NTV Telugu Site icon

Off The Record : ఉమ్మడి వరంగల్లో CMRF స్కామ్ కలకలం.. మాజీ ఎమ్మెల్యేల, పీఏల పాత్ర..?

Cmrf Scam Otr

Cmrf Scam Otr

అసలే కష్టాల్లో ఉన్న గులాబీ దళాన్ని సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కుల స్కాన్‌ చుట్టుముట్టబోతోందా? బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు నిజంగానే అక్రమాలకు పాల్పడ్డారా? సీఐడీ దర్యాప్తులో ఏం తేలుతోంది? ఎక్కడెక్కడ అక్రమాలు జరిగాయన్న ఆరోపణలున్నాయి? ఆ విషయమై పార్టీలో జరుగుతున్న చర్చ ఏంటి? తెలంగాణ వ్యాప్తంగా సంచలనం రేపుతున్న సీఎంఆర్ ఎఫ్ స్కాం ప్రకంపనలు వరంగల్‌లోనూ కనిపిస్తున్నాయి. పేదోళ్ల వైద్య సేవలకు కేటాయించే సీఎం సహాయనిధిపై కన్నేసిన కొన్ని బడా ఆస్పత్రులు.. నకిలీ పేషెంట్స్‌, దొంగ బిల్లులతో కోట్లు కొల్లగొ ట్టాయి. ఇప్పుడీ స్కామ్‌లో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ప్రజాప్రతినిధుల పేర్లు బయటకు రావడం కలకలం రేపుతోంది. ఇందులో ఆసుపత్రులతో పాటు కొందరు మాజీ ఎమ్మెల్యేలు, వారి పీఏలు, బీఆర్‌ఎస్‌ నేతల పాత్ర ఉందన్న సమాచారం సంచలనం రేపుతోంది. సీఐడీ దూకుడుగా ముందుకు పోతుండటంతో కీలక విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ఈ స్కామ్‌లో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. దీన్ని ఆసరా చేసుకుని ఎన్నికలకు ముందు ఆ నియోజకవర్గంలో విచ్చలవిడిగా సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులు పంపిణీ అయ్యాయట. ఈ స్కామ్‌కు సంబంధించి ఉమ్మడి వరంగల్ జిల్లాలోని మూడు ఆస్పత్రులపై కేసులు బుక్‌ అయినట్టు తెలిసింది. రంగంలోకి దిగిన సీఐడీ ప్రైవేటు దవాఖానాల యాజమాన్యాలు, కొందరు ప్రభుత్వ వైద్యులు, సిబ్బంది, గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన కొంతమంది రాజకీయనేతలు, వారి పీఏలను విచారిస్తున్నట్టు తెలుస్తోంది.

 
JK Floods: జమ్మూకాశ్మీర్‌లో క్లౌడ్ బరస్ట్.. ఇద్దరి పిల్లలతో ప్రవాహంలో కొట్టుకుపోయిన తల్లి
 

అంతా చైన్ గా ఏర్పడి ఈ కుంభకోణానికి తెరలేపినట్టు గుర్తించారట సీఐడీ అధికారులు. ఒక డీఎస్పీ స్థాయి అధికారితో పాటు ఇద్దరు సీఐలు, నలుగురు ఎస్సైలతో కలిపి పది మంది వరకు టీమ్ ఈ పనిలో ఉన్నట్టు తెలిసింది. మహబూబాబాద్ లోని రెండు ప్రైవేట్ ఆస్పత్రులు, హన్మకొండలోని ఒక ఆస్పత్రి నుంచి వివరాలు సేకరిస్తున్నారట సీఐడీ అధికారులు. ప్రస్తుతానికి మూడు ఆసుపత్రులే కనిపిస్తున్నా… ఇంకో ఐదారు దాకా ఈ స్కామ్‌లో ఉండవచ్చని అనుమానిస్తోంది తెలంగాణ సీఐడీ. దొంగ బిల్లులతో చికిత్స పొందిన అడ్రస్‌లన్నీ మహబూబాబాద్ నియోజకవర్గం పరిధిలోనే ఉండటం అనుమానాలకు తావిస్తోందట. ఒక్క మహబూబాబాదే కాకుండా… ఉమ్మడి వరంగల్ జిల్లాలో మరికొన్ని చోట్ల ఇలాంటి తంతు జరిగినట్టు తెలుస్తోంది. 2023 ఏప్రిల్ వరకు జరిగిన సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీపై వచ్చిన ఫిర్యాదులపై విచారణ మొదలెట్టిన సిఐడి అధికారులు వెలుగు చూస్తున్న వ్యవహారాలు చూసి విస్తుపోతున్నారట. దీనిపై అప్పటి గులాబీ పార్టీ ఎమ్మెల్యేల ఒత్తిడి, పాత్ర ఏమైనా ఉందా అనే కోణంలో కూడా దర్యాప్తు జరుగుతున్నట్టు సమాచారం. ఎవరి సంగతి ఎలా ఉన్నా…. మహబూబాబాద్‌ జిల్లాలోని ఓ ఎమ్మెల్యే ప్రమేయం అయితే కచ్చితంగా ఉందన్న ప్రచారం జరిగిపోతోంది. వైద్యులపై ఒత్తిడి తెచ్చి భారీగా సీఎంఆర్ఎఫ్ చెక్కులు నకిలీ రోగులకు పంపిణీ చేసి అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సదరు తాజా మాజీ ఎమ్మెల్యేతో పాటు ఆయన అనుచరులు కూడా ఈ స్కాంలో భారీగా వెనుకేసుకున్నారని, అలాగే హనుమకొండ, వరంగల్ జిల్లాల పరిధిలోని కొందరు మాజీ ఎమ్మెల్యేల పాత్ర ఉందనే చర్చ జరుగుతోంది. 2023 ఏప్రిల్‌ వరకు జారీ అయిన సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కుల తీగ లాగితే గులాబీ డొంక కదులుతోందని అంటున్నారు రాజకీయ ప్రత్యర్థులు. దీంతో ఇది తిరిగి తిరిగి అసలే కష్టాల్లో ఉన్న పార్టీని ఇంకెంత ఇబ్బంది పెడుతుందోనన్ కంగారు పెరుగుతోందట ఉమ్మడి వరంగల్‌ జిల్లా బీఆర్‌ఎస్‌ వర్గాల్లో.

Amaravathi: రాష్ట్రంలోని పత్తినంతా కొనుగోలు చేయాలి.. కేంద్రానికి మంత్రులు లేఖ