NTV Telugu Site icon

Off The Record: రైతు రుణమాఫీపై సవాళ్ల పర్వం.. సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్.!

Otr Runamafi

Otr Runamafi

Off The Record: రైతు రుణమాఫీ సవాళ్ళ విషయంలో బీఆర్‌ఎస్‌ ఇరుకున పడిందా? ఏం చెప్పాలో అర్ధంగాక ఆ పార్టీ నేతలు రివర్స్‌ అటాక్‌ మొదలుపెట్టారా? హరీష్‌రావు రాజీనామా సవాల్‌పై జరుగుతున్న చర్చ ఏంటి? ఆ విషయంలో ప్రభుత్వ పెద్దలు చెబుతున్న దేంటి? వ్యవహారం మొత్తం తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతీ అన్నట్టుగా మారిపోయిందా?

తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల ప్రచారం ఎక్కువగా… రైతుబంధు, రుణమాఫీ అంశాల చుట్టూనే తిరిగింది. ఇచ్చిన మాట ప్రకారం ఆ తర్వాత అర్హులైన రైతుల ఖాతాల్లో జమ అయ్యాయి రైతు భరోసా డబ్బులు. ఆ వెంటనే ప్రతిపక్షం నుంచి సవాళ్ళ పర్వం మొదలైంది. రైతు రుణమాఫీపై ప్రభుత్వానికి సవాల్‌ విసిరారు మాజీ మంత్రి హరీష్ రావు. ఆగస్ట్‌ 15లోపు 2 లక్షల రుణమాఫీ చేస్తామంటూ పార్లమెంట్‌ ఎన్నికల ప్రచారంలో ప్రస్తావించారు సీఎం రేవంత్‌రెడ్డి. దానికి కౌంటర్‌గా సవాల్‌ చేశారు హరీష్‌రావు. చెప్పిన మాట ప్రకారం ముఖ్యమంత్రి ఆగస్టు 15లోపు రుణమాఫీ చేసి తీరాలని, ఇచ్చిన మాట నిలబెట్టుకుంటే తాను సిద్దిపేట ఎమ్మెల్యేగా రాజీనామా చేస్తానని అప్పట్లో అన్నారు మాజీ మంత్రి. ఆ సవాల్‌పై అప్పట్లోనే దుమారం రేగింది. హరీష్‌…. రాజీనామా లేఖతో సిద్ధంగా ఉండు అంటూ ప్రతి సవాల్ విసిరారు సీఎం. దీంతో ఆ తర్వాత గన్ పార్క్ కి రాజీనామా పత్రంతో వెళ్ళారు హరీష్ రావు. సింగిల్ లైన్ లో ఉండాల్సిన రాజీనామా పత్రాన్ని రెండు పేజీల్లో ఎలా రాస్తారంటూ రిటర్న్‌ కౌంటరేశారు సీఎం రేవంత్‌రెడ్డి. ఆ క్రమంలో అప్పటికి ఆ ఎపిసోడ్ కొంత సద్దుమణిగింది. కానీ… ఇప్పుడు ప్రభుత్వం రుణమాఫీ ప్రక్రియను మొదలుపెట్టడం, గురువారం సాయంత్రం లోపు లక్ష రూపాయలు రుణాలున్న రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమవడంతో రాజీనామా అంశం మళ్లీ తెరమీదకి వచ్చింది.

రుణమాఫీ సందర్భంగా ముఖ్యమంత్రి రైతులను ఉద్దేశించి మాట్లాడుతున్న సందర్భంలో కూడా హరీష్ రావు రాజీనామా ప్రస్తావన వచ్చింది. రాజీనామా చేయాల్సిన అవసరం లేదు కానీ కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చిందంటే అమలు చేసి తీరుతుందని నమ్మాలి అన్నారు సీఎం. అయితే సోషల్ మీడియాలో మాత్రం రాజీనామా చుట్టూనే చర్చ జరుగుతోంది. హరీష్ రావు రాజీనామా ఎప్పుడు చేస్తున్నారంటూ ట్రోల్‌ చేస్తోంది కాంగ్రెస్ అనుకూల వర్గం. దీనికి కౌంటర్ గా మాజీ మంత్రి హరీష్‌కు మద్దతు పలుకుతూ రుణమాఫీ ఒకటే కాదు… ఆరు గ్యారెంటీలను కూడా అమలు చేస్తేనే రాజీనామా చేస్తానని అన్నారంటూ అట్నుంచి కౌంటర్స్‌ పడుతున్నాయి. ఇలా కొత్త సవాళ్ళు, ప్రతి సవాళ్ళతో మళ్లీ రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. అదే సమయంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అన్న మాట నిలబెట్టుకుంటోందని, గత్యంతరం లేక బీఆర్‌ఎస్‌ నేతలు సాకులు వెదుక్కుంటున్నారన్న చర్చ మొదలైంది కొన్ని వర్గాల్లో. ప్రభుత్వ పెద్దలు మాత్రం రాజీనామా డిమాండ్‌ కంటే కాంగ్రెస్‌ ప్రభుత్వం చెప్పిన మాట నిలబెట్టుకుంటుదన్న సంగతిని ప్రతిపక్షాలు గుర్తిస్తే చాలంటున్నారు. గాంధీ కుటుంబం ఇచ్చిన మాట నెరవేర్చిందని ఒప్పుకుంటే చాలంటూ స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి అనడంతో… ప్రతిపక్షం డైలమాలో పడ్డట్టు అయిందంటున్నారు రాజకీయ పరిశీలకులు. మొత్తంగా రుణమాఫీతో రాజీనామాల రాజకీయం మళ్ళీ తెర మీదికి వచ్చింది. ప్రతిపక్షం ఇరుకున పడిందని కాంగ్రెస్‌ వర్గాలు భావిస్తుండగా… సవాళ్ళ విషయంలో సర్దిచెప్పుకోలేక బీఆర్‌ఎస్‌ సతమతం అవుతోందన్న చర్చ సైతం ఆసక్తి రేపుతోంది.