Off The Record: ఏపీ అసెంబ్లీ ఎన్నికలు షెడ్యూల్ ప్రకారం జరిగినా.. ముందే వచ్చినా.. అసలెప్పుడైనా.. మేం రెడీ అంటూ తొడగొడుతున్నాయి అన్ని ప్రధాన పార్టీలు. ఎనీ డౌట్స్.. అంటూ.. ఇంకా రివర్స్‌లో ప్రశ్నిస్తున్నారు ఆయా పార్టీల నేతలు. అంతా సిద్ధమంటున్నారు గానీ.. ఆ ఒక్కటి మాత్రం తేలడం లేదు. మేం సింగిల్.. నో మింగిల్స్ అంటూ పోటీ విషయంలో అధికార పార్టీ క్లియర్‌గానే ఉంది. కానీ.. పొత్తు మాటలు మాట్లాడుతున్నప్రతిపక్షాల మధ్య ఇంకా క్లారిటీ రాలేదా అన్న అనుమానాలు వస్తున్నాయి పరిశీలకులకు. దానికి తగ్గట్టుగానే జనసేన అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్ మాట్లాడుతున్న మాటలు గందరగోళాన్ని మరింత పెంచుతున్నాయంటున్నారు. టీడీపీ-జనసేన-బీజేపీ కలిసి ఎన్నికలకు వెళ్తాయా.? లేక టీడీపీ-జనసేన మాత్రమే పొత్తు పెట్టుకుంటాయా..? అదీ ఇదీ కాకుండా… టీడీపీని వదిలేసి జనసేన-బీజేపీ మాత్రమే విడిగా వెళ్తాయా..? అన్నది ఇప్పటికీ ప్రశ్నగానే ఉంది. దానికి జవాబు మాత్రం అల్లంత దూరంలో కనిపించడం లేదంటున్నారు.
గతంలో జరిగిన పరిణామాలు గమనిస్తే… టీడీపీ-జనసేన కలిసి వెళ్లడం ఖాయం.. ఇక తేల్చుకోవాల్సింది బీజేపీ గురించే అన్నంతగా మారింది రాజకీయం. కానీ… ప్రస్తుతం ఆ ఊపు లేదని, ఎక్కడో తేడా కొడుతోందన్న మాటలు సైతం వినిపిస్తున్నాయి. మరీ… ముఖ్యంగా పురంధేశ్వరి ఏపీ బీజేపీ పగ్గాలు చేపట్టాక జనసేన వైఖరిలో మార్పు కన్పిస్తోందంటున్నారు పరిశీలకులు. గతానికంటే ఎక్కువగా పవన్ కేంద్ర నామ స్మరణ చేస్తున్నారు. బీజేపీ నేతల కంటే ఎక్కువగానే పవన్ కళ్యాణ్, కేంద్రం.. జాతీయ నాయకత్వం.. కేంద్ర నిఘా వర్గాలు.. అంటూ ప్రస్తావిస్తున్నారు. దీన్ని బట్టి చూస్తే…బీజేపీ బంధాన్ని వీడి పవన్ బయటకు రావడం కష్టమనే భావన కన్పిస్తోందంటున్నారు. తాజాగా ఆయన విశాఖ పర్యటనలో చేసిన కామెంట్స్ గందరగోళాన్ని మరింత పెంచాయట. పొత్తుల విషయంలో అన్ని రకాల ఆప్షన్లను పరిశీలిస్తున్నామని, టీడీపీ-జనసేన-బీజేపీ కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయాలా..? లేక జనసేన-బీజేపీ మాత్రమే కలిసి వెళ్లాలా..? అని ఆలోచిస్తున్నామని అన్నారాయన.
ఇదే సందర్భంలో అధికార మార్పిడి కచ్చితంగా జరిగేలాగానే పొత్తులు ఉంటాయన్నారు. జగన్ ప్రభుత్వానికంటే.. గతంలో ఉన్న చంద్రబాబు ప్రభుత్వమే బెటరనే అభిప్రాయానికి వచ్చానని కూడా కామెంట్ చేశారు పవన్. ఇదంతా చూస్తుంటే పొత్తుల విషయంలో పవన్ ఒక క్లారిటీకి రాలేకపోతున్నారేమోననే భావన సర్వత్రా వ్యక్తమవుతోంది. టీడీపీ కలవకుండా.. జనసేన-బీజేపీ మాత్రమే కలిసి పోటీ చేస్తే…అధికార మార్పిడి సాధ్యమేనా అన్నది క్వశ్చన్. మూడు పార్టీల మధ్య ఓట్లు చీలితే అంతిమంగా లాభపడేది ఎవరో చెప్పడానికి పెద్ద విశ్లేషణలు, రాకెట్ సైన్స్ తెలిసి ఉండాల్సిన అవసరం లేదు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వనని అంటున్న పవన్ ఇలా క్లారిటీ లేకుండా మాట్లాడటం ఏంటని అంటున్నారు పొలిటికల్ పండిట్స్.
ఓవైపు అధికార మార్పిడి జరిగేలా పొత్తులుంటాయని చెబుతూనే…అదే సమయంలో జనసేన-బీజేపీ మాత్రమే కలిసి వెళ్లే ఆప్షన్లను కూడా పరిశీలిస్తున్నామనడంచూస్తుంటే.. పవన్ డైలమాలో ఉన్నట్టు కన్పిస్తోందంటున్నారు. టీడీపీతో కలిసి వెళ్లాలని ఆయనకు ఉన్నా.. ఇప్పటి వరకు బీజేపీ నుంచి గ్రీన్ సిగ్నల్ రాక పోవడంతో ఏం చేయాలో పాలుపోని పరిస్థితుల్లో పవన్ ఉన్నారని అంటున్నారు. అటు తెలంగాణ ఎన్నికల విషయంలో పొత్తులపై కొంత క్లారిటీ వచ్చాక.. ఏపీపై స్పష్టత ఇద్దామని బీజేపీ పెద్దలు సూచించినట్టు ప్రచారం జరుగుతోంది. ఈలోగా పార్టీల పరంగా ఎవరికి వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్యక్రమాలు చేపట్టుకోవడం.. పర్యటనలు పెట్టుకోవడం లాంటివి చేద్దామన్న అభిప్రాయానికి వచ్చినట్టు చెప్పుకుంటున్నారు. ఇందులో వాస్తవం ఎంతున్నా… పవన్ మాటలు మాత్రం గందరగోళాన్ని పెంచుతున్నాయంటున్నాయి రాజకీయ వర్గాలు.
