Off The Record: పదవుల ప్రకటన ఇంకెప్పుడు..? జనసేనలో ఆశావహుల అసంతృప్తి

  • గ్రామం నుంచి జిల్లా వరకు కమిటీలు ఏర్పాటు చేస్తామన్న జనసేన..
  • పదవుల ప్రకటన వాయిదా పడుతుండటంతో ఆశావహుల్లో అసహనం..
  • ఆగస్ట్‌ 15లోగా కమిటీలు ప్రకటిస్తామన్న పవన్ కళ్యాణ్‌..
  • పవన్‌ అనారోగ్య సమస్యలతోనే ప్రక్రియ ఆలస్యం..?..
  • అధికారంలోకి వచ్చాక గుర్తింపు దక్కలేదన్న భావనలో జనసేన కేడర్‌..
Otr Janasena

Otr Janasena

Off The Record: కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జనసేన పార్టీ సంస్థాగతంగా బలోపేతం కావాల్సిన అవసరం ఉందని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పార్టీ శ్రేణులు చాలాకాలంగా కోరుతున్నాయి. గ్రామం నుంచి జిల్లా స్థాయి వరకు కమిటీలను ఏర్పాటు చేస్తామని పార్టీ అధిష్టానం పలుమార్లు ప్రకటించింది. నిర్మాణ సారథుల ద్వారా అభ్యర్థుల వివరాలు సేకరించి… దరఖాస్తులు స్వీకరించి.. పరిశీలన కూడా పూర్తిచేసినట్లు సమాచారం. అయితే పదవుల ప్రకటన మాత్రం పదేపదే వాయిదా పడుతుండటంతో ఆశావహుల్లో అసహనం పెరుగుతోందట. ఆగస్టు 15లోగా కమిటీలు ప్రకటిస్తామని స్వయంగా పవన్ కళ్యాణ్ చెప్పారు. ఆ గడువు ముగిసినా ఎలాంటి నిర్ణయం వెలువడకపోవడం పార్టీ కార్యకర్తలను నిరాశకు గురిచేస్తోందట. పవన్ అనారోగ్య సమస్యలతోనే ప్రక్రియ ఆలస్యమవుతోందని పార్టీ వర్గాలు చెబుతున్నా… క్షేత్రస్థాయిలో మాత్రం చర్చ మరోరకంగా నడుస్తోందట. కమిటీల భర్తీలో అంతర్గత సమీకరణాలు, సామాజిక సమతుల్యత, ప్రాంతీయ ప్రాతినిధ్యం లాంటి అంశాలపై నిర్ణయం తీసుకోలేకపోతున్నారనే మాట వినిపిస్తోందట.

జనసేన కార్యకర్తల్లో మరో అసంతృప్తి కూడా కనిపిస్తోందట. సార్వత్రిక ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయానికి తాము తీవ్రంగా శ్రమించినప్పటికీ… అధికారంలోకి వచ్చాక తమకు గుర్తింపు దక్కలేదనే భావనలో ఉన్నారని చెబుతున్నారు. నామినేటెడ్ పదవుల్లోనూ ఎక్కువ ప్రాధాన్యం టీడీపీ నాయకులకే దక్కిందనే భావన జనసైనికుల్లో ఉందట. జనసేన ఎమ్మెల్యేలున్న నియోజకవర్గాల్లో తప్ప ఇతర చోట్ల అవకాశాలు లభించలేదని పార్టీ నాయకులే ఆఫ్ ది రికార్డ్‌ చెబుతున్నారట. ఇలాంటి సమయంలో కనీసం పార్టీ పదవులైనా దక్కుతాయని భావించిన నాయకులు ఇంకా ఎదురుచూపుల్లోనే ఉన్నారట. పార్టీ కోసం ఏళ్లుగా పనిచేస్తున్నవారికి ప్రాధాన్యం ఇస్తారా..? లేదంటే ఎన్నికల సమయంలో చేరినవారికే అవకాశం కల్పిస్తారా..? అనే చర్చ కూడా జరుగుతోందని సమాచారం. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల్లో పోటీ చేయాలంటే ముందుగా పార్టీ బలోపేతం కావాలి. గ్రామ, వార్డు, మండల స్థాయిలో కమిటీలు లేకుండా ఎన్నికల్లో పనిచేయడం కష్టమని భావిస్తున్నారు.

అందుకే పదవుల భర్తీ ప్రక్రియను మరింత ఆలస్యం చేయకూడదన్న ఒత్తిడి అధిష్టానంపై పెరుగుతోందట. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో జిల్లా అధ్యక్షుల ఎంపిక వ్యవహారం ఆసక్తికరంగా మారిందట. తూర్పుగోదావరి జిల్లా అధ్యక్ష పదవికి రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ పేరు ప్రధానంగా వినిపిస్తోందట. మంత్రి కందుల దుర్గేష్ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న నేపథ్యంలో.. సంస్థాగత బాధ్యతలు బలరామకృష్ణకు అప్పగించే అవకాశాలున్నాయనే చర్చ జరుగుతోంది. కాకినాడ జిల్లా అధ్యక్ష రేసులో పెండెం దొరబాబు పేరు ముందంజలో ఉన్నట్లు తెలుస్తోంది. కోనసీమ జిల్లాలో కొత్తపేట నియోజకవర్గానికి చెందిన బండారు శ్రీనివాసరావు పేరు బలంగా వినిపిస్తోంది. ఊహాగానాలు ఎలా ఉన్నా పదవులను త్వరగా భర్తీ చేయాలని జనసేన వర్గాలు కోరుతున్నాయట. పదవుల భర్తీపై అధిష్టానం త్వరగా నిర్ణయం తీసుకోకపోతే ప్రతికూల సంకేతాలు వెళ్లే అవకాశం ఉందన్న భయం జనసేన కేడర్‌లో కనిపిస్తోందట.