Site icon NTV Telugu

Off The Record: సీటు గల్లంతే..! ఎమ్మెల్యేలకు బీఆర్ఎస్‌ అధిష్టానం సీరియస్‌ వార్నింగ్‌?

Brs

Brs

Off The Record: తెలంగాణలో షెడ్యూల్‌ ప్రకారం ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. అందుకోసం ఇప్పట్నుంచే పార్టీ శ్రేణుల్ని సిద్ధం చేస్తోంది అధికార బీఆర్‌ఎస్‌ అధినాయకత్వం. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఆత్మీయ సమ్మేళనాలు జరుగుతున్నాయి. ఆ కార్యక్రమాన్ని నిరాటంకంగా కొనసాగిస్తూనే…అంతర్గతంగా నియోజకవర్గాల్లో ఉన్న పరిస్థితులపై ఆరా తీస్తోందట గులాబీ నాయకత్వం. పార్టీ వర్గాలతో పాటు వివిధ మార్గాల్లో స్థానిక పరిస్థితులకు సంబంధించిన సమాచారం తెప్పించుకుటోందట. ఎమ్మెల్యేల పనితీరు, ప్రజాదరణ, తిరిగి సీటిస్తే… గెలిచే సత్తాలాంటి అనేక కోణాల్లో సమాచారాన్ని రాబడుతోందట.

2018 ముందస్తు ఎన్నికల్లో ఎక్కువ శాతం సిట్టింగ్‌లకే తిరిగి టిక్కెట్స్‌ ఇచ్చారు కేసీఆర్‌. ఈసారి కూడా సిట్టింగ్‌లకే ఛాన్స్‌ అని గతంలోనే ప్రకటించారు కూడా. అదే సమయంలో సిట్టింగ్‌ పేరుతో గుడ్డిగా టిక్కెట్‌ ఇచ్చేసే ఆనవాయితీ లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారట. లోటు పాట్లుంటే సరిచేసుకోవాలని ఇప్పటికే కొందరికి పార్టీ సమావేశాల్లో దిశా నిర్దేశం చేశారట సీఎం. అదే క్రమంలో తాజాగా పరిస్థితి బాగోలేని ఇద్దరు ఎమ్మెల్యేలను పిలిచి జాగ్రత్తగా ఉండాలని వార్నింగ్‌ ఇచ్చారట బీఆర్‌ఎస్‌ పెద్దలు. ఆ ఇద్దరిలో ఒకరు 2018 ఎన్నికల్లో మొదటిసారి ఎన్నిక అయినవారట. మరొకరు రెండు సార్లు అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహించిన వారని గుసగుసలాడుకుంటున్నాయి గులాబీ వర్గాలు.

ఇలా ఇప్పటికే కొంత మంది ఎమ్మెల్యేలను పిలిచి చక్కదిద్దుకోవాలంటూ తమదగ్గరున్న రిపోర్ట్‌లను వారి ముందు పెట్టిందట బీఆర్‌ఎస్‌ అధినాయకత్వం. ఇలా.. అన్ని నియోజకవర్గాలకు సంబంధించిన స్పష్టమైన సమాచారం హైకమాండ్‌ దగ్గర ఉందని, తేడాగా ఉన్న వారిని ప్రత్యేకంగా పిలిపించి వార్నింగ్స్‌ ఇచ్చి పంపుతోందట. పరిస్థితిలో మార్పు లేకుంటే… సిట్టింగ్‌ అని కూడా చూడబోమన్నది ఫైనల్‌గా వారికి చెబుతున్న మాట అట. ఆరు నెలల ముందే అధిష్టానం చేస్తున్న హెచ్చరికలను పరిగణనలోకి తీసుకుని ఎందరు మారతారో, ఎందరు ఈసారి సీట్లు వదులుకుంటారోనని అంటున్నాయి బీఆర్‌ఎస్‌ వర్గాలు.

Exit mobile version