NTV Telugu Site icon

Off The Record: తెలంగాణ బీజేపీలో రిపేర్ వర్క్ మొదలైందా..?

Bjp

Bjp

Off The Record: తెలంగాణ బీజేపీ నాయకత్వం గతంలో ఎన్నడూ చేయనంత సభ్యత్వాన్ని చేయించింది ఈసారి. పార్టీ అభిమానులు, సానుభూతి పరులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున సభ్యత్వాలు తీసుకున్నారు. ఆ సంఖ్య 35 లక్షలు దాటిందని అంటున్నారు బీజేపీ నేతలు. అంతే కాదు ప్రస్తుతం అన్ని స్థాయిల్లో కమిటీలు వేసుకునే అర్హత కూడా వచ్చిందట రాష్ట్ర పార్టీకి. అసెంబ్లీ ఎన్నికల్లో అనుకున్న స్థాయి ఫలితాలు రాకున్నా… పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం అనూహ్యంగా సీట్లు, ఓట్లు వచ్చాయి తెలంగాణ బీజేపీకి. 8 ఎంపీ సీట్లు, 35 శాతం ఓట్లు పడటంతో… అదే ఊపు తగ్గకుండా ఇంకా పెంచాలనుకుంటోందట పార్టీ నాయకత్వం. సంస్థాగత ఎన్నికల ద్వారా క్షేత్ర స్థాయిలో బలోపేతమై…లోక్ సభ ఎన్నికల్లో పడ్డ ఓట్లను కాపాడుకోవాలన్నది పార్టీ ప్లాన్‌గా తెలిసింది. ఆ క్రమంలోనే వీలైనన్ని ఎక్కువ పోలింగ్ బూత్‌లకు పార్టీ కమిటీలని వేయాలని కసరత్తు చేస్తోందట. తెలంగాణలో మొత్తం 36 వేల పోలింగ్ బూత్‌లు ఉంటే… కనీసం 25 వేలకైనా కమిటీలు వేయాలని టార్గెట్ పెట్టుకున్నట్టు సమాచారం.

అయితే క్షేత్ర స్థాయిలో అలాంటి వాతావరణం ఉందా? కార్యకర్తలు ఆ మేరకు ఉత్సాహం చూపుతున్నారా అంటే… ఠక్కున ఎస్‌ అని చెప్పలేని పరిస్థితి పార్టీ వర్గాలది. అందుకే రాష్ట్ర నాయకత్వం ఈ విషయంలో సీరియస్‌గా ఉండాలనుకుంటోందట. బూత్‌ కమిటీలను తూతూ మంత్రంగా కాకుండా… స్థానిక సంస్థల ఎన్నికల్లో పనికి వచ్చేలా ఏర్పాటు చేయాలని కింది స్థాయి నాయకులకు సూచించినట్టు తెలుస్తోంది. ఇప్పటిదాకా బీజేపీకి అర్బన్‌ పార్టీ ఇమేజ్‌ ఉండేది. అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో అది కాస్త మారి గ్రామీణ ప్రాంతాల్లో కూడా పుంజుకుంటున్న సూచనలు కనిపించాయి. అందుకే ఈసారి స్థానిక సంస్థల ఎన్నికల్ని లైట్ తీసుకోకుండా… సీరియస్‌గా వర్కౌట్‌ చేయాలని నిర్ణయించారట పార్టీ పెద్దలు. అందుకే…ఈటల రాజేందర్ లాంటి సీనియర్స్‌తో ఒక పార్టీ కమిటీని కూడా వేశారట. సంస్థాగత ఎన్నికలను డిసెంబర్‌లో పూర్తి చేయాలన్న ప్లాన్‌లో ఉంది తెలంగాణ బీజేపీ. బూత్ కమిటీ నుంచి రాష్ర్ట అధ్యక్ష ఎన్నిక వరకు పూర్తి చేయాలని అనుకుంటోందట. ఆలస్యం అవకుండా వీలైనంత త్వరగా ఈ ప్రక్రియను పూర్తి చేసేందుకు వర్క్ షాప్స్ నిర్వహిస్తోంది పార్టీ. తాము ఎంత సీరియస్‌గా ఉన్నామో ఈ వర్క్‌షాప్‌ ద్వారా తెలియ చేసే ప్రయత్నం చేస్తోందట రాష్ట్ర నాయకత్వం. సంస్థాగత ఎన్నికలను స్థానిక సంస్థల ఎన్నికలకు స్ప్రింగ్ బెంచ్ గా ఉపయోగించుకోవాలన్నది తెలంగాణ కమలనాధుల ప్లాన్‌గా తెలుస్తోంది. పట్టణ ప్రాంతాలకే పరిమితం అనే మార్క్ నుంచి గత అసెంబ్లీ ఎన్నికల్లో బయటపడ్డాంగనుక… ఇక మాస్‌ ఇమేజ్‌తో రూరల్‌ ఏరియాల్లో పాతుకుపోవాలన్న కాషాయ దళం ప్లాన్‌ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏ మేరకు వర్కౌట్‌ అవుతుందో చూడాలి మరి.

Show comments