సినీహీరో నితిన్‌ ఇప్పుడు కాంగ్రెస్‌ అధినాయకత్వం దగ్గర లాబీయింగ్‌ మొదలుపెట్టారట. అయితే.. పార్టీ తరపున ఇదే టికెట్టును మాజీ ఎమ్మెల్సీ భూపతి రెడ్డి, కాంగ్రెస్‌లో చేరబోతున్న బీఆర్ఎస్ నేత అరికెల నర్సారెడ్డి ఆశిస్తున్నారు. ఆ ఇద్దర్నీ పక్కకు నెట్టి.. ఈసారి ఎలాగైనా టిక్కెట్టు దక్కుంచుకోవాలనుకుంటున్న నగేష్‌రెడ్డి మేనల్లుడి యాంగిల్‌లో కూడా నరుక్కొస్తున్నట్టు స్థానికంగా ప్రచారం జరుగుతోంది. తాను డీఎస్ అనుచరునిగా ఉన్నా ఆయనతో పాటు పార్టీ మారలేదని, ఎప్పుడూ కాంగ్రెస్‌ కోసమే పనిచేశానని ఇటీవల రేవంత్‌ని కలిసి చెప్పారట నగేష్‌రెడ్డి. అటు తన ప్రయత్నాలు తాను చేస్తూనే… ఇటు మేనల్లుడి కరిష్మాను కూడా వాడుకోవాలనుకుంటున్నారట పీసీసీ కార్యదర్శి. ఎలాగోలా టిక్కెట్‌ సంపాదించుకుంటే… నితిన్‌ సినీ గ్లామర్‌ కూడా తన గెలుపునకు పని చేస్తుందన్నది ఆయన కేలిక్యులేషన్‌గా చెబుతున్నారు.

కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత తెలంగాణ కాంగ్రెస్‌కు వెయ్యి ఏనుగుల బలం వచ్చినట్టయింది. పార్టీలోకి వలసలు ఇంకా ఊపునిస్తున్నాయి. మారుతున్న పరిస్థితులు, కొత్త చేరికలతో టి కాంగ్రెస్‌ టిక్కెట్స్‌కు డిమాండ్‌ పెరుగుతోంది. ఆశావహులంతా ఎవరికి వారు ఏ చిన్న అవకాశాన్ని కూడా వదలకుండా…. ప్రయత్నాలు చేసుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో ఫాలోయింగ్‌ ఉన్న సినీ హీరోగా నితిన్‌ విజ్ఞప్తికి కాంగ్రెస్‌ హై కమాండ్‌ ప్రాధాన్యత ఇస్తుందా? లేదా? అన్నది చూడాలి.

Exit mobile version