NTV Telugu Site icon

Off The Record: అంతా ఒక గూటి పక్షులు.. కానీ ఎవరి దారి వారిదే.. వివాదాస్పదంగా పశ్చిమ వైసీపీ నేతల తీరు..!

Ycp

Ycp

Off The Record: చెరుకువాడ శ్రీరంగనాధరాజు.. 2019ఎన్నికల్లో ఆచంట ఎమ్మెల్యేగా గెలిచి జగన్‌ తొలి కేబినెట్‌లో మంత్రి అయ్యారు. తర్వాత విస్తరణలో పదవి కోల్పోయి ఇప్పుడు పార్టీ పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయనతో ఇతర నియోజకవర్గాల నేతలు వ్యవహరిస్తున్న తీరే ఇప్పుడు హాట్‌ టాపిక్‌ అయింది. జిల్లా పార్టీ అధ్యక్షుడు అయినా… మిగతా చోట్ల ఆయనకు దక్కుతున్న ప్రాధాన్యం అంతంతమాత్రమేనట. అది అధికారిక కార్యక్రమం అయినా.., పార్టీ ప్రోగ్రామ్‌ అయినా …ఆయనుంటే మిగతా నేతలు, మంత్రులు కనిపించరు.. మిగతా వాళ్ళుండే మీటింగుల్లో ఈయన ఉండదన్నది ఓపెన్ సీక్రెట్.

జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఇద్దరు మంత్రులు కొట్టు సత్యనారాయణ, కారుమూరి నాగేశ్వరరావుతో కలిసి చెరుకువాడ వేదిక పంచుకున్న దాఖలాలు ఇప్పటిదాకా లేవు. అంతా అధికారపార్టీ నేతలే అయినా లెక్కల్లో మాత్రం తేడాలు పలుకుతున్నాయి. రంగనాధరాజుకు మంత్రి పదవి పీకేసి, మిగతా ఇద్దరికీ ఇచ్చినప్పటి నుంచి కోల్డ్‌ వార్‌ మొదలైందట. అధికారిక కార్యక్రమాల విషయం పక్కనబెడితే జిల్లాస్థాయిలో నిర్వహించే పార్టీ మీటింగుల్లో సైతం వీరంతా కలసి వేదిక పంచుకున్న దాఖలాలు ఎక్కడా కనిపించడం లేదు. వీళ్ళు మాత్రమేకాదు.. నర్సాపురంలో చీఫ్‌ విప్ ముదునూరి ప్రసాదరాజు, భీమవరంలో గ్రంధి శ్రీనివాస్, ఉండి ఇంఛార్జ్‌ పీవీఎల్‌తో కూడా అధ్యక్షుడికి గ్యాప్‌ ఉందట. 2004లో అత్తిలి నుంచి రంగనాధరాజు, తాడేపల్లిగూడెం నుంచి కొట్టు సత్యనారాయణ ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. అదేసమయంలో తణుకు నుంచి కారుమూరి టిక్కెట్ ఆశించినా అవకాశం రాకపోవడంతో జెడ్పి చైర్మెన్‌గా ఎన్నికయ్యారు. అదే సమయంలో భీమవరం నుంచి గ్రంధి శ్రీనివాస్ సైతం ఎమ్మెల్యే అయ్యారు. అంటే అంతా ఒకగూటిపక్షులే అయినా … ఎవరిదారి వారిదే అన్నట్టుంది ఇపుడు పశ్చిమలో పరిస్థితి. రంగనాధరాజు నియంతృత్వ ధోరణే ఆయన్ని మంత్రి పదవికి దూరం చేసిందని, పదవి పోయినా ఇంకా అందరి మీద అజమాయిషీ చెలాయించాలని చూస్తుంటారని చెప్పుకుంటున్నారు స్థానిక నాయకులు. ఇది నచ్చని నేతలు ఆయనకి ఎంత దూరంగా ఉంటే అంతమంచిదని ఫిక్సయ్యారట. అందుకే మాజీ అయ్యాక కూడా సాన్నిహిత్యం కోరుకోవడంలేదట ఎవ్వరూ.

20ఏళ్ళకు పైగా రంగనాధరాజు ఉమ్మడి పశ్చిమ గోదావరిజిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్నారు. అప్పటి నుంచి ఆయనకు, ఇతర ఎమ్మెల్యేలకు ఉన్నవిభేదాలే ఇప్పటికీ కొనసాగుతున్నాయన్నది పార్టీ వర్గాల టాక్‌. జిల్లాలో పార్టీని బలోపేతం చేయాల్సిన నాయకుడు ఒంటెద్దు పోకడగా వ్యవహరించడంతో మిగతా వాళ్ళు ఎవరూ ఆయనతో కలసి పనిచేసేందుకు సుముఖంగా లేరట. దీంతో అధికార పార్టీకి వ్యతిరేకంగా టిడిపి ఎమ్మెల్యేలు నిమ్మల రామానాయుడు,రామరాజు వరుస కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. విపక్ష ఎమ్మెల్యేలను ఎదుర్కోవడంలో జిల్లా పార్టీ అధ్యక్షుడు పూర్తిగా విఫలమయ్యారని అంటున్నాయి స్థానిక పార్టీ వర్గాలు. వైసీపీ నేతల మధ్య విభేదాలు టీడీపీ పుంజుకోవడానికి బాగా ఉపయోగపడుతున్నాయన్నది లోకల్‌ టాక్‌. అధినాయకత్వం ఇప్పటికైనా ఈ గోల మీద దృష్టి పెట్టకుంటే…ఎన్నికల నాటికి డ్యామేజ్‌ తప్పదని అంటున్నాయి వైసీపీ వర్గాలు.

Show comments