Site icon NTV Telugu

Off The Record: రాజాసింగ్ తెగేదాకా లాగుతారా..? ఢిల్లీ పెద్దలు సీరియస్‌గా ఉన్నారా?

Raja

Raja

Off The Record: రాజా సింగ్… బీజేపీ ఫైర్ బ్రాండ్ లీడర్‌.. ఎప్పుడూ ఏదో ఒక వివాదంతో జనం నోళ్ళలో నానుతుంటారాయన. హిందుత్వ అజెండాతో ఆయన మాట్లాడే మాటలు మంటలు రేపే సందర్భాలే ఎక్కువ. కానీ… కొంత కాలంగా ఆ వాయిస్‌ కామైపోయిందట. కేవలం మాటలేకాదు… మనిషి సైతం పెద్దగా కనిపించడం లేదంటున్నాయి తెలంగాణ బీజేపీ వర్గాలు. ఎన్నికల ప్రచారంతో పాటు రాష్ట్ర పార్టీ నిర్వహించే కార్యక్రమాల్లో సైతం పాల్గొనడం లేదట ఆయన. విజయ సంకల్ప యాత్రకు సైతం దూరంగా ఉన్నారు రాజాసింగ్‌.. తన నియోజకవర్గంలో అసలా ప్రోగ్రామ్‌ నిర్వహించలేదన్నది కేడర్‌ చెబుతున్న మాట. పార్టీ కేంద్ర నాయకత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఈ లోక్‌సభ ఎన్నికల్ని ఎమ్మెల్యే కూడా అయిన రాజాసింగ్‌ లైట్‌ తీసుకోవడం, అసలు తనకేమీ పట్టనట్టుగా ఉండటం ఏంటన్న చర్చ పార్టీ వర్గాల్లో జరుగుతోంది.

దీనికి సంబంధించి రకరకాల విశ్లేషణలు బయలుదేరాయి. గతంలో అసెంబ్లీ ఫ్లోర్ లీడర్‌గా ఉన్న రాజాసింగ్‌కు ఈసారి ఆ అవకాశం దక్కలేదు. అక్కడే అసంతృప్తి బీజం పడిందంటున్నారు. ఆ తర్వాతి నుంచి ముఖ్యమైన పార్టీ మీటింగ్‌లకు సైతం డుమ్మా కొడుతున్నారాయన. చివరికి మోడీ, అమిత్ షా కార్యక్రమాలలో సైతం కనిపించడం లేదు. పుండు మీద కారం చల్లినట్టు తాజాగా పార్టీ హైదరాబాద్‌ లోక్‌సభ అభ్యర్థి మాధవీలతకు పార్టీ పెద్దలు అత్యంత ప్రాధాన్యం ఇవ్వడం కూడా ఆయనకు నచ్చడం లేదట. అసలామెకు ఎంపీ టిక్కెట్‌ ఇవ్వడమే రాజాసింగ్‌కు ఇష్టం లేదన్నది ఇన్నర్‌ వాయిస్‌. అందుకే హైదరాబాద్‌లో ప్రచారానికి దూరంగా ఉంటున్నట్టు సమాచారం. పార్టీ రాష్ట్ర ఎన్నికల ఇన్ఛార్జ్‌ అభయ్ పాటిల్, బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి రాజాసింగ్‌ ఇంటికి వెళ్లి మాట్లాడినా… అలకపాన్పు దిగలేదంటున్నారు బీజేపీ నేతలు. పలువురు ఇతర నాయకులు కూడా ఆయనను కలిసి పార్టీ ప్రచారంలో పాల్గొనాలని విజ్ఞప్తి చేసినట్లు సమాచారం. అయినా ఏ మాత్రం మెట్టు దగకపోవడం ఇప్పుడు చర్చనీయాంశం అయింది. ఇతర ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నా… బీజేపీ ప్రోగ్రామ్స్‌కు మాత్రం హాజరవకపోవడాన్ని ఎలా అర్ధం చేసుకోవాలో తెలియక తికమక పడుతున్నారట టీ బీజేపీ లీడర్స్. పార్టీకి దూరంగా ఉంటున్నా… కాంగ్రెస్, ఎంఐఎం చేసే కామెంట్స్‌కు మాత్రం కౌంటర్స్‌ వేస్తున్నారు రాజాసింగ్.

వాతావరణాన్ని తేలిక పరిచే ఉద్దేశ్యంతో హైదరాబాద్ లోక్‌సభ అభ్యర్థి మాధవీలత నామినేషన్ కార్యక్రమంలో ఆయన పాల్గొంటారని ప్రకటించింది పార్టీ. అయినా రాజాసింగ్‌ మాత్రం ఎక్కడా కనిపించకపోవడంతో చర్చ ఇంకా పెరిగింది. ఇక హైదరాబాద్, సికింద్రాబాద్ సీట్ల పరిధిలో ఆయన ప్రచారం చేసే అవకాశాలు చాలా తక్కువ అన్నది సన్నిహితుల వెర్షన్‌. అయితే ఈ రెండు నియోజకవర్గాలు కాకుండా మిగతా చోట ప్రచారానికి వెళ్ళమంటే మాత్రం ఆయన సిద్ధమేనన్నది వాళ్ల మాటగా తెలిసింది. ఈ క్రమంలో ఎమ్మెల్యే వ్యవహారంపై బీజేపీ కేంద్ర పెద్దలు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది. ఆయన తీరును సీరియస్‌గానే గమనిస్తున్నట్టు చెప్పుకుంటున్నాయి పార్టీ వర్గాలు. మరి ప్రచారం పీక్స్‌లో ఉండి, వ్యవహారం క్లైమాక్స్‌కు చేరుతున్న టైంలో ఇకనైనా రాజాసింగ్‌ అసకపాన్పు దిగుతారా? లేక మొండిగా అలాగే ఉండిపోతారా అన్నది చూడాలి. మొండిగా ఉంటే… ఎన్నికల తర్వాత పార్టీ అధిష్టానం ఏం చేస్తుందన్నది కూడా ఇంట్రస్టింగ్‌ పాయింట్‌.

Exit mobile version