NTV Telugu Site icon

NZ vs BAN: నేడు న్యూజిలాండ్, బంగ్లాదేశ్‌ మ్యాచ్.. బరిలోకి కేన్‌ మామ!

Kane Williamson Helmet

Kane Williamson Helmet

NZ vs BAN World Cup 2023 Playing 11: వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా నేడు న్యూజిలాండ్, బంగ్లాదేశ్‌ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు మ్యాచ్ ఆరంభం కానుంది. మెగా టోర్నీలో ఇప్పటికే రెండు మ్యాచ్‌లు గెలిచిన న్యూజిలాండ్‌.. హ్యాట్రిక్ విజయంపై కన్నేసింది. ఆడిన రెండు మ్యాచ్‌లలో ఓ మ్యాచ్ గెలిచిన బంగ్లాదేశ్‌.. మరో విజయం సాధించాలని చూస్తోంది. ఈ మ్యాచ్‌లో కివీస్ ఫెవరెట్ అయినా.. బంగ్లాను తక్కువగా అంచనా వేయడానికి వీల్లేదు. బంగ్లా కండిషన్స్ భారత్ మాదిరే ఉంటాయి కాబట్టి.. స్పిన్ మాయాజాలంతో కివీస్‌ను కట్టడి చేసే అవకాశాలు లేకపోలేదు.

బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌కు ముందు న్యూజిలాండ్‌కు గుడ్‌ న్యూస్‌ అందింది.కివీస్ రెగ్యూలర్‌ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ బంగ్లాపై బరిలో దిగనున్నాడు. ప్రస్తుతం కేన్‌ మామ పూర్తి ఫిట్‌నెస్‌ సాధించినట్లు సమాచారం. కేన్‌ రాకతో కివీస్‌ బ్యాటింగ్ మరింత పటిష్టంగా మారనుంది. మెగా టోర్నీలో తొలి రెండు మ్యాచ్‌లకు విలియమ్సన్‌ దూరమయిన విషయం తెలిసిందే. కేన్‌ స్థానంలో మొదటి రెండు మ్యాచ్‌లకు టామ్ లాతమ్ సారథ్యం వచించాడు. ఐపీఎల్‌ 2023లో గాయపడిన విలియమ్సన్‌.. అప్పటినుంచి జట్టుకు దూరంగా ఉన్నాడు.

మరోవైపు స్టార్‌ పేసర్‌ టిమ్‌ సౌథీ ఇంకా పూర్తి ఫిట్‌నెస్‌ సాధించలేదని తెలుస్తోంది. చేతి వేలి గాయంతో బాధపడతున్న సౌథీ.. బంగ్లాతో మ్యాచ్‌కు కూడా దూరమయ్యే ఛాన్స్‌ ఉంది. లాకీ ఫెర్గూసన్, ట్రెంట్ బౌల్ట్, జేమ్స్ నీషమ్, ఇష్ సోధి, మిచెల్ సాంట్నర్లతో కూడిన కివీస్ బౌలింగ్ పటిష్టంగానే ఉంది. డెవాన్ కాన్వే, డారిల్ మిచెల్, రచిన్ రవీంద్రలు ఫామ్‌లో ఉండడం న్యూజిలాండ్‌కు కలిసొచ్చే అంశం. వీరికి కేన్‌ మామ కూడా కలవనున్నాడు.

Also Read: Tilak Varma Captain: తిలక్‌ వర్మకు కెప్టెన్సీ బాధ్యతలు.. జట్టు ఇదే! స్టార్‌ ఆటగాళ్లు భాగం

మొదటి మ్యాచ్‌లో అఫ్గానిస్థాన్‌పై గెలిచిన బంగ్లాదేశ్‌.. రెండో మ్యాచ్‌లో ఇంగ్లండ్ చేతిలో ఓడిపోయింది. నేడు పటిష్ట న్యూజిలాండ్‌ను ఢీ కొట్టనుంది. ఈ మ్యాచ్‌లో బంగ్లా విజయం సాధించాలంటే శ్రమించక తప్పదు. లిటన్ దాస్, మెహిదీ హసన్ మిరాజ్, నజ్ముల్ హుస్సేన్ శాంటోలు హాఫ్ సెంచరీలతో సత్తాచాటారు. మరోవైపు బౌలింగ్ విభాగంలో తస్కిన్ అహ్మద్, షోరిఫుల్ ఇస్లాం, ముస్తాఫిజుర్ రెహమాన్ చెలరేగితే న్యూజిలాండ్‌ను కట్టడి చేయొచ్చు.

తుది జట్లు:
న్యూజిలాండ్‌: డెవాన్ కాన్వే, విల్ యంగ్, కేన్ విలియమ్సన్ (కెప్టెన్), డారిల్ మిచెల్, టామ్ లాథమ్, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, మిచెల్ సాంట్నర్, మాట్ హెన్రీ, లాకీ ఫెర్గూసన్/ఇష్ సోధి, ట్రెంట్ బౌల్ట్.
బంగ్లాదేశ్‌: తాంజిద్ హసన్/మహ్మదుల్లా, లిట్టన్ దాస్, నజ్ముల్ హుస్సేన్ శాంటో, షకీబ్ అల్ హసన్ (కెప్టెన్), మెహిదీ హసన్ మిరాజ్, ముష్ఫికర్ రహీమ్, తౌహిద్ హృదయ్, మహేదీ హసన్, తస్కిన్ అహ్మద్, షోరిఫుల్ ఇస్లాం, ముస్తాఫిజుర్ రహ్మాన్.