Site icon NTV Telugu

Off The Record: టీడీపీలో కొత్త రకం చర్చ.. కొందరు నేతలు రివర్స్‌ స్వింగ్‌లో ఉన్నారా?

Tdp

Tdp

Off The Record: పార్టీ బాగుండాలి.. అధికారంలోకి వచ్చేయాలి.. దానిద్వారా జరిగే మేళ్ళు ఆసాంతం తమకే దక్కాలి.. కానీ, తమ నియోజకవర్గానికి చెందిన పార్టీ అభ్యర్థి మాత్రం గెలవకూడదు. ఇదీ.. ప్రస్తుతం టీడీపీలో జరుగుతున్న తంతు. ప్రతి జిల్లాలోనూ ఈ తరహా సెగ్మెంట్లు కనీసం రెండు మూడు ఉన్నాయట. దీంతో ఇలా ప్రతి ఒక్కరూ ఆలోచిస్తే.. ఎలా అనే చర్చ జరుగుతోంది పార్టీ వర్గాల్లో. 2019 ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా ఓడిపోయింది. కేవలం 23 సీట్లకు పరిమితం అయింది. గెలిచిన వారిలో కూడా కొందరు జంప్‌ అయ్యారు. ఇక కోలుకోవడం కష్టమని అంతా భావించిన తరుణంలో అనుకోని విధంగా పుంజుకుంది. పార్టీని గేరప్‌ చేయడంలో సక్సెస్‌ అయింది అధిష్టానం. పొత్తుల వల్ల కావచ్చు.. పార్టీకున్న సొంత బలం కావచ్చు.. ఎన్నికల టైంకు బలంగానే ప్రత్యర్థిని ఢీకొట్టే స్థితికి వచ్చింది. చెప్పుకోవడానికి అంతవరకు బాగానే ఉందిగానీ.. కొందరు నేతల పనితీరు మాత్రం టీడీపీ అధిష్టానాన్ని.. పార్టీ అధినేతను ఆందోళనల్లోకి నెట్టే విధంగా ఉందట.

మరీ ముఖ్యంగా కొన్ని జిల్లాల్లో టిక్కెట్లు దక్కని నేతలు.. పార్టీ నిర్ణయించిన అభ్యర్థిని గెలిపించడానికి కృషి చేయకపోగా.. తమకు దక్కని టిక్కెట్‌ వాళ్ళకు కూడా ఉండకూడదన్న టార్గెట్‌తో వ్యవహరిస్తున్నట్టు తెలిసింది. నియోజకవర్గంలో పార్టీ అభ్యర్థి ఓడిపోతే బాగుండుననే రీతిలో వ్యవహారం నడుపుతున్నట్టు తెలిసింది. అంతే కాకుండా.. ఆ ఆలోచనను తమ మనస్సులో ఉంచుకోకుండా.. అభ్యర్థులను డామేజ్‌ చేసే దిశగా పావులు కదుపుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. అంతా బాగానే ఉంది గానీ… మా అభ్యర్థి ఓడిపోతారు.. అందరితోనూ కలవడం లేదు.. డబ్బులు సరిగా తీయడం లేదు.. ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలి.. వైసీపీ అభ్యర్థి దూసుకెళ్తున్నారంటూ నెగెటివ్‌ టాక్‌ను స్ప్రెడ్‌ చేస్తున్నట్టు సమాచారం. ఈ తరహా వ్యతిరేక ప్రచారం ఎక్కువ కావడంతో సదరు అభ్యర్థి ఓడిపోతారనే అభిప్రాయం నియోజకవర్గాల్లో పెరుగుతోందట. ప్రతి ఉమ్మడి జిల్లాలోనూ రెండు మూడు సెగ్మెంట్లల్లో జరుగుతున్న ఈ తరహా వ్యతిరేక ప్రచారం టీడీపీ అభ్యర్థుల్ని ఇబ్బంది పెడుతున్నట్టు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

ఈ తరహా చర్చ గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని కొన్ని సెగ్మెంట్లల్లో ఉంటే.. ఉత్తరాంధ్రలోని కొన్ని సెగ్మెంట్లల్లో ఇంకొంచెం గట్టిగానే వినిపిస్తోందని సమాచారం. తమకిష్టం లేని వ్యక్తి అభ్యర్థి అయినా, తమకు కాకుండా.. వేరే వారికి సీటు దక్కినా, ఓర్చుకోలేక.. నెగెటివ్‌ ప్రచారం చేస్తున్నారని తెలుస్తోంది. కావాలనే ఈ తరహా ప్రచారం చేయడం.. ఏమైనా అంటే.. అక్కడ జరుగుతున్నది చెబుతున్నాం.. వింటే వినండి.. లేకుంటే మీ ఇష్టం అంటూ ఎదురు తిరుగుతున్నారట నెగెటివ్‌ టాకర్స్‌. దీంతో వీళ్లని.. వీళ్ల నోళ్లని కట్టడి చేయలేక ఆయా నియోజకవర్గాలకు చెందిన అభ్యర్థులు కిందా మీదా పడుతూ.. పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్తున్నారట. ఇంకొన్ని చోట్ల పొత్తుల్లో భాగంగా వేరే పార్టీకి టిక్కెట్‌ దక్కిన చోట్ల కూడా ఇదే తరహా వ్యవహారం నడుస్తోందట. ఫొటోలకు ఫోజులివ్వడం.. కలిసి పని చేస్తామని గొప్పగా చెప్పడం మినహా ఫీల్డులో సహకారం ఏ మాత్రం ఉండడం లేదని అంటున్నారట. ఇలాంటి విషయంలో అధిష్టానం సీరియస్‌గా ఉండాలని, ఇలా వాంటి వారిపై ఓ కన్నేసి ఉంచాలనే సూచనలు వస్తున్నాయట అధిష్టానానికి. తమ సెగ్మెంట్‌ అభ్యర్థి ఓడిపోవాలనే కోరిక మరీ ఎక్కువైతే.. అసలు పార్టీ ఎలా అధికారంలోకి వస్తుందనే కనీస స్పృహ కూడా లేకుండా కొందరు నేతలు వ్యవహరించడం పార్టీకి తలనొప్పిగా మారిందనే ప్రచారం జరుగుతోంది. మరి నెగెటివ్‌ టాకర్స్‌ని టీడీపీ అభ్యర్థులు ఎలా ఢీకొడతారో చూడాలి.

Exit mobile version