NTV Telugu Site icon

Off The Record: అధికార పార్టీ ఎంపీ, ఎమ్మెల్యేల మధ్య ఆధిపత్య పోరు రచ్చకెక్కిందా?

Perni Nani

Perni Nani

Off The Record: వల్లభనేని బాలశౌరి, పేర్ని నాని.. ఇద్దరూ అధికార పార్టీకి చెందిన ఎంపీ, ఎమ్మెల్యే. 2019 ఎన్నికల సమయంలో సన్నిహితంగా మెలిగిన ఈ ఇద్దరి మధ్య ఇప్పుడు కోల్డ్ వార్ నడుస్తోందట. పైకి అంతా గప్‌చుప్‌ అన్నట్టుగా ఉన్నా.. లోలోపల మాత్రం రెండు వర్గాలు కత్తులు దూసుకుంటున్నట్టు చెప్పుకుంటున్నారు. అవకాశం వచ్చిన ప్రతిసారి ఒకరిపై ఒకరు పైచేయి సాధించటం కోసం ప్రయత్నాలు చేయటం అధిష్టానానికి తలనొప్పిగా మారిందని టాక్. తాజాగా మచిలీపట్నం పోర్టు శంకుస్థాపన సందర్భంగా మరోసారి లుకలుకలు బయటపడ్డాయి. సీఎం జగన్ పాల్గొన్న వేదిక మీద ఎంపీ బాలశౌరికి సీటు కేటాయించ లేదు. సీఎంకి ఒకవైపు ఎమ్మెల్యే పేర్ని నాని, మరోవైపు కలెక్టర్ రాజాబాబుకు సీట్లు కేటాయించగా.. తనను అవమానించారంటూ ఎంపీ మనస్తాపానికి గురైనట్టు సమాచారం. సీటు లేకపోవటంతో వేదికపైనే నిల్చున్న ఆయన్ని సీఎం పిలవటం, అదే సమయంలో కలెక్టర్ ప్రసంగించడానికి వెళ్ళటంతో ఆ సీట్లో ఎంపీ కూర్చోవడం జరిగిపోయాయి. కొద్దిసేపటి తర్వాత ఎంపీ ఇబ్బందిని గుర్తించిన అధికారులు రాజ్యసభ సభ్యుడు అయోధ్య రామిరెడ్డి పక్కన సీటు సర్ధుబాటు చేశారు.

మచిలీపట్నం ఎంపీగా.. తన లోక్‌సభ నియోజకవర్గంలో కార్యక్రమం జరుగుతుంటే.. వేదికపై సీటు కేటాయించకపోవటంపై బాలశౌరి లోలోపల రగిలిపోతున్నట్టు తెలిసింది. సీఎం పక్కన ఎంపీకి సీటు ఉండాలి కదా… కలెక్టర్‌కు ఆ సంగతి తెలియదా? అంటూ సన్నిహితుల దగ్గర ఆగ్రహం వ్యక్తం చేశారట. అయితే ఇదంతా పేర్ని నాని పనే అంటూ ఎంపీ వర్గం గుర్రుగా ఉందట. మరోవైపు శంకుస్థాపన ఆహ్వాన పత్రికలో కూడా ఎంపీ పేరును ఆఖరులో వేయటాన్ని కూడా బాలశౌరి వర్గం వర్గం సీరియస్ గా తీసుకుందట. మేయర్, జడ్పీ ఛైర్ పర్సన్, వ్యవసాయ కమిషన్ వైస్ ఛైర్మన్ పేర్లన్నీ ముద్రించి ఆఖర్లో ఎంపీ పేరు వేయటం ప్రోటోకాల్‌కు విరుద్ధమని వాదిస్తోందట బాలశౌరి వర్గం. 2019 ఎన్నికల సమయంలో ఇద్దరూ కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. తొలిసారి బందరు ఎంపీగా బాలశౌరి గెలవగా ఎమ్మెల్యేగా మూడోసారి గెలిచిన పేర్ని నాని మంత్రిగా కూడా పనిచేశారు. ఆ తర్వాత నుంచి మచిలీపట్నంలో అభివృద్ధి పనుల విషయంలో ఇద్దరి మధ్య పేచీ మొదలైందట. అభివృద్ధి పనులు సాధించటంలో ఎవరికి వారు తమ కృషి ఉందని ఇద్దరూ చెప్పుకునే ప్రయత్నం చేయటమే దీనికి ప్రధాన కారణంగా చెబుతున్నారు. పేచీ మొదలైన సమయంలోనే మచిలీపట్నంలోని వార్డులో పర్యటించడానికి వచ్చిన ఎంపీ బాలశౌరిని సమాచారం ఇవ్వలేదంటూ స్థానిక ఎమ్మెల్యే వర్గం అడ్డుకుంది. దీంతో ఇద్దరి మధ్య వివాదం ముదిరింది.

మచిలీపట్నం అభివృద్ధి పనుల విషయంలో ఎంపీ, ఎమ్మెల్యే మధ్య విపరీతమైన పోటీ ఏర్పడింది. జిల్లా ఆస్పత్రిలో వసతుల కల్పనకు సంబంధించి ఎంపీ స్థానికంగా ఉన్న కంపెనీతో మాట్లాడి కొన్ని సదుపాయాలు కల్పించారు. ఆసుపత్రి అభివృద్ధికి తాను కారణమంటే…తాను కారణమంటూ ఇద్దరి మధ్య వివాదం మొదలైంది. ఇది గ్రూపులు గొడవకు దారితీసింది. బహిరంగ వేదిక మీదే పరోక్షంగా ఇద్దరు నేతలు కామెంట్లు చేసుకున్నారు. అలాగే మెడికల్ కాలేజ్ అనుమతులు, పోర్టు ఫైనాన్షియల్ క్లోజర్ వంటి విషయాల్లో క్రెడిట్‌ కోసం ఇద్దరూ పోటీ పడ్డారు. ఎంపీ ఫ్లెక్సీలను ఎమ్మెల్యే అనుచరులు చించేయటం కూడా వివాదం ముదరటానికి కారణం. ఫ్లెక్సీ గొడవతో అంతర్గత పోరు కాస్తా రచ్చకెక్కింది. తాజాగా పోర్టు శంకుస్థాపన పత్రికలో ప్రోటో కాల్ పాటించకపోవటం, వేదికపై సీటు కేటాయించకపోవటంతో ఇద్దరి మధ్య యుద్ధం పతాక స్థాయికి చేరినట్టు చెప్పుకుంటున్నారు. ఈ గ్యాప్‌ను పూడ్చడానికి అధిష్టానం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.

Show comments