NTV Telugu Site icon

Off The Record: సొంత పార్టీ నేతల టార్గెట్‌లో వైసీపీ మాజీలు..!

Ycp

Ycp

Off The Record: శత్రువులు ఎక్కడో లేరు.. ఇన్ని రోజులు మన పక్కనే ఉన్నారన్న విషయాన్ని ఉమ్మడి అనంతపురం జిల్లాలోని మాజీ ఎమ్మెల్యేలకు ఇప్పుడిప్పుడే అర్థమవుతోందట. కూటమి అధికారంలోకి వచ్చాక టిడిపి ప్రభుత్వం నుంచి ఎలాంటి ఇబ్బందులు వస్తాయోనన్న ఆందోళన వారిలో కనిపిస్తోందంటున్నారు. అందులో పెద్ద విషయం ఏదీ లేదుగానీ…. వాళ్ళ గత తప్పిదాలకు సంబంధించిన ఆధారాలను వైసీపీ నాయకులే ప్రత్యర్థులకు అందిస్తున్నారన్న సమాచారం మాజీలకు కునుకు పట్టనీయడం లేదంటున్నారు. అయితే నేరుగా తమ నేతలను తామే టార్గెట్ చేసినట్టు కాకుండా ఇంకో రూట్లో వెళ్తున్నట్టు తెలుస్తోంది. ఉమ్మడి అనంతపురం జిల్లాలో ప్రస్తుతం జిల్లా పరిషత్ తో పాటు అన్ని మున్సిపాలిటీలు వైసీపీ చేతిలోనే ఉన్నాయి. ఒక్క తాడిపత్రి మినహా మిగిలిన అన్ని స్థానిక సంస్థల్లో వైసిపిదే అధిపత్యం. ఇన్ని రోజులు పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఎవరూ తమకున్న అసంతృప్తిని బయట పెట్టలేదు. ఎంతో ఖర్చు పెట్టి స్థానిక సంస్థల్లో గెలిస్తే.. కనీసం ఒక్క రూపాయి సంపాదించుకునే అవకాశం ఇవ్వలేదు… కనీసం ఒక్కపని చేసుకోనివ్వలేదంటూ మాజీ ఎమ్మెల్యేల మీద తీవ్ర అసహనంతో రగిలిపోయారట స్థానిక ప్రజా ప్రతినిధులు.

Read Also: Krithi Shetty: బ్లాక్ డ్రెస్ లో బేబమ్మ అందాలు.. చుస్తే ఫిధా అవ్వాల్సిందే

వైసీపీ ఓటమికి ఇది కూడా పరోక్షంగా ఒక కారణమన్నది లోకల్‌ వాయిస్‌. ఇప్పుడు అధికారం పోయాక మాజీ ఎమ్మెల్యేలు చేసిన పనులను వైసీపీ స్థానిక నేతలే పరోక్షంగా బయటపెడుతున్నారు. ఇటీవల జరిగిన రెండు సమావేశాలు గమనిస్తే.. ఈ విషయం స్పష్టంగా అర్థమవుతోందంటున్నారు పరిశీలకులు. జడ్పీ సర్వసభ్య సమావేశం తోపాటు అనంతపురం నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశాలే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ అంటున్నారు. జిల్లా పరిషత్ లో మొత్తం 63 మంది జడ్పిటిసిలు ఉండగా వారిలో 62 మంది వైసిపి వారే. టీడీపీకి ఒక్క జడ్పీటీసీ మాత్రమే ఉన్నారు. కానీ.. ప్రస్తుతం జిల్లాలో 14 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలు టిడిపి వారే. దీంతో తాజా జడ్పీ మీటింగ్‌ ఉత్కంఠ రేపింది. ఈ సమావేశంలో ప్రధానంగా వైసిపి జడ్పిటిసిలు టార్గెట్ చేసింది ఆర్.డబ్ల్యు.ఎస్ ఎస్ఈని. తమకు తెలియకుండా జడ్పీ నిధులను ఆయన కొందరు కాంట్రాక్టర్లకు ఇచ్చారన్నది ప్రధానమైన ఆరోపణ. తాగునీటి పథకాలకు సంబంధించిన కాంట్రాక్టర్లకు జడ్పీ ప్రమేయం లేకుండా ఎలా ఇచ్చారంటూ ఛైర్‌పర్సన్‌తో సహా అంతా నిలదీశారు. దీనిపై విచారణకు డిమాండ్‌ చేశారు.

Read Also: AP Capital Construction: రాజధాని నిర్మాణాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం.

అయితే అసలు ట్విస్ట్‌ అక్కడే ఉందని అంటున్నారు పొలిటికల్‌ పరిశీలకులు. ఎందుకంటే తాగునీటి పథకం బిల్లులు చెల్లించింది.. హిందూపురం పార్లమెంట్ పరిధిలోని ఇద్దరు వైసిపి మాజీ ఎమ్మెల్యేల అనుచరులకేనట. ఆ ఇద్దరు తాజా మాజీ ఎమ్మెల్యేలను టార్గెట్ చేయడానికి జడ్పిటిసిలు ఇలా ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ ని ఎంచుకున్నట్టు అర్ధమవుతోందంటున్నారు. ఆ అంశం మీద విచారణ జరిగితే.. ఆ తాజా మాజీ ఎమ్మెల్యేల పేర్లు బయటికి వస్తాయని భావిస్తున్నారు. ఇక అనంతపురం నగరపాలక సంస్థ విషయానికి వస్తే… డంపింగ్ యార్డ్ ప్యూరిఫికేషన్ కాంట్రాక్టులో భారీ అవినీతి జరిగిందన్నది ప్రధానమైన ఆరోపణ. ఈ కాంట్రాక్ట్ చేసిన వారిని విచారించి కఠిన చర్యలు తీసుకోవాలని వైసిపి కార్పొరేటర్లు డిమాండ్ చేస్తున్నారు.ఇది కూడా వైసీపీ కీలక నేతలను ఇరుకున పెట్టేదే….దీని మీద విచారణ జరగాలని ప్రస్తుత ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ కూడా డిమాండ్‌ చేస్తున్నారు. ఆ విచారణ జరిగితే ఇబ్బంది ఎవరికన్న సంతి వేరే చెప్పాల్సిన అవసరం లేదంటున్నారు పరిశీలకులు. ఇలా మొత్తంగా వైసీపీకి చెందిన స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులే ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యేలను టార్గెట్‌ చేసుకుని పావులు కదుపుతుండటం ఆసక్తికరంగా మారింది.