Site icon NTV Telugu

Off The Record: భువనగిరి కాంగ్రెస్ లో గ్రూపుల గోల

Congress

Congress

Off The Record: భువనగిరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గడిచిన నాలుగు దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీకి ప్రాతినిధ్యంలేదు. కాంగ్రెస్‌ తరపున గెలిచి అసెంబ్లీలో అధ్యక్షా… అనేవారు లేకపోవడంతో ఈసారి ఎలాగైనా భువనగిరి కోట మీద మూడు రంగుల జెండా ఎగరేయాలని పట్టుదలగా ఉన్నారట స్థానిక నాయకులు. ఈ క్రమంలోనే డీసీసీ అధ్యక్షుడు కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఈసారి పోటీకి సిద్ధమవుతున్నారు. హాత్‌ సే హాత్‌ జోడో యాత్ర, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్రతో పాటు రీజినల్ రింగ్ రోడ్డు బాధితులు, రాయగిరి రైతుల పక్షాన పోరాటం, బస్వాపురం భూ నిర్వాసితుల తరుపున నిలబడటం లాంటి కార్యక్రమాలతో ఉనికి చాటుకునే ప్రయత్నాల్లో ఉన్నారాయన. లోకల్‌ కేడర్‌ మధ్య కూడా పెద్దగా విభేదాల్లేవన్న ప్రచారం ఇన్నాళ్ళు జరిగింది. కానీ… అసెంబ్లీ ఎన్నికల ముంగిట్లో సీన్‌ మారుతున్నట్టు కనిపిస్తోందంటున్నాయి పార్టీ వర్గాలు. గ్రూపు రాజకీయాలు పెరిగి రచ్చ మొదలైందని చెబుతున్నాయి స్థానిక పరిస్థితులు.

2018 ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ నేతలు కొందరు అనిల్ కుమార్ రెడ్డికి వ్యతిరేకంగా పనిచేశారట. ఇప్పుడు కూడా వాళ్ళే యాక్టివ్‌ అవుతున్నట్టు చెబుతున్నారు. నియోజకవర్గానికి చెందిన టీపీసీసీ సెక్రటరీ ప్రమోద్, మాజీ మున్సిపల్ చైర్మన్ జహంగీర్‌తో పాటు మరికొందరు గ్రూపుగా ఏర్పడి వేరుగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తాజాగా దశాబ్ది దగా కార్యక్రమాన్ని కూడా డీసీసీ అధ్యక్షుడితో కలిసి కాకుండా…భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఫ్లెక్సీతో మరోచోట నిర్వహించారు సదరు నాయకులు. అక్కడితో ఆగకుండా ఘట్ కేసర్‌లో రహస్యంగా సమావేశమైనట్టు తెలిసింది. భువనగిరి కాంగ్రెస్‌లో పెద్దగా విభేదాలు లేవనుకుంటున్న సమయంలో ఇలా గ్రూప్‌ రాజకీయాలు యాక్టివ్‌గా జరగడంపై కేడర్‌లో గందరగోళం పెరుగుతోందట. ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సూచనలతోనే గ్రూపుల గోల మొదలయిందని నియోజకవర్గ ముఖ్య నాయకులు బహిరంగంగానే మాట్లాడుకుంటున్నారు.

డీసీసీ అధ్యక్షుడికి వ్యతిరేకంగా కోమటిరెడ్డే ఓ వర్గాన్ని పోషిస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. బీఆర్‌ఎస్‌కు చెందిన సిట్టింగ్‌ ఎమ్మెల్యేపై అసంతృప్తి పెరగడం, రీజినల్‌ రింగ్‌ రోడ్డు భూ నిర్వాసితుల ఆక్రోశం వంటి పరిణామాలను సొమ్ము చేసుకుని పార్టీని పటిష్టం చేసుకోవాల్సిన సమయంలో ఇలా కొట్లాడుకుంటే… ఈసారి కూడా భువనగిరిని ప్రత్యర్థులకు వదిలేసుకోవడం తప్ప చేయగలిగేది ఏమీ ఉండదంటున్నారు ద్వితీయ శ్రేణి నాయకులు. ఇప్పుడిప్పుడే బలోపేతం అవుతున్నామని అనుకుంటున్న సమయంలో…ఈ గ్రూపుల గోల దారుణంగా దెబ్బతీస్తుందన్న ఆందోళన వారిలో కనిపిస్తోందట. పార్టీ అధినాయకత్వం వెంటనే జోక్యం చేసుకుని పరిస్థితిని చక్కదిద్దకుంటే… మరోసారి ఈ సీటు మీద ఆశలు వదిలేసుకోవాల్సిందేనన్నది లోకల్‌ కాంగ్రెస్‌ నాయకుల అభిప్రాయం. గాంధీభవన్‌ దీన్నెలా డీల్‌ చేస్తుందో చూడాలి.

Exit mobile version