NTV Telugu Site icon

Off The Record: మహానాడుని వాయిదా వేసిన చంద్రబాబు..!

Tdp

Tdp

Off The Record: టీడీపీ ప్రతేడాది చాలా ఘనంగా నిర్వహించే పసుపు పండుగ మహానాడు. రెండు మూడు రోజుల పాటు చేపట్టే ఆ మెగా కార్యక్రమంలో పార్టీ భవిష్యత్‌లో ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలి..? పార్టీ పరంగా ఏం తీర్మానాలు చేయాలి? వాటిని ఎలా అమలు చేయాలి? ఇలా మహానాడును ఓ పండుగలా చేసుకోవడం టీడీపీ పార్టీ ఆవిర్భావం నుంచి వస్తున్న ఆనవాయితీ. అయితే వివిధ సందర్భాల్లో రకరకాల కారణాల వల్ల మహానాడును రద్దు చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. అలాగే కుదించుకున్న సందర్భాలూ లేకపోలేదు. ఈ క్రమంలో ఈసారి మహానాడు నిర్వహణ ఉంటుందా..? ఉండదా..? అనే అంశంపై ఇప్పటికే చర్చ జరుగుతుండగా.. ఈసారి మహానాడు ఉండదని.. ఎన్నికల ఫలితాల వరకు వాయిదా వేసుకోవాలని టీడీపీ డిసైడ్ అయింది.

ఈ ఏడాది ఎన్నికల హడావుడి. పైగా మహానాడు తేదీల నాటికి ఇంకా కౌంటింగ్ జరగదు. మే నెల 27-29 తేదీల మధ్య అటూ ఇటుగా టీడీపీ మహానాడును నిర్వహిస్తుంటుంది. అయితే ఈసారి కౌంటింగ్ వచ్చే నెల 4వ తేదీన జరుగుతోంది. ఈ పరిస్థితుల్లో లీడర్లు.. కేడర్ కౌంటింగ్ ఏర్పాట్లు చూడాలి. వాళ్లంతా దానికి సంబంధించిన హడావుడిలో మునిగి ఉంటారు. ఈ సమయంలో మహానాడు నిర్వహించడం సరైన విధానం కాదనే భావనతో టీడీపీ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. గతంలో 2014 ఎన్నికల్లో మే 16వ తేదీన కౌంటింగ్ నిర్వహించారు. నాటి ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించింది. కానీ ప్రభుత్వం ఏర్పాట్లల్లో బిజీగా ఉండడంతో మహానాడు కార్యక్రమాన్ని జరుపుకోలేదు. 2019 ఎన్నికల్లో ఫలితాలను మే 23వ తేదీన ప్రకటించారు. అప్పుడు టీడీపీ పరాజయం పాలైంది. దీంతో మహానాడును 2019 ఎన్నికల టైంలో నిర్వహించుకోలేదు. ఆ తర్వాత కరోనా కారణంగా రెండేళ్ల పాటు వరుసగా జరుపుకోలేదు.

రెండేళ్ల క్రితం 2022లో ప్రకాశం జిల్లాలో మహానాడు సభ జరిపారు. వాస్తవానికి టీడీపీకి అప్పటి నుంచే పుంజుకోవడంపై దృష్టి పెట్టంది. ఆ తర్వాత 2023లో రాజమండ్రిలో మహానాడు నిర్వహించింది టీడీపీ. ఇప్పుడు ఎన్నికల సమయం కావడం.. అది కూడా కౌంటింగ్ కంటే ముందు రావడంతో మహానాడు నిర్వహణ సాధ్యం కాదని చేతులెత్తేశారు. అందుకు ప్రతిగా ఆ మూడు రోజుల్లో గ్రామ గ్రామన పార్టీ జెండాలను ఎగరేసే కార్యక్రమాలు.. రక్తదానం.. అన్నదానం లాంటి కార్యక్రమాలను నిర్వహించుకోవాలని ప్రణాళికలు సిద్దం చేసింది టీడీపీ. ఫైనల్‌గా గెలుపు ఓటములను బట్టి మహానాడు నిర్వహణ ఉంటుందని టీడీపీ చెప్పకనే చెప్పింది. ఓడితే ఈ పండుగ ఇప్పటికింతే అవుతుంది. చూడాలి మరి.. అప్పటి వరకు మహానాడు రీసౌండ్ ఇస్తుందా? సైలెంట్ మోడ్‌లోకి వెళ్తుందా?

Show comments