Odisha Train Accident LIVE UPDATES: ఒడిశాలో రైలుపట్టాలపై మరణ మృదంగం మోగింది. శుక్రవారం రాత్రి చోటుచేసుకున్న ఘోర రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య 288కి చేరింది. 1000 మందికి పైగా గాయాలపాలయ్యారు. క్షతగాత్రుల్లో పలువురి పరిస్థితి విషమంగా ఉందని అధికార వర్గాలు తెలిపాయి. రాత్రివేళ ప్రమాదం చోటుచేసుకోవడంతో.. బోల్తాపడిన బోగీల్లో చాలా మంది ఉంటారని అధికారులు అనుమానిస్తున్నారు. ఇటీవలి కాలంలో దేశంలో చోటుచేసుకున్న అతిపెద్ద రైలుప్రమాదం ఇదేనని భావిస్తున్నారు. బాధితుల్లో బెంగాల్‌వాసులే ఎక్కువమంది ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాద ఘటనపై భిన్న కథనాలు వినిపిస్తున్నాయి. ఈ ఘోర రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. బోగీల నుంచి మృతదేహాల వెలికితీత కొనసాగుతోంది. సహాయక చర్యల్లో ఎన్డీఆర్‌ఎఫ్‌తో పాటు ఆర్మీ సైతం పాల్గొంటోంది. భువనేశ్వర్ సహా బాలేశ్వర్, భద్రక్, మయూర్‌భంజ్, కటక్‌లోని ఆస్పత్రల్లో క్షతగాత్రులకు చికిత్స అందిస్తున్నారు. మరోవైపు క్షతగాత్రుల్లోనూ పలువురి పరిస్థితి విషమంగా ఉంది. బాధితుల్లో బెంగాలీవాసులే ఎక్కువ మంది ఉన్నారనేది ఒక అంచనా. ఇక మృతుల్లో, గాయపడిన వాళ్లలో తెలుగువాళ్లు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.