Off The Record: ఈయన మేకపాటి రాజమోహన్ రెడ్డి. వైసీపీ మాజీ ఎంపీ. సీనియర్ మోస్ట్ నాయకుడు. మాజీ మంత్రి మేకపాటి గౌతం రెడ్డి తండ్రి. కొడుకు జయంతి సభలో రాజమోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. జగన్ సీఎంగా ఉండగా వైసీపీలో ఓ బ్యాచ్ ఎప్పుడూ ఆయన్ను విపరీతంగా పొగిడేస్తూ ఉండే వారు. జగన్ ఎవర్నైతే ప్రత్యర్ధి అనుకుంటారో ఈ బ్యాచ్ నేతలు టార్గెట్ చేసుకుని నోటికొచ్చింది మాట్లాడేవారు. ఈ బ్యాచ్ లో మంత్రులు, ఎమ్మెల్యేలూ, ఎంపీలూ ఉండే వారు. ఇదంతా జగన్ అంటే వారికి ఉన్న ప్రేమాభిమానలతో జరిగేదని అనుకోవాలని వారి ఉద్దేశం. కానీ.. ఇదంతా జగన్ భజన అని… జగన్ ప్రాపకం కోసం, పదవుల కోసం.. తెచ్చిపెట్టుకున్న వ్యవహారంగా తేల్చేశారు మేకపాటి. వాస్తవంగా మేకపాటిలాంటి అభిప్రాయమే పార్టీలో చాలా మంది సీనియర్లలో ఉంది. కొంత మంది సైకో ఫ్యాన్స్ తమ పదవుల కోసం జగన్ భజన చేసేవారట. ఆ భజన కాస్తా అదుపు తప్పి.. పరిధి దాటి…ఎటెటో పోయి…నోటికొచ్చినట్టు మాట్లాడే వరకు వెళ్లిపోయింది. ఇది పార్టీకి, జగన్ కు కూడా ఓ దశలో తలనొప్పిగా మారింది.
Read Also: Theft: యువకుడిని పొద్దంతా చెట్టుకు తలక్రిందులుగా వేలాడదీసి.. కారణం అదే!
మంత్రులైన వాళ్లు తమ పదవుల్ని కాపాడుకోడానికి, ఎమ్మెల్యేలుగా ఉన్న వాళ్లు మంత్రులు కావడానికి ఇలా నోటికి ఏదొస్తే అది మాట్లాడి ప్రత్యర్ధులను టార్గెట్ చేసి…లేని పోని సమస్యలకు కారణం అయ్యారనేది సీనియర్ల అభిప్రాయం. దేశంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా 3లక్షల కోట్ల రూపాయల నగదు నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో వేశారు జగన్. మరో రెండు, రెండున్నర లక్షల కోట్లతో ఇళ్లు, ఇళ్లస్థలాలు వంటి పథకాలు అమలు చేశారు. ఇవన్నీ చూసిన వైసీపీ నేతలు జగన్ కు తిరుగేలేదని వై నాట్ 175 అనే వరకు వెళ్లారు. అంటే 2024 ఎన్నికల్లో రాష్ట్రంలో ఉన్న 175 అసెంబ్లీ సీట్లనే జగనే గెలుస్తారనే ప్రచారం చేసేశారు. కట్ చేస్తే… 11 సీట్లకే పరిమితం కావాల్సిన ఘోర ఓటమిని మూటకట్టుకుంది వైసీపీ.
సంక్షేమ పథకాల మీదే ఎన్నికలు జరిగి ఉంటే వాటి చుట్టే జనంలో చర్చ జరిగేది. అదే ఎన్నికల అజెండా అయ్యి ఉండేది. కానీ వ్యవహారం కాస్తా శాపనార్ధాలు, తొడగొట్టుడు… నోటికొచ్చిన తిట్లు, స్థాయిలేని వ్యాఖ్యలతో రోజూ పతాక శీర్షికల్లో ఉండేలా జగన్ భక్త మేథావులు చేశారని మేకపాటి వంటి వారు వాపోతున్నారట. విమర్శలు చెయ్యోచ్చు కానీ…. జగన్ మెచ్చుకుంటాడని ఏదంటే అది మాట్లాడి ఆయనకే నష్టం చేశారని…అలాంటి బ్యాచ్ ను ఇకనైనా దూరం పెడితే మంచిదంటున్నారట. ఈ భజన బృందం వల్లే జగన్ నష్టపోయారని… ఆయన మెచ్చుకుంటాడని, మెడల్స్ ఇస్తాడని నోటికొచ్చి మాట్లాడిన వాళ్లే ఇప్పుడు కష్టాలు కొని తెచ్చుకున్నారని తేల్చేస్తున్నారు నేతలు. జగన్ చుట్టూ ఇలాంటి బ్యాచ్ చేరి ఆయనకు నష్టం చేసిందని… ఆయనకు ఇష్టం ఉన్నా లేకున్నా నిజాయితీగా, నిస్పక్షపాతంగా తప్పొప్పులు చెప్పే మేధావులు ఉన్నారని….వాళ్లకు జగన్ అవకాశం ఇవ్వాలని కూడా సీనియర్లు కోరుకుంటున్నారట. భజనపరుల వల్ల నష్టం తప్ప లాభం లేదన్నది వైసీపీ నేతల సూత్రీకరణ.
