Site icon NTV Telugu

Off The Record: శృంగవరపుకోటలో రంజుగా రాజకీయాలు…

Srungavarapukota Otr

Srungavarapukota Otr

Off The Record: విజయబగరం జిల్లా శృంగవరపుకోటలో తెలుగుదేశం పార్టీ మూడు వర్గాలు చీలిపోయినట్లు పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఓ వైపు ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి వర్గం…మరోవైపు గొంప కృష్ణ కేంద్రంగా రాజకీయాలు సాగుతున్నాయి. తాజాగా ఇటీవల పార్టీలో చేరిన ఇందుకూరి సుబ్బలక్ష్మి నేతృత్వంలో మూడో వర్గం తయారైందట. ఒకప్పుడు రెండు వర్గాలకే పరిమితమైన రాజకీయ సమీకరణాలు…ఇప్పుడు మూడు పవర్‌ సెంటర్స్‌గా మారినట్లు తెలుస్తోంది. పార్టీ కార్యక్రమాలైనా, ప్రభుత్వ కార్యక్రమాలైనా…ఎవరికి వారే యమునా తీరే అన్నట్లు నిర్వహిస్తున్నారు. పార్టీ ఒకటే అయినా కార్యాచరణ మాత్రం వేర్వేరుగా సాగుతోంది. ఇందుకూరి సుబ్బలక్ష్మి పార్టీలో చేరిన తర్వాత సమీకరణాలు మారిపోయాయన్న అభిప్రాయం బలపడుతోంది. ఆమె వెనుక ఎమ్మెల్సీ రఘురాజు ఉన్నారు‌. అయితే వైసీపీ ఇప్పటికే రఘురాజు తమ సభ్యుడు కాదని స్పష్టం చేయడంతో…ఆయన కొత్త రాజకీయ వేదిక కోసం ప్రయత్నాలు చేస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న వేళ…తమ అనుచరులను పదవుల్లో కూర్చోబెట్టాలని ప్రత్యర్థివర్గం ప్రయత్నిస్తోంది. ఇదే సమయంలో రఘురాజును పార్టీలోకి తీసుకురావాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఇలాంటి తరుణంలోనే జిందాల్-రైతుల సమస్య కూడా రాజకీయ రంగు పులుముకుంది. అసలైన రైతులు ఎవరనే ప్రశ్నను లేవనెత్తుతూనే…ప్రభుత్వం పరిహారం చెల్లించేందుకు సిద్ధంగా ఉందని ఓ వర్గం చెబుతోంది. రఘురాజు ఈ అంశాన్ని రాజకీయంగా వినియోగించుకునే ప్రయత్నం చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కావాలనే ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టి…రాజకీయంగా లాభపడాలనే వ్యూహం నడుస్తోందన్న చర్చ కూడా సాగుతోంది. రఘురాజు కొంతమందిని వెనుకనుంచి ప్రేరేపిస్తూ…రాజకీయాలు చేస్తున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

Read Also: Night Cream for Glowing Skin: మీ చర్మం సహజంగా మెరిసిపోతుంది.. ఇంట్లోనే ఇలా నైట్‌ క్రీమ్‌ తయారు చేసుకోండి..

ఎమ్మెల్యే కోళ లలితకుమారి మాత్రం ఆచితూచి అడుగులు వేస్తున్నారని పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. గొంప కృష్ణ, సుబ్బలక్ష్మి మధ్య గ్యాప్ పెరిగితే…అది తన వర్గానికి లాభమనే లెక్కల్లో రఘురాజు ఉన్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రత్యేకంగా శృంగవరపుకోట మండలంపై మూడు వర్గాల దృష్టి పెట్టినట్లు అనుచరులు చెప్పుకుంటున్నారు. ఈ మండలంలో ఆధిపత్యం సాధిస్తే స్థానిక సంస్థల ఎన్నికల్లో కీలక స్థానాలు దక్కే అవకాశం ఉంది. అందుకే ఎవ్వరూ వెనక్కి తగ్గే పరిస్థితి కనిపించడం లేదు. పార్టీ బలంగా ఉన్నప్పటికీ అంతర్గత వర్గపోరు అదే స్థాయిలో కొనసాగితే…దీని ప్రభావం ఎన్నికలపై పడే అవకాశం ఉందన్న ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. ఒకవైపు కొత్త సమీకరణాలు…మరోవైపు పాత విభేదాలు మధ్యలో స్థానిక సమస్యలు కలవరపెడుతున్నాయి. ఇవన్నీ కలిపి శృంగవరపుకోట రాజకీయాలను మరింత రసవత్తరంగా మార్చుతున్నాయి. ప్రస్తుతం అందరి చూపు ఒకటే..ఈ అంతర్గత పోరు ఎటు దారి తీస్తుందని చర్చించుకుంటున్నారు. చివరికి ఎవరి వ్యూహం ఫలిస్తుంది.. పార్టీ అధిష్టానం జోక్యం చేసుకుంటుందా.. లేక స్థానిక నాయకుల మధ్యే పరిష్కారం కనుగొంటారా అన్న దానికి కాలమే సమాధానం చెప్పాలి.

Exit mobile version