NTV Telugu Site icon

Off The Record: ఆమంచి స్వాములుకు పవన్ గ్రీన్ సిగ్నల్.. టీడీపీ పరిస్థితేంటి..?

Giddalur

Giddalur

Off The Record: ఆమంచి శ్రీనివాసరావు అలియాస్ స్వాములు. బాపట్ల జిల్లా చీరాలకు చెందిన స్వాములు.. మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ సోదరుడు. రాజీకీయాల్లోకి వచ్చిన నాటి నుండి తమ్ముడు కృష్ణమోహన్‌కు మద్దతుగా బ్యాక్‌గ్రౌండ్‌ వర్క్‌ చేస్తున్న స్వాములు.. ఇటీవలే పవన్‌కళ్యాణ్‌ సమక్షంలో జనసేనలో చేరారు. గత ఎన్నికల్లో కృష్ణమోహన్ ఓడిపోవడం, ఆయన మీద గెలిచిన కరణం బలరామ్‌ వైసీపీలో చేరడం లాంటి పరిణామాలతో కృష్ణమోహన్‌ను పర్చూరు ఇన్ఛార్జ్‌గా పంపింది వైసీపీ అధినాయకత్వం. ఈ క్రమంలోనే అన్నదమ్ములిద్దరి మధ్య విభేదాలు వచ్చాయి. ఇక ఎన్నాళ్ళిలా తమ్ముడి చాటు రాజకీయాలనుకుంటూ తన సొంత ప్రయత్నాలు చేసుకున్న స్వాములు కులాల లెక్కలతో గిద్దలూరు నియోజకవర్గం మీద దృష్టి పెట్టారట.

ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని గిద్దలూరులో కాపు సామాజిక వర్గం ఓట్లు ఎక్కువగా ఉండటంతో తనకు సేఫ్‌ జోన్‌ అని డిసైడై అటువైపు వెళ్ళారట స్వాములు. పవన్‌ సమక్షంలో జనసేన కండువా కప్పుకున్నారు. ఈసారి గిద్దలూరు నుంచే పోటీ చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ప్రస్తుతం గిద్దలూరు సిట్టింగ్‌ ఎమ్మెల్యే అన్నా రాంబాబు కూడా 2009 ఎన్నికల్లో ఇక్కడి నుంచే ప్రజారాజ్యం టికెట్‌పై పోటీ చేసి గెలిచారు. ఆ సమయంలో కాపు నేతలు అన్నా రాంబాబుకు అండగా నిలబడ్డారు. అందుకే ఇప్పుడు తాను జనసేన నుంచి పోటీ చేస్తే సునాయాసంగా గెలవచ్చన్న అంచనాలో ఉన్నారట స్వాములు. పవన్‌ కూడా అందుకు ఒప్పుకున్నట్టు ప్రచారం చేసుకుంటున్నారు. జనసేన వైపు నుంచి అంతవరకు ఓకేగానీ.. అదే సమయంలో మరో చర్చ కూడా నియోజకవర్గంలో మొదలైంది.

టీడీపీతో పొత్తు ఖాయమని అంటున్న సందర్భంలో… తనపాటికి తాను ఆమంచి స్వాములు పోటీకి సిద్ధమైతే… ఇక్కడ టీడీపీ ఇన్ఛార్జ్‌, మాజీ ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి పరిస్థితి ఏంటన్నది క్వశ్చన్‌. రెండు పార్టీల మధ్య పొత్తులు ఖారారైతే ఉమ్మడి ప్రకాశం జిల్లా నుంచి రెండు సీట్లు కోరతారని.. అందులో ఖచ్చితంగా గిద్దలూరు నియోజకవర్గం ఉంటుందన్న ప్రచారం జరుగుతోంది. గతంలో ప్రజారాజ్యం పార్టీ గెలిచిన నియోజకవర్గం కావటంతో ఆ ఈక్వేషన్స్ చూపించి లెక్కలు తేల్చుకుంటారని భావిస్తున్నాయి పార్టీ వర్గాలు. అదే జరిగితే గిద్దలూరు నియోజకవర్గంలో తమ బలం పెరిగిందని భావిస్తున్న అశోక్‌రెడ్డి రియాక్షన్ ఎలా ఉంటుందనేది చర్చనీయాంశంలా మారింది పొత్తు పొడిచి గిద్దలూరును జనసేన తీసుకుంటే… రాజకీయంగా ఆయన అడుగులు ఎలా ఉంటాయి? చంద్రబాబు అశోక్ రెడ్డికి ఎలాంటి హామీ ఇచ్చి సముదాయిస్తారనేది ఆసక్తికరంగా మారింది. పొత్తు ఖరారు కాకముందే జనసేన ఒక్కొక్క నియోజకవర్గంలో తమ అభ్యర్దులను ఖరారు చేస్తుండటం టీడీపీ వర్గాలను గందరగోళంలోకి నెట్టేస్తోందట. ఓవైపు ఆమంచి స్వాములు పార్టీ అధినేత పవన్ ఎలా చెబితే అలా చేస్తామంటున్నా.. గిద్దలూరులో గ్రౌండ్ ప్రిపేర్ చేసుకోవటం హాట్‌ టాపిక్ అయింది. మొత్తం మీద జనసేన వ్యూహం ఏంటి? టీడీపీ లెక్కలు ఎలా ఉన్నాయన్న క్లారిటీ వస్తేగానీ.. సస్పెన్స్‌కు తెరపడదంటున్నారు.