Site icon NTV Telugu

Off The Record: జూబ్లీహిల్స్ గులాబీ పార్టీలో లుకలుకలు..!

Brs Party

Brs Party

Off The Record: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు…షెడ్యూలు ప్రకారం ఈ ఏడాది చివరిలో జరగాల్సి ఉంది. అందుకనుగుణంగా….పార్టీ శ్రేణులను సిద్ధం చేస్తోంది BRS. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తోంది గులాబీ పార్టీ. మే నెలాఖరు వరకు ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించుకోవచ్చని స్పష్టం చేసింది. అయితే ఆత్మీయ సమ్మేళనాలు అందరినీ కలుపుకొని నిర్వహించాలని…BRS పార్టీ ఆదేశాలు జారీ చేసింది. ఆత్మీయ సమ్మేళనాల సమన్వయం కోసం జిల్లాలకు ఇన్‌చార్జ్‌లను నియమించింది హైకమాండ్‌. అయితే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని పలు నియోజవర్గాల్లో… పార్టీ నేతల మధ్య అంతర్గత విభేదాలు ఉన్నట్లు గులాబీ పార్టీలో గుసగుసలు మొదలు అయ్యాయి. తాజాగా జూబ్లీహిల్స్‌ నియోజవర్గ ఆత్మీయ సమ్మేళనాల్లో…నేతలను కలుపుకుని పోవడం లేదన్న విషయం…పార్టీ ముఖ్యుల దృష్టికి పడిందట.

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో అత్మీయ సమ్మేళనాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇటు జూబ్లీహిల్స్ అసెంబ్లీ సెగ్మెంట్‌లో ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, కార్పొరేటర్ బాబా ఫసియుద్దీన్ మధ్య గ్యాప్ ఉందట. ఎవరికి వారు మా వైపు నుంచి ఎలాంటి తప్పు లేదు అన్న వాదనను అధిష్టానం ముందు వినిపిస్తున్నారట. గతంలో ఇదే నియోజకవర్గానికి చెందిన రావుల శ్రీధర్‌రెడ్డి…గులాబీ పార్టీలోకి వచ్చారు. ఆ తరువాత పార్టీ ఆయనకు రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ చైర్మన్ పదవి కట్టబెట్టింది. అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతుండడంతో జూబ్లీహిల్స్ నియోజకవర్గంపై ఆశలు పెట్టుకున్నారట. అయితే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో జరుగుతున్న ఆత్మీయ సమ్మేళనాలకు…తనకు ఆహ్వానం అందడం లేదని పార్టీ బాధ్యుల దృష్టికి తీసుకెళ్లారట. అసలు పార్టీ చెప్పిన విధంగా జూబ్లీహిల్స్ సెగ్మెంట్‌లో ఆత్మీయ సమావేశాలు జరగడం లేదని ఇన్‌చార్జ్‌కి ఫిర్యాదు చేశారట రావుల శ్రీధర్ రెడ్డి.

జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో తాజా పరిణామాలపై గులాబీ పార్టీ బాధ్యులు నజర్ పెట్టినట్టు సమాచారం. మరి అసెంబ్లీ ఎన్నికల కంటే ముందే జూబ్లీ హిల్స్ BRSలో అంతా సెట్ రైట్ అవుతుందా లేదా చూడాల్సి ఉంటుంది.

Exit mobile version