NTV Telugu Site icon

Off The Record: టీడీపీ-జనసేన సీట్ల సర్దుబాటుపై క్లారిటీ వచ్చిందా?

Tdp And Janasena

Tdp And Janasena

Off The Record: టీడీపీ-జనసేన సీట్ల సర్దుబాటు దిశగా కసరత్తు ముమ్మరం చేసినట్టే కన్పిస్తోంది. ఇప్పటి వరకు రెండు పార్టీల అధినేతలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేపట్టాల్సిన కార్యక్రమాలపై సమావేశం అయ్యారు. కానీ… సీట్ల సర్దుబాటుపై తొలిసారి తాజాగా ఇద్దరి భేటీ జరిగినట్టు సమాచారం. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన ఏదీ లేకున్నా.. ఆయా పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు సీట్ల సర్దుబాటుపై చర్చలు జరిగాయంటున్నారు. ఎవరు ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలి..? ఎక్కడెక్కడ నుంచి ఏయే పార్టీలు బరిలో ఉండాలనే అంశంపై ప్రాథమిక స్థాయిలో చర్చలు జరిగినట్టు సమాచారం. ఈ నెలాఖరుకు సీట్ల సర్దుబాటును ముగించేసి.. అభ్యర్థుల ప్రకటన కూడా చేసే దిశగా చంద్రబాబు-పవన్‌ ప్రణాళికలు సిద్దం చేస్తున్నట్టు తెలిసింది.
ఈ క్రమంలో ఎవరి సీటు ఎగిరిపోతోంది..? ఎవరు సేఫ్‌ పొజిషన్‌లో ఉన్నారనే అంశంపై టీడీపీ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. సీటు కోల్పోయే సీనియర్లు ఎవరున్నారనే అంశంపై చర్చించుకుంటున్నారట.

ఎవరి మెడ మీద పొత్తుల కత్తి వేలాడుతోందనే చర్చ టీడీపీ వర్గాల్లో జరుగుతోంది. ఇందులో ఉత్తరాంధ్ర నుంచి బండారు సత్యనారాయణ మూర్తి పేరు ప్రధానంగా వినిపిస్తోంది. ఆయన ఆశిస్తున్న పెందుర్తి స్థానాన్నే జనసేన నేత పంచకకర్ల రమేష్‌ బాబు కూడా కోరుకుంటున్నారు. దీంతో పెందుర్తి సీటుపై టెన్షన్‌ నెలకొంది. తూర్పు గోదావరి జిల్లాలో సిట్టింగ్‌ గోరంట్ల బుచ్చయ్య చౌదరి, మాజీ ఎమ్మెల్యే వర్మ, కొండబాబు, బండారు సత్యానందం, జోత్యుల ఫ్యామిలీకి టిక్కెట్లు వస్తాయా..? రావా అనే చర్చ జరుగుతోంది. గోరంట్ల బుచ్చయ్య చౌదరి రాజమండ్రి రూరల్‌ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ స్థానం నుంచి జనసేన సీనియర్‌ నేత కందుల దుర్గేష్‌ కూడా ఆశిస్తున్నారు. పిఠాపురం సీటు ఆశిస్తున్న మాజీ ఎమ్మెల్యే వర్మకు ఈసారి భంగపాటు తప్పదని అంటున్నారు. కాకినాడ అర్బన్‌ స్థానం కోసం జనసేన గట్టిగా పట్టుబడితే.. టీడీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే కొండబాబుకు షాక్‌ తప్పదనే చర్చ జరుగుతోంది. ఇక కొత్తపేట సెగ్మెంట్‌ పైనా జనసేన కన్నేసినట్టు సమాచారం. ఇదే జరిగితే మాజీ ఎమ్మెల్యే బండారు సత్యానందంకు పొత్తుల్లో భాగంగా ఝలక్‌ తప్పదనే అంటున్నారట. అలాగే జగ్గంపేట స్థానం నుంచి టిక్కెట్‌ ఆశిస్తున్న జ్యోతుల ఫ్యామిలికీ ఎలయెన్స్‌ ఎఫెక్ట్‌ తప్పదా అనే ప్రచారం జరుగుతోంది. అయితే సీనియర్స్‌, తప్పదు అనుకున్న వారిని.. పార్టీ అధినాయకత్వం ఏదో ఒకచోట ఎకామిడేట్‌ చేస్తుందనే ప్రచారం జరుగుతోంది.

ఇక ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాల విషయానికొచ్చేసరికి.. కోవూరు, తణుకు, తాడేపల్లిగూడెం, నరసాపురం వంటి సీట్ల మీద చర్చ జరుగుతోంది. వీటిల్లో తణుకు విషయానికొచ్చేసరికి మాజీ ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ టీడీపీ ఇన్ఛార్జ్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ సీటు జనసేనకు వెళ్తే.. రాధాకృష్ణకు ఇబ్బందేననే చర్చ జరుగుతోంది. కృష్ణా జిల్లాలో జనసేనకు విజయవాడ పశ్చిమం, కైకలూరు, పెడన, అవనిగడ్డ, బందరు పార్లమెంట్‌ స్థానాల్లో కొన్నింటిని ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో బందరు పార్లమెంట్‌ స్థానం అంటే కొనకళ్ల నారాయణ, అవనిగడ్డ అంటే మండలి బుద్ద ప్రసాద్‌ వంటి వారి మెడ మీద పొత్తుల కత్తి వేలాడుతుందని అంటున్నారు. పెడన అయితే కాగిత వెంకట్రావు తనయుడు కృష్ణ ప్రసాద్‌కు అవకాశం ఉండకపోవచ్చనే చర్చ జరుగుతోంది. ఇక గుంటూరు జిల్లా తెనాలి విషయంలోనే చర్చ జరుగుతోంది. ఇక్కడి టిక్కెట్‌ ఆశిస్తున్నారు ఆలపాటి రాజా. రాజాకు వేరే ఆప్షన్‌ ఇచ్చి.. సర్దుబాటు చేస్తున్నట్టు సమాచారం. దీనికి అనుగుణంగా రాజా కూడా మైండ్‌ ప్రిపేర్‌ చేసుకున్నట్టే కన్పిస్తోంది. ఇక రాయలసీమ వచ్చేసరికి జనసేన పొత్తు వల్ల సీట్లు ఎగిరిపోయే ముఖ్యమైన నేతలు పెద్దగా లేకున్నా.. ఆళ్లగడ్డ సెగ్మెంట్‌ ఉత్కంఠతను రేకెత్తిస్తోంది. ఈ స్థానాన్ని జనసేన ఆశించే అవకాశం లేకపోలేదంటున్నారు. దీంతో భూమా అఖిల వర్గీయుల్లో టెన్షన్‌ కన్పిస్తోంది. ఆళ్లగడ్డలో ఇటీవలే ఇరిగెల రాంపుల్లా రెడ్డి జనసేనలో చేరారు. దీంతో కొత్త ఈక్వేషన్లు తెర మీదకు వచ్చాయి. ఆళ్లగడ్డను జనసేనకు ఇస్తే.. భూమా ఫ్యామ్లీని కర్నూలు ఎంపీ స్థానానికి మారుస్తారా అన్న చర్చ జరుగుతోంది. ఈ రకంగా టీడీపీలో కొందరు కీలక నేతల భవిష్యత్తు గురించి.. వారి మెడ మీద వేలాడుతున్న పొత్తుల కత్తి గురించి ఆసక్తికర చర్చ జరుగుతోంది. చివరికి ఎవరు త్యాగాలు చేస్తారో, ఎవరు తిరగబడతారో చూడాలి.