Site icon NTV Telugu

Off The Record: ఐ ప్యాక్‌, వాలంటీర్స్‌ అంటేనే ఆ పార్టీ నేతలకు మంట..!

Otr Ycp

Otr Ycp

Off The Record: ఐప్యాక్, వాలంటీర్స్…. వైసీపీ ప్రభుత్వ హయాంలో బాగా పాపులర్‌ అయిన, నిత్యం వినిపించిన మాటలివి. కానీ…. ఇప్పుడా రెండు మాటలు వినపడితేనే…. పార్టీలోని చాలామంది సీనియర్‌ నాయకులకు సర్రున మండిపోతోందట. మళ్ళీ ఎందుకురా… నాయనా వాళ్ల గురించి. ఇకనన్నా పక్కన పెట్టండి అంటూ ఫైరైపోతున్నట్టు సమాచారం. ఒకవేళ ఈసారి అధికారంలోకి వచ్చినా… మళ్లీ వాళ్ళ ప్రస్తావన రాకుండా ముందు నుంచే చెక్‌ పెట్టాలనుకుంటున్నట్టు సమాచారం. వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు సంక్షేమ పథకాల అమలులో వాలంటీర్స్ కీలకంగా వుంటే…. పార్టీ నిర్వహణ, సలహాల పరంగా ఐ ప్యాక్ కీ రోల్‌ పోషించింది. పార్టీ నేతల పనితీరును ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ… ఐప్యాక్ ఇచ్చే నివేదికలు కీలకంగా మారేవి. కానీ… ఈ రెండు వ్యవస్థలంటేనే అప్పట్లో చాలామంది వైసీపీ నాయకులకు, ప్రత్యేకించి సీనియర్స్‌కు అస్సలు పడేది కాదు. కానీ… నాడు అధికారంలో ఉండటంతో… ఎవ్వరూ నోరు మెదపలేకపోయారట. సంక్షేమ పథకాల విషయంలో అసలు ఎమ్మెల్యే కంటే వాలంటీరే పవర్ ఫుల్ అని చెప్పుకునేవారు.

ఎమ్మెల్యే అయినా సరే… ఫలానా వ్యక్తికి ఓ పథకం అందించాలంటే… వాలంటీర్‌కే చెప్పాలన్నట్టు ఉండేది పరిస్థితి. ప్రజలు ఎన్నుకున్నది మమ్మల్నా లేక వాలంటీర్స్‌నా అంటూ అప్పట్లో కొందరు ఎమ్మెల్యేలు అసహనంగా ఉండేవారట. మేం చెబితే పనులు అవుతాయనే పరిస్థితి లేదని కూడా కొందరు సన్నిహితులతో వాపోయినట్టు ఇప్పటికీ చెప్పుకుంటారు. సంక్షేమ పథకాలు అందుకున్న లబ్ధిదారులు కూడా ఎవరు ఇచ్చారంటే… ఫలానా వాలంటీర్ ఇచ్చాడంటూ ముఖ్య నేతలకే చెప్పిన సందర్భాలు కోకొల్లలు. అలాగే… గత ఎన్నికల్లో ఓటమికి వాలంటీర్ వ్యవస్థ కూడా ఒక ప్రధాన కారణం అని నమ్ముతారు వైసీపీ నాయకులు. ఇక వైసీపీలో ఐప్యాక్ ప్రతినిధులకు ఉన్న ప్రాధాన్యత మంత్రులకు కూడా ఉండేది కాదట. దాంతో… ఆ ప్రైవేట్‌ సంస్థ సిబ్బందిని ప్రసన్నం చేసుకోడానికి వైసీపీలోని పెద్ద పెద్ద తలకాయలే పోటీపడేవని చెప్పుకుంటారు. పార్టీ సమావేశాల నిర్వహణ, ఆ మీటింగ్స్‌లో ఎవరు, ఏం మట్లాడాలి లాంటి అంశాలన్నిటినీ… ఐ ప్యాక్ సిబ్బందే డిసైడ్‌ చేసేవారట. దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్న నాయకులు చెప్పే విషయాలు, సలహాల కంటే ఐప్యాక్ స్టాఫ్‌ ఇచ్చే సలహాలు, సూచనలకే ప్రాధాన్యత ఉండేదంటున్నారు. వాస్తవాలు, అవాస్తవాలన్నదాంతో సంబంధం లేకుండా… ఐ ప్యాక్ నుంచి రిపోర్ట్‌ వచ్చిందంటే చాలు… అదే వేదం అన్నట్టుగా ఉండేది పరిస్థితి. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటి వాటన్నిటినీ పంటి బిగువన భరించిన సీనియర్‌ లీడర్స్‌ చాలా మంది ఇప్పుడు మెల్లిగా ఓపెన్ అవుతున్నారట. ఆ రెండు వ్యవస్థల్ని ఈసారి పార్టీ దరిదాపులకు కూడా రానివ్వవద్దంటూ ఇప్పట్నుంచే స్వరం పెంచాలనుకుంటున్నట్టు తెలుస్తోంది.

ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఇప్పటికే ఆ వాయిస్‌ రెయిజ్‌ అయిపోయింది. జిల్లాలోని వైసీపీ సీనియర్‌ లీడర్స్‌, ఆరేడు సార్లు ఎమ్మెల్యేలుగా ఎన్నికైన నాయకులైతే…. ఈ విషయాన్ని బహిరంగంగానే చెప్పేస్తున్నారు. దీనికి సంబంధించి నంద్యాల వైసీపీ సమావేశంలో జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఇకపై వాలంటీర్ వ్యవస్థ, ఐప్యాక్ సర్వేల్ని అంగీకరించబోమని కరాఖండీగా చెప్పేశారట ఆయన. కష్టపడి పనిచేసే కార్యకర్తలకు, నాయకులకు మంచి గుర్తింపు ఉంటుందన్నారు కాటసాని. మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి కాటసానికంటే ముందుగానే దీనిపై గొంతెత్తారు. వాలంటరీ వ్యవస్థ మా కొంప ముంచిందన్నారాయన. ఆ సిస్టం వల్లే ప్రజలకు మాకు గ్యాప్ పెరిగిందన్నారు ఎమ్మెల్యే. వాలంటరీ వ్యవస్థను నమ్ముకొని తాము ప్రజలకు న్యాయం చేయలేక పోయామన్నది బాలనాగిరెడ్డి వెర్షన్‌. మళ్లీ మా ప్రభుత్వం వస్తే వాలంటీర్స్‌ను తీసుకునే ప్రసక్తే లేదన్నారాయన. నాయకులంతా ఇంత క్లారిటీగా మాట్లాడుతున్నారంటే… మెల్లిగా పార్టీలో ఈ నినాదం ఊపందుకుంటుందన్న అభిప్రాయం బలపడుతోంది. వాళ్ళ సంగతి సరే… ఈ విషయంలో అధిష్టానం వైఖరి ఎలా ఉందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Exit mobile version