Site icon NTV Telugu

Odisha: ఒడిశాలో పడవ ప్రమాదం.. ఏడుగురు మృతి

Dle

Dle

ఒడిశాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఝార్సుగూడ జిల్లాలోని మహానదిలో శుక్రవారం జరిగిన పడవ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారు. ఛత్తీస్‌గఢ్‌లోని ఖర్సియాకి చెందిన 50 మందికిపైగా ప్రయాణికులు బార్‌ఘర్ జిల్లా పథర్సేని కుడాలోని ఆలయాన్ని సందర్శించి పడవలో తిరిగి వస్తున్నారు. ఈ క్రమంలో అకస్మాత్తుగా పడవ బోల్తా పడింది. దీంతో అందులోని 50 మంది నదిలో మునిగిపోయారు. వారిలో కొందరు ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకుని ప్రాణాలు నిలుపుకోగా ఏడుగురు ఈత రాక నీట మునిగిపోయారు. జార్సుగూడ జిల్లా రెంగలి పోలీస్ స్టేషన్ పరిధిలోని శారదా ఘాట్ వద్దకు చేరుకోగానే బోటు బోల్తా పడినట్లు సమాచారం. మత్స్యకారులు.. 35 మంది ప్రయాణికులను రక్షించి ఒడ్డుకు తీసుకొచ్చారు.

విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మరో 13 మందిని రక్షించారు. ఏడుగురు గల్లంతయ్యారని.. వారిని వెతికేందుకు సర్చ్ ఆపరేషన్ ప్రారంభించామని పోలీసులు తెలిపారు. ఘటనకు కారణమైన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. మృతుల్లో నలుగురు మహిళలు, ముగ్గురు చిన్నారులు ఉన్నట్లు తెలుస్తోంది. భువనేశ్వర్ నుంచి ప్రత్యేక విమానంలో స్కూబా డైవర్లు, సెర్చ్ కెమెరాలను ఘటనాస్థలికి తరలించారు.

పడవ ప్రమాద ఘటనలో మృతి చెందిన కుటుంబాలకు ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ సానుభూతి తెలిపారు. వారి కుటుంబాలకు రూ.4 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియాను ప్రకటించారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం తరఫున అన్ని రకాలుగా ఆదుకుంటామని నవీన్ భరోసా ఇచ్చారు. ఘటనకు కారణమైన వారిపై కేసులు నమోదు చేసి తగిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

Exit mobile version