Off The Record: ఫైర్ బ్రాండ్ మినిస్టర్ రోజాకు సొంత నియోజకవర్గం నగరిలో కష్టాలు పెరుగుతున్నాయి తప్ప తగ్గడం లేదంటున్నారు. అపోజిషన్ నుంచి అవతలోళ్ళు ఎవరైనా సరే… తన మాటలతో చెడుగుడు ఆడేసుకునే రోజాకు.. లోకల్‌గా మాత్రం మండలాల వారీగా చెక్ పెట్టే నేతలు పెరిగిపోతున్నారట. ప్రస్తుతం నగరిలో వైసీపీ మూడు, నాలుగు ముక్కలు అయ్యింది. గత రెండు ఎన్నికల్లో రోజాను గెలిపించడానికి కృషి చేసినవారే.. ఇప్పుడు ఆమెపై తిరుగుబాటు చేస్తున్నారు. నియోజకవర్గంలోని ప్రతి మండలంలోనూ సొంత పార్టీ నుంచే రోజాకు బలమైన ప్రత్యర్థులు తయారయ్యారన్నదగి లోకల్ టాక్. రెండోసారి ఎమ్మెల్యే అయ్యాకే అసమ్మతి పెరిగిపోయిందంటున్నారు. నగరి మున్సిపాలిటీలో మంత్రికి వ్యతిరేకంగా మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ కేజే శాంతి ఉంటే.. పుత్తూరులో అమ్ములు, నిండ్రలో చక్రపాణి రెడ్డి, విజయపురంలో రాజు, వడమాల పేటలో మురళి రెడ్డి సహా ఇతర నేతలు ఉన్నారు. ఎన్నికల తర్వాత నియోజకవర్గంలో రోజా కుటుంబ సభ్యుల ప్రమేయం పెరిగిపోయిందంటూ స్థానిక నాయకులంతా ఒక్కొక్కరే దూరం అవుతున్నారు. అసమ్మతి నేతలకు ఎవరైనా సహకరిస్తే సస్పెండ్ చేస్తామని పార్టీ నుంచి ప్రకటన వచ్చినా పరిస్థితిలో పెద్దగా మార్పు లేందటున్నారు.
తాజాగా సీఎం జగన్ పర్యటనలో కూడా మరోసారి అంతర్గత విభేదాలు బయటపడ్డాయి. టూర్ సందర్భంగా వైసీపీ నేతలు భారీగా ఫ్లెక్సీలు కట్టారు. అయితే చాలా వాటిలో రోజా ఫొటో లేదు. నగిరి నియోజకవర్గ పరిధిలోని ఐదు మండలాల ఇన్చార్జ్ లు సీఎంకు స్వాగతం పలుకుతూ పెట్టించిన ఫ్లెక్సీల్లో మంత్రి ఫోటో లేకపోవడంపై నగరిలో హాట్ హాట్ చర్చ జరుగుతోంది. అదే సమయంలో ఆ ఫ్లెక్సీల్లో మరో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఫోటోలు ఉండటంతో పుండు మీద కారం చల్లినట్టయిందంటున్నారు. మంత్రి రోజా ఆధ్వర్యంలో సభ జరిగినందున ఐదు మండలాల ఇంఛార్జ్‌లు జన సమీకరణకు దూరంగా ఉన్నారట. దీంతో ఆ విషయంలో కూడా ఆమె తంటాలి పడాల్సి వచ్చిందంటున్నారు. అదంతా ఒక ఎత్తయితే.. తన పర్యటన సందర్భంగానైనా సీఎం జగన్ నగరి వర్గ విభేదాలకు చెక్ పెడతారని ఆశించిన నాయకులకు నిరాశే మిగిలిందట. శంకుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొన్న జగన్.. తొలుత ఈడిగ కార్పొరేషన్ చైర్‌పర్సన్ కేజే శాంతితో మాట్లాడి, కలిసి పనిచేయండి అన్నట్టుగా మంత్రి రోజా వైపు చూపించారు.
అయితే వారిద్దరూ ముఖాలు కూడా చూసుకోలేదు. సీఎం స్వయంగా వారి చేతులను పట్టుకుని కలిపే ప్రయత్నం చేశారు. కేజే శాంతి తన చేతిని ముందుకు చాచేందుకు ఇష్టపడలేదు. రోజా కూడా అనాసక్తంగా ఉండిపోయారు. జగన్ గట్టిగా లాగి ఇద్దరి చేతుల్నీ బలవంతంగా కలిపినా… రెప్పపాటు కాలంలోనే ఇద్దరూ వెనక్కి లాగేసుకున్నారు. నియోజకవర్గంలో రోజా వ్యతిరేక వర్గం ఎంత గట్టిగా ఉందో ఈ సంఘటన తెలియజేస్తోందంటున్నారు పరిశీలకులు. అసలే గ్రూపుల గోలతో నలిగిపోతున్న పార్టీని అధినేత ఒడ్డున పడేస్తారని భావించిన నగరి కేడర్‌కు ఇది పెద్ద షాక్ అయిందంటున్నారు. అధినేత ముందే నువ్వెంత అంటే నువ్వెంత అనే రేంజ్‌లో వ్యవహారం జరిగిందంటే…ఇప్పుడు ఏ గ్రూప్ వెంట వెళితే ఎవరికి కోపం వస్తుందోనన్న ఆందోళనలో ఉన్నారట కార్యకర్తలు. ఆ ఘటనతో మంత్రి రోజా మాకొద్దని అసమ్మతి నేతలు సీఎం ముందే చెప్పేసినట్టయిందని, ఇక ఈ అసంతృప్తిని గాడిన పెట్టేది ఎవరన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. దానికి తోడు తాను వెళ్ళిన కొన్ని చోట్ల జగన్…అభ్యర్థిని ప్రజలకు పరిచయం చేస్తూ గెలిపించాలని కోరుతున్నారు.అలాంటిది నగరిలో ఎక్కడా ఆ తరహా ప్రస్తావన రాకపోవడంతో వ్యతిరేక వర్గం హ్యాపీగా ఉందట. రోజా వర్గంలో మాత్రం ఎందుకు అధినేత అలా సైలెంట్ గా వెళ్ళిపోయారనే ఆందోళన మొదలైందంటున్నారు. రోజాకు అసలు సిసలైన పరీక్షలు ముందు ముందు ఉన్నాయంటున్నారు.
