OdalaRevu Fishermens: 23 రోజుల అనంతరం.. స్వస్థలాలకు బయలుదేరిన ఓడలరేవు మత్స్యకారులు!

Odalarevu Fishermens

Odalarevu Fishermens

అంబేద్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలం ఓడలరేవు నుంచి ఈ నెల 3వ తేదీన వేటకు వెళ్లి ఆచూకీ లేకుండా పోయిన ఏడుగురు మత్స్యకారులు క్షేమంగా బయటపడ్డారు. సముద్రంలో వేట సాగిస్తుండగా వారి బోటు గేర్ బాక్స్‌లో సాంకేతిక లోపం తలెత్తడంతో ఇంజిన్ పనిచేయక నిలిచిపోయింది. దీంతో బోటు సముద్రంలో గాలివాటానికి కొట్టుకుపోతూ దూర ప్రాంతాలకు చేరుకుంది. దాదాపు 23 రోజులపాటు సముద్రంలో చిక్కుకుపోయిన మత్స్యకారులు చివరకు పశ్చిమ బెంగాల్‌లోని దిఘా తీరానికి నిన్న రాత్రి సురక్షితంగా చేరుకున్నారు.

బెంగాల్‌ అధికారులు, వైద్య బృందాలు మత్స్యకారులకు వైద్య పరీక్షలు నిర్వహించగా.. అందరూ ఆరోగ్యంగా ఉన్నట్లు వెల్లడించారు. మత్స్యకారులు క్షేమంగా ఉన్నారన్న సమాచారం అందడంతో వారి కుటుంబ సభ్యులు, స్థానిక ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. కాగా దిఘా నుంచి ఈ ఉదయం 10 గంటలకు స్వస్థలాలకు బయలుదేరిన మత్స్యకారులు త్వరలోనే ఓడలరేవుకు చేరుకోనున్నారు. 23 రోజుల అనిశ్చితి తర్వాత మత్స్యకారులు సురక్షితంగా తిరిగి వస్తుండటంతో కోనసీమలో ఆనందం వ్యక్తమవుతోంది.