Off The Record: మాజీ మంత్రి బండారు వ్యాఖ్యలపై మంత్రి రోజా తీవ్రంగా బాధపడుతున్నారట. ఎన్నో ఇబ్బందులను అధిగమించి ఈ స్థాయికి వచ్చానంటూ భావోద్వేగానికి గురవుతున్నారట. వ్యక్తిగత ఆరోపణలు సొంత నియోజకవర్గంలో సైతం ఇబ్బందిగా మారాయన్న భావనలో ఉన్నారట మంత్రి. అదే సమయంలో తన స్నేహితులైన నటి రాధిక శరత్ కుమార్, కుష్బులు అండగా నిలబడటం ఆమెకు ఊరటనిచ్చిందంటున్నారు. బండారు వ్యాఖ్యలను తప్పుపడుతూ ఎక్స్‌లో వీడియో రిలీజ్ చేశారు రాధిక. ఒక మహిళపై దిగజారుడు వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటన్నారామె. సత్యనారాయణ లాంటి రాజకీయ నాయకుడిని చూసి తాను సిగ్గుపడుతున్నానని అన్నారు రాధిక.
మరోవైపు జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు ఖుష్బు సుందర్ కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రోజాకు మద్దతు ప్రకటించి క్షమాపణ చెప్పేవరకూ వదలబోమని ప్రకటించారు. అటు మహారాష్ట్ర అమరావతి ఎంపీ, నటి నవనీత్ కౌర్ కూడా రోజాకు మద్దతు ప్రకటించారు. అక్కడి వరకు బాగానే ఉందిగానీ.. ఆ తర్వాతి రియాక్షన్స్ మీదే ఇటు సినీ, అటు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. రోజాకు ఏపీలో ఎవరూ మద్దతివ్వక, సానుభూతి చూపించకనే.. ఆమె తోటి నటులు అయిన రాధిక, కుష్బులకు కామమ్మ కధలు చెప్పి మద్దతు ఇప్పించుకుంటోందని ఫైర్ అవుతున్నారు జనసేన నేతలు. అక్కడితే అగకుండా వారు మద్దతు పలికిన ఎక్స్ వేదికగానే రివర్స్ కౌంటర్స్ వేసేస్తున్నారు. చిరంజీవి తల్లిని, పవన్ కల్యాణ్‌ని,ఆయన కుటుంబంలోని మహిళలను మీ బెస్ట్ ఫ్రెండ్ తీవ్రంగా అవమానించినప్పుడు మీరంతా ఎక్కడున్నారు? అప్పుడెందుకు స్పందించలేదని ఫైర్ అవుతోంది జనసేన, టీడీపీ కేడర్.
ఇక, చంద్రబాబు, లోకేష్‌తోపాటు ఇతర టిడిపి నేతలను ఉద్దేశించి రోజా అన్న మాటలను ఇద్దరికీ ట్యాగ్ చేస్తూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారట. అసలు ఏపిలో ఏం జరుగుతోందో.. రోజా ఏం చేస్తున్నారో.. ఎలా మాట్లాడుతున్నారో తెలుసుకోకుండా ఎలా స్పందిస్తారంటూ ఓ రేంజ్ లో రివర్స్ కౌంటర్స్‌తో హీటెక్కిస్తున్నారట. రోజా చేస్తున్న పనుల గురించి తెలిస్తే మీరే నగరి వచ్చి కొడతారని రియాక్షన్స్ ఇవ్వడంపై రచ్చ జరుగుతోంది. ఈ పరిణామాలతో ఇప్పుడు ఈ విషయం ఏపీలోనేగాక తమిళ సిని పరిశ్రమలో సైతం హాట్ టాపిక్ గా మారిందని చెప్పుకుంటున్నారు. దీంతో మిగిలిన వాళ్ళు స్పందించాలా? వద్దా? అనే డైలమాలో పడ్డారనే టాక్ నడుస్తోంది. తిరుపతి జనసేన నేతలైతే ఓ అడుగు ముందుకేసి అసలు సొంత పార్టీలో రోజాకు మద్దతు లేదంటూ సెటైర్లు వేయడం మరింత ఆసక్తికరంగా మారింది. ఏపీ మంత్రివర్గంలో రోజాతోపాటు ముగ్గురు మహిళా మంత్రులు ఉన్నారు. విడదల రజని, తానేటి వనిత, పసుపులేటి ఉషాశ్రీ చరణ్ ఉన్నా… ఏ ఒక్కరూ ముందుకు వచ్చి ఈ వ్యవహారంపై మాట్లాడలేదని, అలాంటిది.. తమిళనాడులో ఉన్న మీకెం తెలుసని మాట్లాడుతున్నారంటూ కౌంటర్స్ వేస్తున్నారు. దీంతో రాధిక, కుష్బు అభిమానులు మాత్రం.. అసలు వాళ్ళు స్పందించకుండా ఉంటే బాగుండేదని కామెంట్స్ చేస్తున్నారట. మొత్తంగా మంత్రి, మాజీ మంత్రి ఎపిసోడ్‌లో మాజీ హీరోయిన్స్ ఎరక్కపోయి వచ్చి ఇరుక్కుపోయారా అన్న చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది.
