Off The Record: తెలంగాణ బీజేపీలో లొల్లి కొనసాగుతూనే ఉంది. గొడవలు సద్దుమణుగుతున్నాయి… పరిస్థితి చక్కబడుతోందని అనుకుంటున్న ప్రతిసారి ఎవరో ఒకరు, ఏదో ఒక వివాదంతో కలకలం రేపుతున్నారు. దానిపై రచ్చ అవుతూనే ఉంది. అసలు పరిస్థితి చూస్తుంటే… ఇప్పట్లో కమలంలో మంటలు చల్లారేలా కనిపించడం లేదంటున్నారు పరిశీలకులు. పార్టీ ముఖ్య నేతలు సైతం ఇవెక్కడి గొడవల్రా… నాయనా అని తలలు బాదుకుంటున్నారట. మాటలు, ట్వీట్లతో ఎవరు ఉంటారో…ఎవరు పోతారోన్న గందరగోళం కూడా పార్టీలో పెరుగుతున్నట్టు తెలిసింది. తాజాగా ఫైర్ బ్రాండ్ విజయశాంతి మరోసారి హాట్ టాపిక్ అయ్యారు. ఆమె చేస్తున్న ట్వీట్స్, వ్యవహారశైలి అనుమానాలకు తావిస్తున్నాయట. కొన్ని అంశాలపై ఆమె స్వపక్షం లోనే విపక్షంలా మాట్లాడుతున్నారట. విజయ శాంతి చేస్తున్న ట్వీట్స్‌పై కమలం పార్టీలో రకరకాల ఊహాగానాలు మొదలయ్యాయి. బండి సంజయ్‌ని అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పించినప్పటి నుంచి రాములమ్మ స్వరంలో మార్పు వచ్చిందంటున్నారు. విజయశాంతి అశాంతిగా కనిపిస్తున్నారని, ఆమె మనసులో మరో ఆలోచన ఉందా అన్న ప్రశ్నలు సైతం పార్టీ వర్గాల్లో వినిపిస్తున్నాయట.
కిషన్ రెడ్డి రాష్ట్ర అధ్యక్ష బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రావడంపై తన అసంతృప్తిని బహిరంగంగానే వ్యక్తం చేశారు విజయశాంతి. దాని మీద సీరియస్‌గానే ట్వీట్ చేశారు. తెలంగాణ ఉద్యమాన్ని అణచి వేసిన వారితో వేదిక పంచుకోవడం ఇష్టంలేకే తాను ఆ కార్యక్రమం మధ్యలో వచ్చేశానని చెప్పారు. అప్పట్లో దీని మీద బాగానే రచ్చ అయింది. విజయశాంతి పార్టీలో ఉండరంటూ జరిగిన ప్రచారంపై కూడా స్పందిస్తూ…. ట్వీట్స్ చేసి వెంటనే డిలీట్ చేశారు. ఇక తాజాగా మణిపూర్ ఘటనలపై కూడా సీరియస్‌గా రియాక్ట్ అయ్యారు రాములమ్మ. దోషుల్ని ఉరి తీయాలని డిమాండ్ చేశారు. ఓవైపు బీజేపీ అగ్రనాయకత్వం రాజస్థాన్, బెంగాల్‌లో మహిళల మీద జరుగుతున్న దాష్టీకాల సంగతేంటని ప్రశ్నిస్తున్న టైంలో విజయశాంతి ఒక్క మణిపూర్ గురించే ప్రశ్నించడం వెనక వ్యూహం ఏదన్నా ఉందా…. అన్న చర్చ పార్టీలో మొదలైందట. ఆ విషయాన్ని గ్రహించిన విజయశాంతి తర్వాత ఆ రెండు రాష్ట్రాలను కూడా కలుపుతూ మరోసారి ట్వీటారట. ఇక్కడే పొలిటికల్ పరిశీలకులకు రకరకాల అనుమానాలు వస్తున్నాయి. రాములమ్మకు ఏమైంది? ఆమె మనసులో వేరే ఆలోచన ఏదన్నా ఉందా? ఉంటే గింటే ఏ రూపంలో ఉండబోతోందన్న ప్రశ్నలు పార్టీ వర్గాల్లో పెరుగుతున్నట్టు తెలిసింది. ఎన్నికల ముంగిట్లో… బీజేపీ పడుతూ లేస్తూ ఉన్న టైంలో… విజయశాంతి ఇలా ఎందుకు వ్యవహరిస్తున్నారు? పార్టీలో తన స్థానాన్ని పదిలం చేసుకునే ప్రయత్నమా లేక మారే ఆలోచన ఏదన్నా ఉందా అన్న చర్చ కూడా కేడర్‌లో జరుగుతున్నట్టు తెలిసింది. దీని మీద రాములమ్మ స్పందిస్తారా? అనుమానాలను నివృత్తి చేస్తారా? లేదా అన్నది చూడాలి.
