Off The Record: వరుస హత్యలు… ఆగని నేరాలు.. అడ్డూ అదుపూ లేకుండా… విచ్చలవిడిగా దొరుకుతున్న డ్రగ్స్. ఏకంగా హైదరాబాద్ సిటీ చుట్టు పక్కలే క్రైమ్ రేట్ పెరిగిపోతుంటే ఏం చేస్తున్నారు మీరంతా? లా అండ్ ఆర్డర్‌ని కంట్రోల్ చేయాలన్న సంగతి మర్చిపోయారా? జనం జీవితాలు, రాష్ట్ర ప్రభుత్వం, పోలీస్ డిపార్ట్‌మెంట్ పరువు మీ చేతుల్లో ఉన్నాయన్న సంగతి అసలు గుర్తుందా? లేక మళ్ళీ గుర్తు చేయమంటారా? తెలంగాణ కొత్త డీజీపీ జితేందర్ ఐపీఎస్ ఆఫీసర్స్‌కి సూటిగా, సుత్తిలేకుండా సంధించిన ప్రశ్నలట ఇవి. ఇటీవల రాష్ట్రంలో క్రైమ్ రేట్ విపరీతంగా పెరిగిపోతోంది. మరీ ముఖ్యంగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో వరుసబెట్టి హత్యలు జరుగుతున్నాయి. కొన్ని చోట్ల దాడులకు సైతం తెగబడుతున్నారు దుండగులు. ఇక సైబర్ నేరాలు, డ్రగ్స్ కేసుల సంగతైతే చెప్పేపనేలేదు. స్కూల్ పిల్లల దగ్గర నుంచి మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్ దాకా అందరికీ అందుబాటులో ఉంటున్నాయి మత్తు పదార్ధాలు. అసలు వీఐపీ సర్కిల్స్‌లో అయితే.. డ్రగ్స్ కల్చర్ భాగం అయిపోయిందన్న ఆరోపణలున్నాయి.
Read Also: Indian Hockey Team: భారత పురుషుల హాకీ జట్టుతో ఫోన్‌లో మాట్లాడిన ప్రధాని..
ఇలా విచ్చలవిడి వ్యవహారాలతో అసలు రాష్ట్రంలో పోలీసింగ్ ఉందా అన్న చర్చ సైతం మొదలైందట కొన్ని వర్గాల్లో. ఇలాంటి పరిస్థితుల్లో డీజీపీగా బాధ్యతలు తీసుకున్న జితేందర్…. తాజాగా జిల్లాల ఎస్పీలు, పోలీస్ కమిషనర్స్‌తో రివ్యూ మీటింగ్ పెట్టారట. ఆ మీటింగ్‌లో పిన్ టు పిన్.. పాయింట్ టు పాయింట్ అడుగుతూ… ఐపీఎస్‌లకు చెమటలు పట్టించినట్టు సమాచారం. రాష్ట్రంలో శాంతి భద్రతలు ఇంతలా అదుపు తప్పుతుంటే మీరంతా ఏం చేస్తున్నారు? కొత్త ప్రభుత్వంలో ఎందుకిలా జరుగుతోందంటూ… అందరికీ వరుసబెట్టి రేవెట్టేసినట్టు ప్రచారం జరుగుతోంది పోలీస్ వర్గాల్లో. మరీ ముఖ్యంగా ఇటీవలి కాలంలో లాం అండ్ ఆర్డర్ పూర్తిగా అదుపు తప్పుతోందన్న అభిప్రాయానికి వచ్చారట పోలీస్ పెద్దలు. అందుకే ఏ ఒక్కర్నీ స్పేర్ చేయకుండా సామూహిక తలంటు ప్రోగ్రామ్ పెట్టేసినట్టు చెప్పుకుంటున్నారు. ఇటీవల కింది స్థాయిలో జరుగుతున్న వరుస రివ్యూల్లో కూడా శాంతి భద్రతలు అదుపు తప్పడంపైనే డిపార్ట్‌మెంట్‌లో ఆందోళన వ్యక్తం అవుతున్నట్టు తెలిసింది. ఆ సంగతి తనదాకా రావడంతో… అగ్గిమీద గుగ్గిలం అయిపోయారట పోలీస్ బాస్. క్రైమ్ రేట్ పెరిగిపోతోందని కబుర్లు చెప్పుకుంటూ… కాళ్ళు చేతులు కట్టేసుకుని కూర్చుందామా? లేక కట్టడి చేసేందుకు కావాల్సిన కార్యాచరణ మీద దృష్టి పెడదామా అంటూ ఐపీఎస్‌లు అందర్నీ సూటిగానే పాయింట్ ఔట్ చేసినట్టు తెలుస్తోంది. నేరం చిన్నదైనా…, పెద్దదైనా, ఎవ్వరికీ ఎలాంటి మినహాయింపులు ఉండవని, తొక్కతీసి తోలు ఎండగట్టమని ఎస్పీలు, కమిషనర్స్‌ని ఆదేశించినట్టు సమాచారం.
Read Also: CM Chandrababu: సామాన్య కార్యకర్తలను మరువని చంద్రబాబు.. ప్రత్యేకంగా పిలిచి మరి..!
ఎక్కడైతే నేరాలు ఎక్కువగా ఉంటున్నాయో… ఆ ఏరియాల్లో విజిబుల్ పోలీసింగ్‌ని పెంచమని ఆదేశించారట. అలాగే పెరిగిపోతున్న సైబర్ నేరాలతో పాటు డ్రగ్స్ విషయంలో చిన్న ఛాన్స్ కూడా తీసుకోవద్దని, క్విక్ రియాక్షన్ ఉండాలని ఆదేశించినట్టు తెలిసింది. మీకు కావాల్సినన్ని వనరులు ఇచ్చాం, నిధులకు కొరత లేదు, వాహనాలు ఉన్నాయి…. అయినా నేరాలు మాత్రం పెరిగిపోయాయి. కంట్రోల్‌లోకి రావాలంటే… మీకు ఇంకేం కావాలి? ఏం చేస్తే యాక్టివ్ అవుతారంటూ డీజీపీ ఓ రేంజ్‌లో ఫైరైపోయినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి పోలీస్ వర్గాల్లో. మీటింగ్ మొదట్నుంచి చివరిదాకా…. క్రైమ్ రేట్ పెరిగిపోవడం మీదే హాట్ హాట్ చర్చ జరిగినట్టు తెలిసింది. కొన్ని ప్రాంతాల్లోనే వరుసగా హత్యలు జరిగాయని, అవి ఎందుకు జరిగాయో, ఆ సీక్వెన్స్ ఏంటో ఇప్పటికీ తేల్చలేకపోయారంటూ ఆఫీసర్స్‌ని నిలదీసినట్టు సమాచారం. రాత్రి పగలు అనే తేడా లేకుండా విజిబుల్ పోలీసింగ్, పెట్రోలింగ్‌ని పెంచాలని, ఒక్కసారి పరిస్థితి అదుపు తప్పితే.. తిరిగి మన కంట్రోల్‌లోకి తెచ్చుకోవడానికి కిందా మీదా పడాల్సి వస్తుందని అంటూ… ఒకింత ఘాటుగా, నాటుగా రియాక్ట్ అయినట్టు తెలుస్తోంది. అసాంఘిక శక్తులు తిరగబడితే… వాళ్ళ మీద చర్యల విషయంలో వెనకా ముందూ ఆలోచించవద్దని, భూ తగాదాలు, రియల్ ఎస్టేట్ గొడవలు, కబ్జాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని వార్నింగ్ ఇచ్చినట్టు సమాచారం. ఏదన్నా జరుగుతోందని సమాచారం వస్తే… మనకెందుకులే అన్న ధోరణి అస్సలు పనికిరాదని, పోలీస్ అధికారులు ఎవరైనా లాలూచీ వ్యవహారాలు నడిపితే… పనిష్మెంట్ మీరు ఊహించని రీతిలో ఉంటుందంటూ ఓ రేంజ్‌లో స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారట డీజీపీ. మొత్తం మీద ఆ మీటింగ్ తర్వాత రాష్ట్రంలో అదుపు తప్పుతున్న శాంతిభద్రతల విషయంలో కొత్త బాస్ చాలా సీరియస్‌గా ఉన్నారన్న అలర్ట్ మెస్సేజ్ వెళ్ళిందట పోలీస్ వర్గాలకు. దాని రిజల్ట్ ఎలా ఉంటుందో చూడాలి మరి.