Site icon NTV Telugu

Off The Record: కేటీఆర్‌ కోసం వైటింగా..? బీఆర్‌ఎస్‌ పెండింగ్ సీట్ల అభ్యర్థుల ప్రకటన ఎప్పుడు..?

Brs

Brs

Off The Record: సింగిల్‌ షాట్‌లో 115 నియోజకవర్గాలకు అభ్యర్దులను ప్రకటించిన కేసీఆర్‌.. మరో నాలుగు సెగ్మెంట్స్‌ని మాత్రం పెండింగ్‌లో పెట్టారు. వాటిలో హైదరాబాద్‌ పాత బస్తీకి సంబంధించిన రెండిటి గురించి ఎవరూ పెద్దగా ఆలోచించడం లేదుగానీ.. ఇంకో రెండు నియోజకవర్గాల విషయంలో మాత్రం ఎక్కడలేని ఉత్కంఠ కొనసాగుతోంది. జనగామ, నర్సాపూర్‌ అభ్యర్థులుగా ఎవర్ని ఎంపిక చేస్తారు? అసలు ఎందుకు పెండింగ్‌లో పెట్టారన్న చర్చోపచర్చలు పార్టీల జరుగుతున్నాయి. ఎవరికి నచ్చిన విశ్లేషణలు వారు చేసేస్తుండటంతో కంగాళీ ఇంకా ఎక్కువ అవుతోంది. అదే సమయంలో ఈ నియోజకవర్గాలకు అభ్యర్దులను ఎప్పుడు ప్రకటిస్తారా? అని కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు ఆశావహులు.

కేసీఆర్‌ ప్రకటన కోసం ఊపిరిబిగపట్టుకుని చూస్తున్నారు వాళ్ళు. నర్సాపూర్‌ నియోజకవర్గ సిట్టింగ్‌ ఎమ్మెల్యే మదనరెడ్డికి టికెట్‌ నిరాకరించిన కేసీఆర్‌.. అక్కడ ఎవరి పేరు ప్రకటించకుండా పెండింగ్‌లో పెట్టారు. మాజీ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డికి ఈ టికెట్‌ ఖరారు చేస్తారని ఆశించినప్పటికీ అధికారిక ప్రకటన ఏదీ రాలేదు. తనకు టికెట్‌ ఇవ్వాలని మదన్‌ రెడ్డి అధిష్టానం మీద వత్తిడి తేవడం, ఆయనకే ఇవ్వాలంటూ నియోజకవర్గంలో అనుచరులు హంగామా చేయడం, అయినా పెద్దలు సైలెంట్‌గా ఉండటం ఆసక్తి రేపుతున్నాయి. ఈ సమయంలోనే సునీతారెడ్డి సీఎం కేసీఆర్‌ను కలిశారట. కొంతకాలం ఆగాల్సిందేనని ఆయన సునీతారెడ్డికి తేల్చిచెప్పినట్లు సమాచారం. ముందు మదన్‌రెడ్డితో మాట్లాడి.. ఆ తరువాతే టికెట్‌ ఖరారు చేస్తానని కేసీఆర్‌ చెప్పినట్లు తెలుస్తోంది. ఇక జనగామ టికెట్‌ ఖరారు చేయాలనుకున్నప్పటికీ మంత్రి కేటీఆర్‌ అందుబాటులో లేకపోవడంతో వాయిదా వేశారని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే పల్లా రాజేశ్వర్‌రెడ్డికి టికెట్‌ ఖరారు అయిందని ఆయన వర్గీయులు తీవ్రస్థాయిలో ప్రచారం చేసుకుంటున్నారు. పల్లా కూడా జనగామ నియోజవర్గంలోని ద్వితీయ శ్రేణి నాయకులకు అందుబాటులోకి వెళ్లిపోయారు. అయితే సిట్టింగ్‌ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డికి టికెట్‌ నిరాకరించిన క్రమంలో జనగామ టికెట్‌ కోసం పల్లా రాజేశ్వర్‌రెడ్డితో పాటు వరంగల్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌ రెడ్డి కూడా పోటీపడ్డారు. పోచంపల్లికి కేటీఆర్‌ క్లాస్‌మేట్‌. తనకు టికెట్‌ కావాలని పట్టుపడుతున్న పోచంపల్లి కేటీఆర్‌ ఆమెరికా పర్యటన ముగించుకుని వచ్చే వరకు జనగామ టికెట్‌ ఖరారు కాకుండా కేసీఆర్‌పై వత్తిడి తెచ్చినట్లు సమాచారం.

అయితే కేసీఆర్ జనగామ టికెట్‌ను ఖరారు చేయకుండా కేటీఆర్‌ వచ్చేదాకా ఆగుతారా లేదా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇక నాంపల్లి, గోషామహల్‌ సీట్ల విషయంలో మిత్రపక్షమైన ఎంఐఎం సలహా తీసుకుని కేసీఆర్‌ ఖరారు చేస్తారని సమాచారం. ఇంకా ఎంఐఎం నుంచి సూచన రాలేదని, రాగానే ఆయా స్థానాలకు అభ్యర్దులను ఖరారు చేస్తారని చెబుతున్నాయి పార్టీ వర్గాలు. ఇక మైనంపల్లి పార్టీ వీడీనా, పార్టీ నుంచి సస్పెండ్‌ అయినా… ఆ స్థానానికి కూడా కేటీఆర్ వచ్చాకే అభ్యర్దిని ఖరారు చేస్తారని అంటున్నారు. సో కేటీఆర్‌ అమెరికా పర్యటన ముగించుకుని వచ్చిన తరువాతే… బీఆర్‌ఎస్‌ పెండింగ్‌ సీట్లపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

Exit mobile version