NTV Telugu Site icon

Off The Record: టీడీపీలో సీనియర్స్ వర్సెస్‌ జూనియర్స్..

Tdp

Tdp

Off The Record: ఉమ్మడి అనంతపురం జిల్లాలోని రెండు నియోజకవర్గాల్లో ఇప్పుడు టీడీపీకి కొత్త సమస్య వచ్చింది. జూనియర్స్‌ వర్సెస్‌ సీనియర్స్‌ అన్నట్టుగా ఉందట అక్కడి వ్యవహారం. ఎన్నికలు సమీపిస్తున్న టైంలో వ్యవహారం ముదిరి పాకాన పడుతోందట. ఏపని చేయాలన్నా… సీనియరా? జూనియరా అన్న ప్రస్తావన వచ్చి కేడర్‌ సతమతమవుతున్నట్టు తెలిసింది. మడకశిర, పెనుకొండలో ఈ పరిస్థితి ఉన్నట్టు చెబుతున్నాయి జిల్లా టీడీపీ వర్గాలు. ముందుగా పెనుకొండ విషయానికొస్తే.. ఇక్కడ ఇన్ఛార్జ్‌ పార్థసారథి. సీనియర్‌ అయిన పార్థసారధి దాదాపు దశాబ్దం నుంచి ఉమ్మడి జిల్లా పార్టీ బాధ్యతలు చూస్తున్నారు. ప్రస్తుతం శ్రీసత్యసాయి జిల్లాకు అధ్యక్షుడిగా ఉన్నారు. అన్ని నియోజకవర్గాలను సమన్వయం చేయాల్సిన పార్థసారధికి ఇప్పుడు సొంత చోటే సమస్య మొదలైంది. మొన్నటి వరకు తన దగ్గరే ఒక మామూలు నాయకురాలిగా ఉన్న కురుబ సవిత ఆయనకు తలనొప్పిగా మారిపోయారట. గతంలో పార్థసారధి ఏ కార్యక్రమం చేసినా.. ఆయన వెంటే ఉండేవారు సవిత. కానీ ఇప్పుడు రూట్‌ మార్చినట్టు చెబుతున్నారు. ఎన్నాళ్ళిలా వెనక నిలబడి జై కొట్టాలి అనుకుంటూ…. ఆమె కూడా సొంత క్యాడర్ ఏర్పాటు చేసుకుని.. సీనియర్‌కు ఝలక్‌ ఇస్తున్నారట.

పెనుకొండ తెలుగుదేశం పార్టీకి కంచుకోట అయినా… 2019 ఎన్నికల్లో ఓటమి తప్పలేదు. ఆ తర్వాత… పార్థసారధితో ఎలాంటి గొడవలు లేకున్నా.. సడన్ గా సవిత కూడా ఈసారి టికెట్ రేసులో ఉన్నారన్న ప్రచారం మొదలైంది. పార్టీ అధిష్టానం కూడా తరచూ కీలకమైన బాధ్యతలు, పదవులు ఇస్తుండటం ఆమెకు మరింత బలాన్నిచ్చింది. దీంతో పెనుకొండలో జూనియర్‌గా ఉన్న సవిత తన సీనియర్‌తో ఢీ అంటే ఢీ అంటున్నారు. ఈ వ్యవహారాన్ని పార్ధసారథి అధినాయకత్వం దృష్టికి తీసుకువెళ్ళినా…ఉపయోగం లేదట. ఉమ్మడి జిల్లాలో కూడా ఇప్పుడిదే హాట్‌ టాపిక్‌ అయింది. జనరల్‌గా కాలేజీల్లో అయితే…సీనియర్స్‌ జూనియర్స్‌ని ర్యాగింగ్‌ చేస్తారు. పెనుకొండ పాలిటిక్స్‌లో మాత్రం రివర్స్‌లో జూనియర్‌ సీనియర్‌ని ర్యాగింగ్‌ చేస్తున్నారని సెటైర్లు వేసుకుంటున్నాయి జిల్లా రాజకీయ వర్గాలు.

ఇక ఇలాంటి గొడవే మడకశిరలో కూడా జరుగుతోంది. ఇక్కడ మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి, మాజీ ఎమ్మెల్యే ఈరన్నల మధ్య ఆధిపత్య పోరు పీక్స్‌లో ఉంది. ఈ ఇద్దరు నేతల్లో తిప్పేస్వామి సీనియర్. ఈరన్న రాజకీయాలకు జూనియర్. కానీ… తిప్పేస్వామి 2014కు ముందు వరకు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. నియోజకవర్గంపై పట్టున్న నేత. రాష్ట్ర విభజన తరువాత టీడీపీలో చేరి 2014 ఎన్నికల్లో కీలక పాత్ర పోషించారు. అందుకే ఆయనకు టీడీపీ అధిష్టానం ఎమ్మెల్సీ పదవి ఇచ్చింది. 2014 ఎన్నికల్లో గెలిచిన ఈరన్న.. తిప్పేస్వామి కలిసే ఉండేవారు. సీనియారిటీకి ఈరన్న కూడా గౌరవం ఇచ్చే వారు. కానీ 2019 ఓటమి తరువాత పరిస్థితులు మారిపోయాయి. ఇద్దరి మధ్య గ్యాప్ వచ్చింది. నేను చెప్పినట్టే నడవాలని తిప్పేస్వామి.. అసలు నియోజకవర్గ ఇన్ఛార్జ్‌ నేను కదా అని ఈరన్న… పంతంపట్టి రెండు గ్రూపులుగా విడిపోయారు. ఏకంగా ఎవరికి వారు రెండు పార్టీ ఆఫీసులు కూడా ఏర్పాటు చేసుకున్నారు. దీనికి తోడు పార్టీలో ముందు నుంచి ఉన్నది నేను.. ఇక్కడ నేనే సీనియర్ అని ఈరన్న అంటున్నారు. దశాబ్దాల తరబడి రాజకీయాల్లో ఉన్న నా మాటను ధిక్కరిస్తారా అని ఆగ్రహిస్తున్నారు తిప్పేస్వామి. సెవెన్త్‌ పాస్‌ గొప్పా లేక టెన్త్‌ ఫెయిల్‌ గొప్పా అన్నట్టుంది ఇద్దరి వ్యవహారం. ఇలా ఈ రెండు నియోజకవర్గాల్లో జూనియర్, సీనియర్ వివాదంతో కేడర్‌లో గందరగోళం పెరుగుతోందట. ఎవరి వైపు ఉండాలో తేల్చుకోలేక సతమతమవుతున్నారట. నేతల కారణంగా కార్యకర్తల్లో కూడా చీలిక వచ్చినట్టు తెలిసింది. ఈ జూనియర్, సీనియర్ వివాదం ముదిరి ఇతర నియోజకవర్గాలకు పాకితే…. మొదటికే మోసం వస్తుందని ఆందోళన పడుతున్నాయి టీడీపీ జిల్లా వర్గాలు. అధినాయకత్వం ఏం చర్యలు తీసుకుంటుందో చూడాలి.