Off The Record: కేశినేని నాని. ఏపీ టీడీపీలో తాజా సంచలనం. కొంత కాలంగా ఆయన ఏ కార్యక్రమంలో పాల్గొన్నా.. టీడీపీ అధినాయకత్వాన్ని.. బెజవాడ లోక్‌సభ సీటు పరిధిలోని టీడీపీ ఇన్ఛార్జ్‌లను ఉద్దేశించి కామెంట్స్ చేయడం కామనైపోయింది. అయితే… గురువారం చేసిన కామెంట్స్ టీడీపీలో ఆసక్తికర చర్చకు దారి తీశాయి. గతంలో పార్టీ ప్రక్షాళన గురించి మాట్లాడేవారని,.. కానీ ఇప్పుడు అందుకు భిన్నంగా ఆయన మాటలు ఉన్నాయని చెప్పుకుంటున్నాయి పార్టీ వర్గాలు. దీంతో పార్టీలో కేశినేని ఉండటం అనుమానమేనన్న చర్చ జరుగుతోంది. టీడీపీ నుంచి నాని జెండా పీకేయడం ఖాయమన్న మాటలు గట్టిగానే వినిపిస్తున్నాయి.
కొన్నాళ్ల క్రితం చంద్రబాబు దగ్గర జరిగిన సమావేశంలో కేశినేని నాని తనంతట తానే ముందుకు వచ్చి.. ఈసారి ఎన్నికల్లో పోటీ చేయబోనని చెప్పారట. తనకు బదులు వేరే వారిని చూసుకోమని చెప్పినట్టు గుర్తు చేస్తున్నాయి పార్టీ వర్గాలు. అప్పుడు నాని మాటలతో చంద్రబాబు సహా అందరూ షాక్ అయ్యారట. అలాంటిది.. ఇప్పుడు ఈ తరహాలో మాట్లాడ్డం ఎంత వరకు కరెక్ట్ అంటున్నారు. నానికి టిక్కెట్ ఇవ్వడంలేదని టీడీపీ అధినాయకత్వం కనీసం మాట మాత్రంగానైనా చెప్పలేదని.. ఆయన మాత్రం తాను ఇండిపెండెంటుగా పోటీ చేస్తానని, వేరే పార్టీల నుంచి ఆఫర్లు ఉన్నాయని చెప్పడాన్ని ఎలా అర్ధం చేసుకోవాలంటూ మండిపడుతున్నారు టీడీపీ నాయకులు. తనకు బదులు తన తమ్ముడు చిన్నిని టీడీపీ అధినాయకత్వం ప్రొత్సహిస్తోందన్న అభిప్రాయం బలంగా ఉండడం వల్లే నాని ఈ తరహా కామెంట్లు చేస్తున్నట్టు చెప్పుకుంటున్నారు.
కేశినేని చిన్ని పార్టీలో యాక్టివ్‌గా ఉండడం ఇష్టం లేకే ఎంపీ ఈ స్థాయిలో మాట్లాడుతున్నారని అంటున్నారు కొందరు టీడీపీ నేతలు. విజయవాడ పరిధిలో ఇప్పటి దాకా నాని చెప్పిన విధంగానే పార్టీ అధినాయకత్వం చేసిందని అంటున్నారు. ఎక్కడా ఓ ఎంపీని అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్‌గా ప్రకటించలేదని, ఆ అవకాశం నాని ఒక్కరికే కల్పించారని గుర్తు చేస్తున్నారు. బెజవాడ ఎంపీగా ఉన్న కేశినేని నానిని.. విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్‌గా ప్రకటించిన సంగతి గుర్తు చేస్తున్నారు. తనకు పశ్చిమ ఇన్ఛార్జ్ కావాలని కేశినేని పట్టుబడితే.. ఆ మాటను గౌరవించి పదవి కట్టబెట్టిన విషయాన్ని, విజయవాడ కార్పొరేషన్ ఎన్నికల్లో మేయర్ అభ్యర్థిగా కేశినేని శ్వేతను ప్రకటించిన విషయాన్ని నాని మరిచిపోయారా..? అని ప్రశ్నిస్తున్నారు సదరు నేతలు. ఇంత చేస్తున్నా.. నాని పార్టీ అధినాయకత్వంపై చిర్రు బుర్రులాడటం సరికాదని అంటున్నారు.
అయితే కేశినేని ఆలోచన మరోలా ఉందట. తాను గెలిచిన దగ్గర నుంచి తనకు ప్రాధాన్యత ఇవ్వకుండా అనర్హులను అందలమెక్కించేలా హైకమాండ్ వ్యవహరించిందని అంటున్నారట. మున్సిపల్ ఎన్నికల టైంలో అభ్యర్థుల ఎంపికలో కానీ.. ఇతరత్రా వ్యవహరాల్లో కానీ తనకు ప్రాధాన్యత ఇవ్వకపోవడమే కాకుండా.. తనను చెప్పుతో కొడతానన్న బుద్దా వెంకన్న.. అనరాని మాటలన్న బోండా ఉమను పార్టీ అధినాయకత్వం కనీసం ఒక్క మాట కూడా అనలేదని నారాజ్‌గా ఉన్నారట. పైగా బోండా ఉమను పొలిట్ బ్యూరో సభ్యునిగా చేయడం నానికి ఏ మాత్రం కొరుకుడు పడని అంశంగా మారిందట. ఫ్యాన్ హవా పెద్ద ఎత్తున వీచిన సందర్భంలో కూడా గెలిచిన తనను కాదని.. ఆ గాలికి కొట్టుకు పోయిన వారిని భుజాలకెక్కించుకోవడమేగాక తనను అవమానించిన తర్వాత వారికి పదవులు కట్టబెట్టడం కేశినేనికి చిర్రెత్తించిందనేది ఓ విశ్లేషణ. ఇదే సందర్భంలో తనతో విబేధించిన తన తమ్ముడు కేశినేని చిన్నిని పార్టీ అధినాయకత్వం ప్రొత్సహించడంతో నాని ఇగో గట్టిగానే దెబ్బతిందట.
ఇదే కాకుండా ఎంపీలుగా ముగ్గురు గెలిస్తే..తనకు ఏ మాత్రం విలువ ఇవ్వకుండా ప్రతి దానికి రామ్మోహన్ నాయుడుకు ప్రాధాన్యత ఇవ్వడం కేశినేనికి నచ్చలేదనే చర్చ జరుగుతోంది. ఢిల్లీలోనే కాకుండా.. మహానాడు లాంటి పార్టీ వేదికల మీద కూడా రామ్మోహన్‌కు ప్రాధాన్యం ఇవ్వడం నాని కోపానికి మరో కారణమట. దీని వల్లే మహానాడుకు ఆహ్వానం పంపలేదనే సాకుతో గైర్హాజరయ్యారని అంటున్నారు. సహజంగా పార్టీలో నాయకులకు మహానాడు పేరుతో ప్రత్యేకంగా ఆహ్వానాలు పంపే ఆనవాయితీ లేదని గుర్తు చేస్తున్నాయి పార్టీ వర్గాలు. ఇప్పటికే పార్టీ అధినాయకత్వంతో ఉన్న గ్యాప్ కారణంగా రామ్మోహన్ నాయుడుని సాకుగా చూపి మహానాడుకు హాజరు కాలేదట కేశినేని నాని. ఓవైపు నాని కామెంట్స్,.. మరోవైపు ఆయన వ్యవహార శైలి చూస్తుంటే టీడీపీని వీడడం ఖాయమని అంటున్నాయి పార్టీ వర్గాలు. కేశినేని నాని ఇప్పటికే వైసీపీకి చెందిన కొందరు నేతలతో రెగ్యులర్‌గా టచ్‌లో ఉన్నారనే చర్చ పార్టీ వర్గాల్లో జరుగుతోంది. మొన్నటి వరకు మంత్రులుగా వ్యవహరించిన ఇద్దరు కీలక నేతలతో ఆయన రెగ్యులర్‌గా టచ్‌లో ఉన్నారని చెప్పుకుంటున్నారు. సదురు మాజీ మంత్రులు, కేశినేని మధ్య రెగ్యులర్‌గా డిన్నర్ మీటింగ్‌లు జరుగుతున్నాయని అంటోంది ఎంపీ ఆపోజిట్ గ్యాంగ్. పరిణామాలు ఈ స్థాయిలో ఉండడం.. వివిధ పార్టీలతో టచ్‌లో ఉంటున్నానని చెప్పడం.. హీట్ 100 డిగ్రీలకు చేరితే పార్టీని వీడతానని అనడం చూస్తుంటే కేశినేని నాని టీడీపీ నుంచి జెండా పీకేయడం ఖాయమనే భావన టీడీపీ వర్గాల్లో బలంగా వ్యక్తమవుతోంది.
