Site icon NTV Telugu

Off The Record: తెలంగాణ కాంగ్రెస్ ఎన్నికల కమిటీపై అప్పుడే అలకలు

T Cong

T Cong

Off The Record: అసెంబ్లీ ఎలక్షన్స్‌ కోసమంటూ… ఎన్నికల కమిటీ వేసింది తెలంగాణ కాంగ్రెస్‌. 26 మందికి అందులో అవకాశం ఇచ్చినా.. ఇంకా కొందరు నాయకులు మిగిలిపోయారు. అదే ఇప్పుడు సమస్యగా మారి పార్టీలో అలకలకు దారితీస్తోందట. అసలు ఏ ప్రాతిపదికన ఆ ఎంపికలు జరిగాయన్న చర్చ గాంధీభవన్‌లో తీవ్ర స్థాయిలోనే జరుగుతున్నట్టు తెలిసింది. ఎన్నికల కమిటీలో ఏఐసీసీ కార్యదర్శులు, పీసీసీ మాజీ చీఫ్‌లు, సీఎల్పీలతో పాటు వర్కింగ్ ప్రెసిడెంట్స్‌, మాజీ కేంద్ర మంత్రులకు చోటు కల్పించారని చెబుతున్నారు. అయితే…. ఆ కేటగిరీల్లో ఉండి కూడా…అవకాశం రాని నేతలు గరం గరంగా ఉన్నారట. ఒక ఏఐసీసీ కార్యదర్శి, ఇద్దరు మాజీ వర్కింగ్‌ ప్రెసిడెంట్స్‌ ఈ విషయంలో తీవ్ర అసంతృప్తిగా ఉన్నట్టు సమాచారం.

మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ పార్టీలో యాక్టివ్‌గా ఉన్నారు. కానీ…వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి పోయాక ఆయనకి ఇప్పటివరకు ఏ అవకాశం ఇవ్వలేదు. ఎన్ఎస్ యుఐ నుంచి పనిచేసిన తనకు ఇప్పుడు ఎన్నికల కమిటీలో చోటివ్వకపోవడంపై తీవ్ర అసహనంగా ఉన్నారట పొన్నం. అవకాశం వచ్చినప్పుడు పార్టీ వేదికపైనే తన అసంతృప్తిని వెళ్లగక్కే ఆలోచనలో ఉన్నట్టు తెలిసింది. పదవులు ఉన్న వారికే ప్రాధాన్యత ఇచ్చి.. పార్టీ కోసం పనిచేసిన వారిని పక్కన పెట్టాలన్న నిర్ణయం ఏమన్నా తీసుకున్నారా? అని సన్నిహితుల దగ్గర అంటున్నారట మాజీ ఎంపీ. తన సామాజిక వర్గం వారికి ఇద్దరికి అవకాశం ఇచ్చామన్న కారణం చూపుతూ తనని పక్కన పెట్టడం సరికాదన్నది ఆయన వాదన అట. అధినాయకత్వం కూడా దాన్నే కారణంగా చూపిస్తే… రాజకీయంగా తనకు అన్యాయం చేసినవారవుతారని ఆవేదన వ్యక్తం చేస్తున్న పొన్నం… టైం చూసి తన అసంతృప్తిని ముఖ్యమైన వేదిక మీదే బయటపెట్టాలనుకుంటున్నట్టు సమాచారం. మరోవైపు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి సన్నిహితుడు గా పేరున్న చిన్నారెడ్డికి కూడా ఎన్నికల కమిటీలో చోటు దక్కలేదు. ఏఐసీసీ కార్యదర్శులకు ఇందులో స్థానం కల్పించి…. అదే పొజిషన్‌లో ఉన్న, సీనియర్‌ అయిన చిన్నారెడ్డిని విస్మరించడం ఏంటన్న చర్చ నడుస్తోంది. ఆయన కూడా అదను కోసం ఎదురు చూస్తున్నట్టు తెలిసింది.

మరో మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ కుసుమ కుమార్ కూడా ఎన్నికల కమిటీ నియామకంపై అసంతృప్తిగా ఉన్నారట. తనకు పార్టీలో అవకాశం కల్పించక పోవడంపై చాలా రోజులుగా అసంతృప్తితో ఉన్నారట ఆయన. తనని ఏఐసీసీలోకి తీసుకుంటారని లెక్కలు వేసుకున్నారాయన. కానీ చివరికి ఇందులో కూడా అవకాశం దక్కకపోవడంపై అసహనంగా ఉన్నారట. ఈ నియామకాల విషయంలో పార్టీలోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఎన్నికల దగ్గర పడుతున్న వేళ అందరూ అవకాశాల కోసం ప్రయత్నిస్తుంటారని, అలాంటి వారిని కలుపుకుని వెళ్తే…మంచిదన్న అభిప్రాయంతో ఉన్నారు సీనియర్స్‌. ఎన్నికలకు ముందు తలెత్తుతున్న ఇలాంటి అసమ్మతులు, అసంతృప్తులను డీల్‌ చేసే బాధ్యత పార్టీలో ఎవరు తీసుకుంటారో చూడాలి.

Exit mobile version