Site icon NTV Telugu

Off The Record: ఏపీ బీజేపీలో కొత్త లొల్లి..! సీట్ల సయ్యాట ఏంటి..?

Ap Bjp

Ap Bjp

Off The Record: ఏపీ బీజేపీలో దాదాపు ఐదేళ్ల తర్వాత పాత లొల్లి కొత్తగా షురూ అయింది. తెలుగుదేశం పార్టీ ముద్ర.. టీడీపీ సానుభూతిపరులైన వారికే టిక్కెట్లు దక్కుతున్నాయన్న చర్చ పార్టీ వర్గాల్లో జోరుగా సాగుతోంది. చంద్రబాబుతో షెకావత్‌, పవన్‌ భేటీ తర్వాత ఏపీలో ఎవరెవరు ఎన్నెన్ని స్థానాల్లో పోటీ చేయాలనే అంశంపై క్లారిటీ వచ్చింది. ఈ క్రమంలో బీజేపీ పోటీ చేసే కొన్ని పార్లమెంట్‌.. అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించిన స్పష్టత కూడా వచ్చింది. దీంతో ఆయా స్థానాల్లో టిక్కెట్లు ఆశిస్తున్న వారిలో కొందరికి షాక్‌ తగిలింది. ఈ క్రమంలో పాత పాటే కొత్తగా వినిపిస్తోంది. మళ్లీ సైకిల్‌ బ్రాండ్‌ లీడర్లు .. టిక్కెట్లు ఎగరేసుకుని పోవడానికి సిద్దమవుతున్నారని.. ఆ మేరకు గుట్టుచప్పుడు కాకుండా.. పావులు కదుపుతున్నారన్న చర్చ జోరుగా సాగుతోంది. దానికి విరుగుడుగా… కొందరు పాత బీజేపీ నేతలు జట్టు కట్టబోతున్నట్టు సమాచారం. ఇప్పటికే ఏపీలో జరుగుతున్న పరిణామాలు.. సీట్ల ఖరారు ప్రచారాన్ని జాతీయ నాయకత్వం దృష్టికి తీసుకెళ్లినట్టు తెలుస్తోంది. ప్రధానంగా మాజీ సీఎం కిరణ్ కుమార్‌ రెడ్డి రాజంపేట పార్లమెంట్‌ సెగ్మెంట్‌ నుంచి పోటీ చేయాలనుకుంటున్నారట. అందుకోసం కొంత గ్రౌండ్‌ ప్రిపేర్‌ చేసుకున్నట్టు తెలిసింది.

కానీ బీజేపీకి కేటాయించిన ఎంపీ స్థానాల్లో రాజంపేట లేదన్న భావన వ్యక్తమవుతోంది. అంటే.. కిరణ్‌ కుమార్‌ రెడ్డికి కూడా టిక్కెట్‌ ఇవ్వరా..? అనే చర్చ జరుగుతోంది. వాస్తవానికి బీజేపీ ఎక్కడెక్కడ పోటీ చేయబోతోందన్న విషయమై అధికారిక ప్రకటన చేయలేదు కానీ.. బయట జరుగుతున్న ప్రచారం మేరకు రాజంపేట స్థానం నుంచి టీడీపీనే బరిలోకి దిగే అవకాశం ఉందంటున్నారు. దీంతో బీజేపీ శ్రేణులు అగ్గి మీద గుగ్గిలం అవుతున్న పరిస్థితి. అలాగే ఏలూరు ఎంపీ స్థానాన్ని బీజేపీ నేత గారపాటి సీతారామ చౌదరి ఆశిస్తున్నారు. అయితే ఆ స్థానం నుంచి కూడా టీడీపీనే పోటీ చేస్తుందనేది ఓ ప్రచారం. దీంతో గారపాటి ఇండిపెండెంట్‌గా పోటీ చేయాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. అలాగే సోము వీర్రాజును అనపర్తి స్థానం నుంచి బరిలో దిగమని టీడీపీ ప్రతిపాదించిందనేది మరో టాక్‌. అసలు అనపర్తి నుంచి బీజేపీ పోటీ చేయడం కుదరుతుందా..? అన్నది ఇంకో క్వశ్చన్‌. అసలు సోము వీర్రాజు రాజమండ్రి.. ఆ పరిసర ప్రాంతాల టిక్కెట్లను ఆశిస్తుంటే.. అనపర్తి పేరు ప్రతిపాదించడమేంటీ అనేది సదరు లోటస్‌ లీడర్ల వాదన.

అలాగే జీవీఎల్‌ కూడా విశాఖ లేదా అనకాపల్లి ఎంపీ టిక్కెట్‌ ఆశిస్తున్నారు. కానీ ఇప్పుడది ఏమవుతుందో తెలియని పరిస్థితి. ఈ విధంగా కొందరి కోసం పార్టీ మొత్తాన్ని ఇబ్బందుల్లోకి నెట్టే విధంగా కొంతమంది కొత్త నేతలు వ్యవహరిస్తున్నారని, దీని వల్ల పార్టీ మనుగడకే ఇబ్బందనే వాదన తెర మీదికి వస్తోంది. గతంలో చంద్రబాబు ఏ విధంగా అయితే.. ఏపీ బీజేపీని గుప్పెట్లో పెట్టుకున్నారో.. మళ్లీ అదే తరహా తంతు నడుస్తుందనేది కొందరు బీజేపీ నేతల ఆందోళన. మరి ప్రస్తుతం ప్రచారంలో ఉన్నదంతా వాస్తవమా? కేవలం ప్రచారమేనా అన్నది తేలాలంటే ఫానల్‌ లిస్ట్‌ వచ్చేదాకా ఆగాల్సిందే.

Exit mobile version