NTV Telugu Site icon

Tirumala: తిరుమలలో భారీగా భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి క్యూ కట్టిన జనం

Tirumala

Tirumala

తిరుమల కొండపైన భక్తుల రద్దీ భారీగా పెరుగుతుంది. వరుస సెలవులు ఉండటంతో ఒక్కసారిగా తిరుమలకు భక్తులు పోటెత్తారు. దీంతో వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోని కంపార్టుమెంట్లతో పాటు నారాయణగిరి ఉద్యానవనంలోని షెడ్లు సర్వదర్శనం కోసం వచ్చిన భక్తులతో పూర్తిగా నిండిపోయి క్యూలైన్‌ దాదాపు కిలో మీటరు మేరకు శిలాతోరణం వరకు భారీగా వేచి ఉన్నారు. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి దాదాపు 30 గంటలకు పైనే సమయం పడుతోంది. ఇక, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 5 గంటల సమయం పడుతుంది. మరోవైపు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు అలిపిరి చెక్‌పాయింట్‌లో వెహికిల్స్ భారీగా నిలిచిపోయాయి.

Read Also: Breaking News: రూ.2000 నోట్ల మార్పిడికి గడువు పెంపు.. ప్రకటించిన ఆర్బీఐ

అయితే, స్లాటెడ్‌ దర్శన టికెట్లు, టోకెన్లు కలిగిన భక్తులకూ దాదాపు మూడు గంటల దర్శన సమయం పడుతోంది అని తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు అధికారులు తెలిపారు. క్యూలైన్లో ఉన్న భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా తగిన ఏర్పాట్లు చేసినట్లు టీటీడీ తెలిపింది. ఇక, వసతి సౌకర్యాల విషయంలో కూడా భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో టీటీడీ కూడా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తుంది.

Read Also: Minister Botsa: చంద్రబాబుపై చాలా కేసులున్నాయి.. జనసేన-టీడీపీ కలిసొచ్చిన నష్టం లేదు..

ఇదిలా ఉండగా.. తిరుమల ఘాట్‌ రోడ్లలో ద్విచక్ర వాహనాల రాకపోకలపై ఉన్న ఆంక్షలను తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సడలించింది. టీటీడీ అటవీశాఖ అధికారులతో పాటు రాష్ట్ర అటవీశాఖ అధికారులు ఆ ప్రాంతంలో 6 చిరుతలను బంధించారు.. ఇక, వారం రోజుల పాటు పూర్తిగా పరిశీలించిన తర్వాత ఎలాంటి ప్రమాదం లేదని అటవీశాఖ అధికారులు నిర్థారించారు. దీంతో శుక్రవారం నుంచి ఘాట్‌ రోడ్లలో రాత్రి 10 గంటల వరకు ద్విచక్ర వాహనాలు తిరిగేందుకు పర్మిషన్ ఇచ్చారు. అలిపిరి కాలినడక మార్గంలో చిరుతల సంచారం ఉండటంతో భక్తుల భద్రత దృష్ట్యా సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ద్విచక్ర వెహికిల్స్ రాకపోకలను టీటీడీ నిలిపివేసింది.