Off The Record : గళ్లా మాధవి…. గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే. 2024 ఎన్నికల్లో అనుహ్యంగా టీడీపీ టిక్కెట్ దక్కించుకుని ఎమ్మెల్యేగా గెలిచారామె. ఫస్ట్ అటెంప్ట్‌లోనే ఎమ్మెల్యే అవడంతో…. లక్కీ అనుకున్నారు అంతా. కానీ.. టైం గడుస్తున్న కొద్దీ సీన్ రివర్స్‌లో ఉందన్న మాటలు బలంగా వినిపిస్తున్నాయి. అందుకు తగ్గట్టే ఇటీవల ముఖ్యమంత్రి ప్రకటించిన ర్యాంకింగ్స్‌లో లాస్ట్ ప్లేస్ రావడంతో… శాసనసభ్యురాలి తీరు మరోసారి చర్చనీయాంశం అవుతోంది. ఎమ్మెల్యేగా గెలిచినప్పటినుంచి గళ్ళా మాధవిచుట్టూ వివాదాలే పెరుగుతున్నాయి. సొంత పార్టీ నేతలతోనే ఆమెకు విబేధాలు ఉన్నాయంటున్నారు. ఎన్నికలకు ముందు గుంటూరు పశ్చిమ నియోజవకర్గం ఇన్ఛార్జ్‌గా కోవెలమూడి రవీంద్ర కొనసాగారు. కానీ… టిక్కెట్ దక్కించుకుని తాను గెలిచాక పట్టు బిగించే క్రమంలో ఎమ్మెల్యే తీసుకున్న కొన్ని నిర్ణయాలు ఇద్దరి మధ్య అగాధం సృష్టించాయి. గుంటూరు మేయర్‌గా ఉన్న రవీంద్ర అనుచరులను పార్టీ పదవులనుంచి తొలగించి తన వర్గానికి మాత్రమే దక్కేలా గళ్ళా మాధవి పావులు కదిపారన్న కారణంతో రెండు వర్గాల మధ్య విభేదాలు తారా స్థాయికి చేరాయి. అటు గుంటూరు ఎన్టీఆర్ స్టేడియం పాలకమండలి ఎన్నికల విషయంలో కూడా సొంత పార్టీ ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్‌తో ఎమ్మెల్యేకున్న విబేధాలు రచ్చకెక్కాయి.
ఇక పశ్చిమ నియోజకవర్గంలో అభివృద్ధి పనుల విషయమై ఎమ్మెల్యే మాధవి, కార్పొరేషన్ అధికారుల మధ్య కూడా తీవ్ర విభేదాలు ఉన్నాయట. ఇలా… వరుస వివాదాలు వెంటాడుతున్న టైంలో…. అంబటి రాంబాబు ఎపిసోడ్ తెర మీదికి వచ్చింది. సీఎం చంద్రబాబునుద్దేశించి మాజీ మంత్రి చేసిన అనుచిత వ్యాఖ్యలపై గట్టిగా రియాక్ట్ అయ్యారు గళ్ళా మాధవి. తన అనుచరులతో కలిసి అంబటి ఇంటి దగ్గరికి వచ్చారు. ఇక అదే సమయంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు మాజీ మంత్రి ఇంటిని ధ్వంసం చేశారు. దీంతో గళ్లా మాధవికి ఒక్కసారిగా టీడీపీలో హైప్ వచ్చింది. ఆ టైంలో పార్టీ మొత్తం ఆమె గురించే మాట్లాడుకుంది. తమ నాయకుడి కోసం మహిళా ఎమ్మెల్యే స్పందించిన తీరును టీడీపీ వర్గాలు మెచ్చుకున్నాయి కూడా. అదే సమయంలో…. అంబటి కామెంట్స్‌ను ఎమ్మెల్యే మాధవి తెలివిగా ఉపయోగించుకుని అధినేత దగ్గర మంచి మార్కులే కొట్టేశారంటూ కొందరు మాట్లాడుకున్నారు కూడా. మొత్తం మీద అనుకోకుండా వచ్చిన అవకాశాన్ని మాధవి చక్కగా ఉపయోగించుకున్నారని అనుకున్నారు. అంబటి దెబ్బకు… టీడీపీ అధిష్టానం దృష్టిలో మాధవి మీద ఉన్న నెగిటివిటీ మొత్తం కొట్టుకుపోయి పాజిటివ్ ఇమేజ్ వచ్చిందన్న చర్చ సైతం జరిగింది. అక్కడ సీన్ కట్ చేస్తే…. రెండు రోజుల్లో మొత్తం తారుమారైపోయింది.
సీఎం చంద్రబాబు ఎమ్మెల్యేలకు ప్రకటించిన ర్యాంకింగ్స్‌లో గళ్ళా ప్లేస్ గురించిన చర్చలు మొదలయ్యాయి. ఈ ర్యాంకుల్లో ఏ ప్లస్, ఏ క్యాటగిరీలున్నాయి. ఏ ప్లస్‌లో 21మంది ఎమ్మెల్యేలుంటే ఏ క్యాటగిరీలో 153 మంది శాసనసభ్యులు ఉన్నారు. అవన్నీ పోను బీ కేటగిరీలో ఒకే ఒక్క ఎమ్మెల్యే ఉన్నారు. ఆమే గళ్లా మాధవి. అంటే…. పనితీరులో గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యేకి రాష్ట్రం మొత్తం మీద లాస్ట్ ర్యాంక్ వచ్చిందన్న మాట. అంబటి ఎపిసోడ్‌తో అధినేత దగ్గర మంచి మార్కులు పడ్డాయన్న ఆనందం కొన్నాళ్ళు కూడా లేకుండా ర్యాంకుల రూపంలో ఆవిరైపోయిందని మాట్లాడుకుంటున్నాయి రాజకీయవర్గాలు. స్వయంగా సీఎం చంద్రబాబు ఇచ్చిన ర్యాంక్స్‌లోనే తమ నాయకురాలు చివరి స్థానంలో ఉండటంతో ఎమ్మెల్యే వర్గం డీలా పడ్డట్టు చెప్పుకుంటున్నారు. ఎప్పుడూ ఏదో ఒక వివాదం చుట్టుముడుతుంటే గళ్లా మాధవి… ఎమ్మెల్యేగా తన పనితీరును మెరుగుపరుచుకుంటేనే…. ఆమెకు రాజకీయ భవిష్యత్ ఉంటుందన్న మాటలు గట్టిగా వినిపిస్తున్నాయి గుంటూరు పొలిటికల్ సర్కిల్స్‌లో.
