ఇంగ్లండ్ బ్యాటింగ్ సంచలనం జో రూట్ మరో రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. టెస్టు క్రికెట్‌లో నాలుగో ఇన్నింగ్స్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. క్రైస్ట్‌చర్చ్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్టు నాలుగో ఇన్నింగ్స్‌లో 23 పరుగులు చేసిన రూట్.. ఈ ఫీట్ సాధించాడు. అంతకుముందు ఈ రికార్డు క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ పేరిట ఉంది. సచిన్ 60 ఇన్నింగ్స్‌ల్లో 1625 పరుగులు చేయగా.. రూట్ 49 ఇన్నింగ్స్‌ల్లోనే 1630 రన్స్ బాదాడు.
ఈ జాబితాలో ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ అలిస్టర్ కుక్ మూడో స్థానంలో ఉన్నాడు. కుక్ 53 ఇన్నింగ్స్‌లలో 1611 పరుగులు చేశాడు. దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ గ్రేమ్ స్మిత్ (1611-41 ఇన్నింగ్స్‌లు), విండీస్ మాజీ ఓపెనర్ శివనారాయణ్ చందర్‌పాల్ (1580-49 ఇన్నింగ్స్‌లు) టాప్-5లో ఉన్నారు. ఇప్పటివరకు 150 టెస్టులు ఆడిన జో రూట్.. 12,777 పరుగులు చేశాడు. టెస్ట్ ఫార్మాట్‌లో అత్యధిక రన్స్ చేసిన ఆటగాళ్ల జాబితాలో రూట్ ప్రస్తుతం ఐదో స్థానంలో ఉన్నాడు. సచిన్ 15,921పరుగులతో అగ్ర స్థానంలో ఉన్నాడు.
న్యూజిలాండ్‌తో ముగిసిన తొలి టెస్టులో ఇంగ్లండ్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఆదివారం 155/6 స్కోరుతో రెండో ఇన్నింగ్స్‌ను ఆరంభించిన కివీస్ 254 పరుగులకు ఆలౌట్ అయింది. డారిల్ మిచెల్ (84) హాఫ్ సెంచరీ చేశాడు. కివీస్ నిర్దేశించిన 104 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లీష్ జట్టు 12.4 ఓవర్లలోనే ఛేదించింది. జాకబ్ బెథెల్ (50 నాటౌట్; 37 బంతుల్లో) అర్ధ శతకం బాదగా.. బెన్ డకెట్ (27; 18 బంతుల్లో), జో రూట్ (23 నాటౌట్; 15 బంతుల్లో) పరుగులు చేశారు.