NTV Telugu Site icon

Off The Record: ఆ మంత్రిని కలవడానికి టీడీపీ కేడర్ సతమతం అవుతుందా..?

Vasamsetti Subhash

Vasamsetti Subhash

Off The Record: ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా టీడీపీలో గెలిచామన్న ఊపు, పార్టీ అధికారంలో ఉందన్న ఉత్సాహం కొరవడ్డాయా? అంటే… అవును, వాతావరణం అలాగే కనిపిస్తోందన్నది పరిశీలకుల సమాధానం. ఏం… ఎందుకు? రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ శ్రేణులన్నీ మాంఛి పార్టీ మూడ్‌లో ఉంటే మీకా నిరుత్సాహం ఎందుకంటే… కేడర్‌ వేళ్ళన్నీ మంత్రి వాసంశెట్టి సుభాష్‌ వైపే చూపిస్తున్నాయట. ఉమ్మడి జిల్లా నుంచి రాష్ట్ర క్యాబినెట్‌లో ముగ్గురు మంత్రులు ఉన్నారు. వీరిలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉపముఖ్య మంత్రికాగా… మంత్రులుగా కందుల దుర్గేష్, వాసంశెట్టి సుభాష్ ఉన్నారు. పవన్, దుర్గేష్‌ ఇద్దరూ జనసేనకు చెందినవారు కావడంతో… టీడీపీ కేడర్‌ అంత చొరవగా వాళ్ళ దగ్గరకు వెళ్ళే అవకాశం లేదంటున్నారు. ఇక సుభాష్ పేరుకు టీడీపీ నేతే అయినా… ఆయన చుట్టూ… తమ పార్టీ నాయకులకంటే… పాత వైసీపీ మిత్రులే ఎక్కువగా కనిపిస్తున్నారని తెలుగుదేశం నాయకులు అసహనంగా ఉన్నట్టు చెప్పుకుంటున్నారు.

అసెంబ్లీ ఎన్నికలకు రెండు నెలల ముందే తెలుగుదేశంలో చేరారు సుభాష్‌. అప్పటివరకు వైసీపీలో క్రియాశీలకంగా ఉన్నారు. ఇక పార్టీ మారినా… జిల్లా టీడీపీ నాయకులు, ఇతర సీనియర్స్‌తో మంత్రికి పెద్దగా పరిచయాలు ఏర్పడ లేదట. ఏ జిల్లాలోనైనా జిల్లా మంత్రి క్రియాశీలకంగా వ్యవహరించడం సహజం. స్థానిక పార్టీ వ్యవహారాలు కూడా వాళ్ళ కనుసన్ననల్లోనే నడుస్తుంటాయి. కానీ… ఇప్పుడు సుభాష్‌కు పార్టీలో పరిచయాలు లేకపోవడం, పైగా జూనియర్‌ కావడంతో… సమస్యను చెప్పుకోవడానికి ఇక్కడి సీనియర్స్‌ వెనకా ముందు ఆడుతున్నట్టు తెలుస్తోంది. అలాగని ఉమ్మడి జిల్లాకు చెందిన పార్టీ ముఖ్య నేతలు కూడా వివిధ కారణాలతో ఎన్నికల తర్వాత సైలెంట్‌ అయ్యారు. తనకు సీటు దక్కలేదన్న కారణంతో మాజీ మంత్రి జవహర్ అంటీముట్టనట్లుగా వ్యవహస్తున్నారు. కాకినాడ జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్ కూడా కాకినాడ ఎంపీ సీటు ఆశించారు. తండ్రీకొడుకులిద్దరికీ సీటిచ్చే అవకాశం లేదని తేల్చేయడంతో సీనియారిటీ కోటాలో తండ్రి నెహ్రూకు మంత్రి పదవొస్తుందన్న ఆశతో కాంప్రమైజ్‌ అయ్యారు నవీన్‌. చివరికి నెహ్రూ భారీ మెజార్టీతో విజయం సాధించినా ఆయన జీవితకాల కోరిక అయిన మంత్రి పదవి మాత్రం దక్కలేదు. దీంతో నవీన్ కూడా స్తబ్దుగా ఉన్నారట.

అటు కోనసీమ జిల్లా అధ్యక్షురాలు రెడ్డి అనంతకుమారి పరిస్థితి కూడా ఇంతే. తన భర్త, మండలి మాజీ ఉప సభాపతి రెడ్డి సుబ్రహ్మణ్యంకు రామచంద్రపురం సీటొస్తుందని అంచనా వేశారామె. కానీ.. సీటు దక్కకపోగా… అక్కడి నుంచి గెలిచిన సుభాష్‌కే మంత్రి పదవి వచ్చింది. అలాగే సొంత నియోజకవర్గం కొత్తపేటలోనూ టిడిపి అభ్యర్థి బండారు సత్యానందరావు గెలిచారు. ఇక్కడ జనసేన ఇన్చార్జ్ శ్రీనివాస్ కూడా తన అన్న సత్యానందరావుతో కలిసి రాజకీయాలు చేస్తున్నారు. దీంతో ఇటు రామచంద్రపురం, అటు కొత్తపేటల్లో ఎక్కడా కాకుండా పోయానన్న ఆవేదనలో ఉన్నారట రెడ్డి అనంతలక్ష్మి. ఆ పరిణామాలతో ఆమె కూడా సైలెంటైపోయినట్టు చెప్పుకుంటున్నారు. ఇలా… కారణాలు ఏవైనా… ఎవరికి వారు కామైపోవడం, మంత్రి దగ్గర చొరవ లేకపోవడంతో… లీడర్స్, కేడర్‌ మొత్తం గందరగోళంలో ఉన్నారన్నది టీడీపీ వర్గాల టాక్‌. గతంలో ఈ జిల్లా నుంచి యనమల రామకృష్ణుడు, నిమ్మకాయల చినరాజప్ప, కె.ఎస్‌. జవహర్ వంటి వారు మంత్రులుగా ఉన్నారు. వీళ్ళకు పార్టీ సీనియర్స్‌, జూనియర్స్‌ అందరితో ప్రత్యక్ష సంబంధాలుండేవి. ఎమ్మెల్యేలతో పాటు నాయకులు, కార్యకర్తలు కూడా తమ సమస్యల్ని వీరికి చెప్పుకునేవారు. కానీ ఇప్పుడు… ఇక్కడ టిడిపి పోటీ చేసిన 14స్థానాల్లోనూ గెలిచినా… పట్టించుకునే పెద్ద దిక్కు లేకుండా పోయిందన్న ఆవేదన వ్యక్తమవుతోందట వివిధ నియోజకవర్గాల నాయకుల్లో. మంత్రికి పార్టీ శ్రేణులతో ప్రత్యక్ష సంబంధాలు లేకపోవడమే అందుకు ప్రధాన కారణం అన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. పైగా సీనియర్‌ ఎమ్మెల్యేలు ఫలానా సమస్య అంటూ నేరుగా ఆయన దగ్గరికి వెళ్ళేందుకు ఇష్టపడటం లేదంటున్నారు. ఈ పరిస్థితిని పార్టీ పెద్దలు ఎలా చక్కదిద్దుతారో చూడాలంటున్నారు పరిశీలకులు. పైగా .. ఈ జిల్లా నుంచే డిప్యూటీ సీఎం పవన్‌ ప్రాతినిధ్యం వహిస్తున్నందున అటు జనసేనకు కూడా ఇబ్బంది లేకుండా వ్యవహారాన్ని జాగ్రత్తగా డీల్‌ చేయాల్సి ఉందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

Show comments