Site icon NTV Telugu

Top Headlines@9PM: టాప్ న్యూస్‌

Top Headlines

Top Headlines

*కాంగ్రెస్ అధికారంలోకి వస్తే దళారీ రాజ్యం: సీఎం కేసీఆర్
యాదగిరిగుట్ట ఒకప్పుడు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది.. ఆ లక్ష్మీనరసింహుడే మనతో పని చేయించుకున్నారని సీఎం కేసీఆర్‌ అన్నారు. తెలంగాణ వస్తే భూముల ధరలు పోతాయ్‌ అని ఆనాడు అన్నారని, కరెంటు ఉండదు, చిమ్మ చీకట్లు అవుతాయన్నారని సీఎం గుర్తు చేశారు. సునీత నా బిడ్డలెక్క, ఆమె అడిగిన హామీలు నెరవేరుస్తానని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. కూసే గాడిద వెళ్లి మేసే గాడిదను తిట్టినట్లు డీకే శివకుమార్‌ మనకు చెబుతున్నారని.. 24 గంటలు కరెంట్‌ ఇచ్చే రాష్ట్రానికి వచ్చి 5 గంటలు కరెంట్ ఇస్తామంటున్నారని కేసీఆర్ ఎద్దేవా చేశారు. తన రాష్ట్రంలో ఐదు గంటల విద్యుత్ ఇవ్వలేని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కూడా మనపై విమర్శలు చేస్తున్నాడని కేసీఆర్ మండిపడ్డారు. కేంద్రం ఎన్ని ఇబ్బందులు సృష్టించినా 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్నామన్నారు. సమైక్య పాలకులు చెరువులను నిర్వీర్యం చేశారన్న సీఎం కేసీఆర్.. మిషన్ కాకతీయ ద్వారా చెరువులకు జీవం పోశామన్నారు. అధికారంలో బీఆర్ఎస్ ఉంటేనే 24 గంటల విద్యుత్ ఉంటుందన్నారు. బీఆర్ఎస్ పాలనలో వ్యవసాయం పండగగా మారిందన్నారు. సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. రైతుబంధు దుబారా అని మాజీ పీసీసీ అంటున్నారు. ధరణి మాత్రమే రైతు భూములకు భరోసా, శ్రీరామరక్ష. కాంగ్రెస్ అధికార కోసం ఎదురుచూస్తుంది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే దళారీ రాజ్యం… పైరవీ కారుల హవా ఉంటుంది. రాహుల్ గాంధీకి వ్యవసాయం తెలియదు, ఎద్దు తెలియదు, నాగలి దున్నిండా. ఇక్కడి సన్నాసులు ప్రసంగాలు రాసిస్తే చదువుతున్నాడు.” అని సీఎం కేసీఆర్‌ అన్నారు.

*గ్రూప్ 1 వాయిదా పడేలా చేసింది విపక్ష పార్టీలే..
కేసీఆర్‌ను విమర్శించే నాయకులకు కూడా సర్కార్ పథకాలు అందుతున్నాయని మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు. అయినా కేసీఆర్ ఏమి చేసిండు అని విపక్ష నేతలు అంటారని ఆయన మండిపడ్డారు. తెలంగాణ భవన్‌లో జరిగిన బీఆర్‌ఎస్‌వీ సమావేశంలో మంత్రి కేటీఆర్ మాట్లాడారు. ఈ ఎన్నికల్లో ప్రచారం గురించి కార్యకర్తలకు మంత్రి సూచించారు. బీజేపీ బతుకుతుంది సోషల్ మీడియా మీదేనని, వాళ్ళు చేసింది ఏమి లేదని మంత్రి పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో సోషల్ మీడియాను ప్రత్యర్థుల మీద బ్రహ్మాస్త్రంలా వాడుకోవాలని నేతలు, కార్యకర్తలకు సూచనలు చేశారు. కేసీఆర్ హయాంలో చేసిన అభివృద్ధి పనులను సెల్ఫీలు దిగి సోషల్ మీడియాలో పెట్టాలన్నారు. చేసింది చెప్పాలి, చేయబోతున్నది కూడా ప్రజలకు చెప్పాలని ఆయన సూచించారు. గ్రూప్ 1 వాయిదా పడేలా చేసింది విపక్ష పార్టీలేనని ఆయన ఆరోపించారు. డిసెంబర్‌ 3 తర్వాత జ్యాబ్ కాలెండర్ కూడా రూపొందిస్తామని కేటీఆర్‌ హామీ ఇచ్చారు. ఉస్మానియా కాదు.. ఎక్కడికి అంటే అక్కడికి వస్తామని, భయపడేదే లేదని మంత్రి అన్నారు. పనికిమాలిన ప్రతిపక్షాలకు మేము జవాబుదారీ కాదని కేటీఆర్ పేర్కొన్నారు. నాలుగు ఓట్ల కోసం నాలుగు డైలాగ్‌లు కొట్టే సన్నాసులను నమ్మవద్దన్నారు.

*తెలంగాణకు సీఎం కేసీఆర్ చేసిందేమీ లేదు.. ఖర్గే కీలక వ్యాఖ్యలు
మెదక్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీని బీజేపీ ప్రైవేట్ పరం చేయాలని చూస్తోందని కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే ఆరోపించారు. అందుకు బీఆర్‌ఎస్ సహకరిస్తుందన్న ఆయన.. బీజేపీ, బీఆర్‌ఎస్‌లు ఒక్కటేనన్నారు. బీజేపీకి బీఆర్‌ఎస్‌ ఏ టీం, బీఆర్‌ఎస్‌కు బీజేపీ బీ టీం అంటూ ఆయన విమర్శించారు. కాంగ్రెస్‌ విజయభేరి యాత్రలో భాగంగా మెదక్‌లో నిర్వహించిన జనసభలో ఆయన ప్రసంగించారు. తెలంగాణను ఇచ్చింది సోనియా గాంధీ.. మేము తెలంగాణ ఇస్తేనే బీఆర్‌ఎస్‌ వాళ్ళు పదవులు అనుభవిస్తున్నారని ఖర్గే పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని.. తెలంగాణకి సీఎం కేసీఆర్ చేసిందేమీ లేదన్నారు కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే. ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణను 5 లక్షల కోట్లు అప్పులు చేసి అప్పుల కుప్పగా మార్చారని ఆయన విమర్శించారు. మోడీ, అమిత్ షా, కేసీఆర్ ఎవ్వరికీ భయపడాల్సిన అవసరం లేదన్నారు. మల్లికార్జున ఖర్గే మాట్లాడుతుండగా రేవంత్ రెడ్డి పేరు ప్రస్తావనకు రావడంతో సీఎం సీఎం అంటూ కార్యకర్తలు నినాదాలు చేశారు. అంతకు ముందు సంగారెడ్డి జిల్లాలో జరిగిన కాంగ్రెస్​ విజయభేరి యాత్రలో భాగంగా నిర్వహించిన సభలో మల్లిఖార్జున ఖర్గే పాల్గొని.. బీఆర్​ఎస్​, బీజేపీలపై విరుచుకుపడ్డారు. గతంలో కాంగ్రెస్​ ఇచ్చిన ఎన్నో హామీలను నెరవేర్చిందని.. ఇప్పుడు కూడా ఇచ్చిన ఆరు గ్యారెంటీలను నెరవేరుస్తుందని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే హామీ ఇచ్చారు. బీఆర్‌ఎస్‌ తెలంగాణను అప్పులకుప్పగా మార్చిందని ఆయన విమర్శించారు. హైదరాబాద్‌లో కాంగ్రెస్ సర్కారు ఎన్నో జాతీయ సంస్థలను నెలకొల్పిందని ఖర్గే తెలిపారు. కాంగ్రెస్​ స్థాపించిన సంస్థలతో ఎన్నో ఉద్యోగాలు వచ్చాయని గుర్తు చేశారు. రైతులకు రైతు భరోసా కింద ఎకరానికి రూ.15 వేలు ఇస్తామని మాట ఇచ్చారు. 200 యూనిట్ల వరకు ఉచితంగా కరెంటు ఇస్తామని హామీ ఇచ్చారు. మహిళలకు ప్రతి నెల వారి ఖాతాల్లో రూ.2500 వేస్తామని మల్లికార్జున ఖర్గే హామీ ఇచ్చారు. వరికి మద్దతు ధరతో పాటు అదనంగా మరో రూ.500 బోనస్​ ఇస్తామన్నారు. విద్యార్థులకు యువ వికాసం కింద చదువులు కోసం రూ.5 లక్షలు ఇస్తామని స్పష్టం చేశారు.

*మంత్రులు హరీశ్‌రావు, మల్లారెడ్డిలకు మైనంపల్లి వార్నింగ్
మెదక్‌లో కాంగ్రెస్ విజయభేరి బహిరంగ సభలో మంత్రులు హరీశ్‌రావు, మల్లారెడ్డిలపై మైనంపల్లి హనుమంతరావు తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. హరీశ్‌ రావు ఖబడ్ధార్ అంటూ వార్నింగ్‌ కూడా ఇచ్చారు. వేలాది మంది జనాలను, పోలీసులను అడ్డం పెట్టుకుని తిరుగుతున్నారని ఆయన అన్నారు. వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమని…హరీశ్ రావుతో పాటు ఎమ్మెల్యే పద్మ భర్త దేవేందర్ రెడ్డి జైలుకు వెళ్లడం ఖాయమని మైనంపల్లి పేర్కొన్నారు. బీఆర్‌ఎస్‌ పార్టీలో ఉన్న వాళ్ళకే అన్ని పథకాలు వస్తున్నాయన్నారు. హరీశ్ రావు మెదక్ జిల్లాకు పట్టిన శని అని, ఇంకో నెలలో ఆ శని పోతుందన్నారు. సిగ్గు శరం లేకుండా కోట్లు పెట్టి నాయకులని కొంటున్నారని ఆయన ఆరోపించారు. మల్కాజ్‌గిరిలో నాపై పోటీకి ఓ టోపీ మాస్టర్‌ను తీసుకువచ్చారని చెప్పారు మైనంపల్లి హనుమంతరావు. మల్లారెడ్డి పిల్లికి బిచ్చం వెయ్యడని, ఆయనకు చదువు కూడా రాదని మైనంపల్లి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 200 కోట్లిచ్చి మల్లారెడ్డి అల్లుడు ఎంపీ టికెట్ కొన్నాడని ఆయన ఆరోపించారు. మల్లారెడ్డికి సంతకం కూడా పెట్టరాదని ఎద్దేవా చేశారు. మేడ్చల్‌లో ఎక్కడ చూసినా మల్లారెడ్డి కుంభకోణాలే అంటూ ఆయన ఆరోపించారు. చెరువు పక్కకి రెండెకరాల భూమి తీసుకుని పదెకరాల భూమి కబ్జా చేస్తాడంటూ విమర్శలు గుప్పించారు.

 

*సీఎం జగన్ రేపటి పర్యటన షెడ్యూల్ ఇదే
సీఎం వైఎస్‌ జగన్‌ రేపు విజయవాడలో పర్యటించనున్నారు. ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్‌ నరేందర్‌ ప్రమాణం కార్యక్రమంలో పాల్గొననున్నారు. సీఎం జగన్ సాయంత్రం 4.47 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి రాజ్‌భవన్‌ చేరుకోనున్నారు. అనంతరం కార్యక్రమానికి హాజరుకానున్నారు. ఇదిలా ఉంటే.. జస్టిస్ జి. నరేందర్ కర్ణాటక హైకోర్టు నుంచి బదిలీపై ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా వస్తున్నారు. మరోవైపు నవంబర్‌ 1న కూడా విజయవాడలో పర్యటించనున్నారు ముఖ్యమంత్రి. వైయస్సార్‌ లైఫ్‌టైం ఎచీవ్‌మెంట్‌ అవార్డులు, ఎచీవ్‌మెంట్‌ అవార్డుల ప్రధాన కార్యక్రమంలో గవర్నర్, సీఎం పాల్గొననున్నారు. ఉదయం 10.48 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి.. విజయవాడ ఎ- కన్వెన్షన్‌ సెంటర్‌కు చేరుకోనున్నారు. ఆ తర్వాత అవార్డుల ప్రదాన కార్యక్రమంలో పాల్గొననున్నారు. అనంతరం మధ్యాహ్నం తాడేపల్లికి తిరుగు ప్రయాణం కానున్నారు.

*వ్యవస్థలను మేనేజ్ చేయడంలో దేశంలో చంద్రబాబును మించినోడు లేడు
లోకేష్ కామెంట్స్ పై మంత్రి అమర్నాథ్ రియాక్షన్ ఇచ్చారు. చంద్రబాబు స్కామ్ పై రుజువులు న్యాయస్థానంకు ఇస్తాం కానీ.. నీలాంటి దొంగలకు కాదని లోకేశ్ పై మండిపడ్డారు. 13చోట్ల చంద్రబాబు సంతకం పెడితే అంత కంటే ఇంకేమి రుజువు కావాలని ప్రశ్నించారు. సీమెన్స్ సంస్థ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి ఇచ్చిన వాంగ్మూలమే నిదర్శనమన్నారు. న్యాయస్థానాలకు నాలుగు వేల పేజీలు నివేదిక, 130 మంది వాంగ్మూలాలు నమోదు చేసిందని తెలిపారు. కోర్టుకు వెళ్లి 17(ఏ) గురించి నువ్వు, నీ తల్లి, నీ పార్టీ చెంచాలు అడుగుతారే తప్ప తప్పు చేయలేదని ఎందుకు చెప్పలేకపోతున్నారని విమర్శించారు. చంద్రబాబు 50 రోజులుగా జైల్లో ఉంటే లోకేష్ బయటకు వచ్చి అరుపులు, కేకలు పెడుతున్నాడని మంత్రి అమర్నాథ్ విమర్శించారు. వ్యవస్థలను మేనేజ్ చేయడంలో దేశంలో చంద్రబాబును మించినోడు లేడని ఆరోపించారు. NTR ట్రస్ట్ ఆస్తులు చంద్రబాబుకు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. కుంభ కోణాల నుంచి తప్పించుకుని తిరగడం ఎదుర్కోలేదని… చంద్రబాబు మొదటి నుంచి దొంగే….దొంగ పనులు చేయడం అలవాటని అన్నారు. పాముల్ని పట్టే వాడు పాముకాటుకి చచ్చిపోయినట్టు ఉంది చంద్రబాబు పరిస్థితి అని ఎద్దేవా చేశారు. చంద్రబాబు రాజకీయం అంతా మేనెజ్మెంట్.. ఈవెంట్ మేనెజ్ మెంట్లేనన్నారు మంత్రి గుడివాడ అమర్నాథ్. కాంగ్రెస్ పార్టీతో కలిసి జగన్మోహన్ రెడ్డి మీద కేసులు పెట్టేందుకు వ్యవస్థలను చంద్రబాబు మ్యానేజ్ చేశాడని తెలిపారు. ఏసీ పెట్టిన తర్వాత జైల్లో చంద్రబాబుకి దోమలు కూడా కుట్టడం లేదు హ్యాపీగా వున్నాడని.. చంద్రబాబుకు ముప్పు జరిగితే అది లోకేష్ వల్లే సాధ్యమని మంత్రి పేర్కొన్నారు. వెన్నుపోటు రక్తం పంచుకుని పుట్టిన వ్యక్తిగా లోకేష్.. తన భవిష్యత్ కోసం ఏదైనా చేస్తాడనేదే మా అనుమానమని అన్నారు.

*పేలుళ్లకు నాదే బాధ్యత.. పోలీసుల ముందు లొంగిపోయిన వ్యక్తి..
కేరళలోని కలమస్సేరిలోని కన్వెన్షన్ సెంటర్ లో ఈరోజు ఉదయం ఒక మతపరమైన కార్యక్రమంలో పేలుళ్లు జరిగాయి. ఈ ఘటనలో ఒక మహిళ మరణించగా.. 45 మంది గాయపడ్డారు. ఈ పేలుళ్లు దేశ వ్యాప్తంగా సంచలనం రేపాయి. ప్రార్థనా సమయంలో కొన్ని నిమిషాల వ్యవధిలోనే మూడు పేలుళ్లు సంభవించాయి. ఈ ఘటనపై ఎన్ఐఏతో పాటు కేరళ పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఇదిలా ఉంటే ఈ కేసులో సంచలనం నమోదైంది. పేలుళ్లకు బాధ్యత వహిస్తూ 48 ఏళ్ల వ్యక్తి త్రిసూర్‌లో కేరళ పోలీసుల ముందు లొంగిపోయారు. అనుమానితుడిని డొమినిక్ మార్టిన్ గా గుర్తించారు. పార్థనా సమావేశాన్ని నిర్వహిస్తున్న అదే క్రైస్తవ వర్గానికి చెందిన వాడని పోలీసులు తెలిపారు. అదే ప్రాంతానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఈ కేసులో అన్ని కోణాలను పరిశీలిస్తున్నామని, హాల్ మధ్యలో పేలుడు జరిగిందని పోలీసులు చెప్పారు. అయితే ఈ పేలుళ్ల వెనక అతని హస్తం ఉందా.. లేదా.. అనే విషయాలను పోలీసులు ఇంకా నిర్థారించలేదు. లొంగిపోయిన వ్యక్తిని విచారిస్తున్నారు. ప్రాథమిక సమాచారం ప్రకారం పేలుడు పదార్థాలను ఐఈడీగా గుర్తించారు.వీటిని టిఫిన్స్ బాక్సుల్లో పెట్టి పేల్చినట్లు కేరళ డీజీపీ షేక్ దర్వేష్ సాహెబ్ తెలిపారు. మరోవైపు కేరళ సీఎం పినరయి విజయన్ రేపు 10 గంటలకు అఖిలపక్ష సమావేశానికి పిలుపునిచ్చారు.

*”వారి బోధనలు జాతి వ్యతిరేకంగా ఉన్నాయి”.. అందుకే బాంబులు పెట్టా..
కేరళలోని కలమస్సేరిలో ‘యొహోవా విట్‌నెసెస్’ క్రైస్తవ సమూహం ప్రార్థనల సమయంలో వరసగా మూడు పేలుళ్లు జరిగాయి. ఈ పేలుళ్లతో దేశం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. ఈ చర్యలో ఏదైనా ఉగ్రవాద కోణం ఉందా..? అని ఇప్పటికే ఎన్ఐఏ విచారణ జరుపుతోంది. ఈ ఘటనలో ఇప్పటి వరకు ఒకరు మరణించగా.. 45 మంది గాయపడ్డారు. నిమిషాల వ్యవధిలోనే మూడు పేలుళ్లు జరగాయని, పేలుళ్లలో ఐఈడీని టిఫిన్ బాక్సుల్లో అమర్చినట్లు పోలీసులు వెల్లడించారు. ఇదిలా ఉంటే ఈ పేలుళ్లకు తానే బాధ్యుడిననని డోమినిక్ మార్టిన్ అనే 48 ఏళ్ల వ్యక్తి త్రిసూర్ లోని కొకద్ర పోలీస్ స్టేషన్ లో లొంగిపోయాడు. ప్రస్తుతం అతన్ని కేరళ పోలీసులు విచారిస్తున్నారు. విచారణ సమయమంలో తన వద్ద ఉన్న సాక్ష్యాలను కూడా అందించారని పోలీసులు వెల్లడించారు. యొహోవా విట్‌నెసెస్ బోధనలను ‘విద్రోహపూరితమైనవి’ ఉన్నాయని అతను ఆరోపించాడు. కాబట్టే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. మార్టిన్ సోషల్ మీడియా ద్వారా ఓ వీడియోను పంచుకున్నాడు. గత 16 ఏళ్లుగా తాను యొహోవా విట్‌నెసెస్ సమూహంలో సభ్యుడిగా ఉన్నానని, తాను యొహోవా విట్‌నెసెస్ బోధనలతో ఏకీభవించడం లేదని, వారి కార్యకలాపాలను నిలిపివేయాలనుకుంటున్నట్లు పేర్కొన్నాడు. వారి ఆలోచనలు దేశానికి ప్రమాదకరమని, అవి యువకులను విషపూరితం చేస్తున్నాయని ఆయన అన్నారు. సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ గా మారిన 6 నిమిషాల వీడియోలో తానే ఈ దాడికి బాధ్యత వహిస్తున్నానని, అక్కడ పేలుళ్లు జరిపింది తానే అని వెల్లడించారు. ఆరేళ్ల క్రితం ఆ సంస్థ తప్పుడు మార్గంలో వెళ్తుందని, వారి బోధనలు దేశానికి వ్యతిరేకంగా ఉన్నాయని నేను గ్రహించానని, వాటిని మార్చుకోవాలని పలుమార్లు కోరానని, అయినప్పటికీ వారు అందుకు సిద్దపడలేదని వీడియోలో తెలిపారు. దేశంలో నివసిస్తున్న ఇక్కడి ప్రజలను వారు వ్యభిచారులు అని పిలిచే వారని, వారు ఇతరులతో భోజనం చేయవద్దని, వారితో ఉండొద్దని కోరుతారని, వారి భావజాలం తప్పని గ్రహించానని మార్టిన్ వెల్లడించారు. ఓటు వేయద్దని, సైన్యంలో చేరవద్దని చెప్పేవారిని ఆరోపించారు. ఇలాంటి ప్రమాదకరమైన ఆలోచనలను వ్యాప్తి చేసే ఈ రకమైన సంస్థను నియంత్రించకపోతే, నాలాంటి వారి జీవితాలను త్యాగం చేయాల్సి ఉంటుందని అన్నారు. వారు ఎవరికీ సాయం చేయరు, ఎవరిని గౌరవించరు, దేశానికి వారు ప్రమాదకరంగా ఉన్నారని ఆయన ఆరోపించారు.

*అధికారంలోకి వస్తే ముస్లింలపై ట్రావెల్ బ్యాన్ విధిస్తా..
ఇజ్రాయిల్-హమాస్ యుద్ధం నేపథ్యంలో యూదులతో సమావేశమైన అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. శనివారం లాస్ వేగాస్ లో రిపబ్లిక్ యూదు కూటమి సమావేశంలో మాట్లాడుతూ.. తాను అధ్యక్షుడు తిగిరి ఎన్నికైతే ముస్లింలపై ట్రావెల్ బ్యాన్‌ని పునరుద్ధరిస్తానని ప్రకటించారు. రాడికల్ ఇస్లామిక్ టెర్రరిస్టులను మన దేశం నుంచి బయటకు రానీయకుండా చూస్తానని అన్నారు. ఈ సమావేశంలో మాట్లాడుతూ.. మీకు ట్రావెల్ బ్యాన్ గుర్తుందా..? నేను అధ్యక్షుడినైతే మొదటిరోజే ట్రావెల్ బ్యాన్ పునరుద్ధరిస్తానని చెప్పారు. 2017లో ట్రంప్ అధికారంలో ఉన్న సమయంలో ఇరాన్, లిబియా, సోమాలియా, సిరియా, యెమెన్ మరియు మొదట్లో, ఇరాక్ మరియు సూడాన్ నుంచి అమెరికాకు వచ్చే ప్రయాణికులపై భారీ ఆంక్షలు విధించారు. అయితే ఈ ఉత్తర్వులు మతపరమైన ఒక సమూహంపై వివక్ష చూపుతుందని కోర్టుల్లో సవాల్ చేశారు. ట్రంప్ దిగిపోయాక, జో బైడెన్ అధ్యక్షుడైన తర్వాత 2021లో మొదటి వారంలోనే ఈ నిషేధాన్ని రద్దు చేశాడు. బైడెన్ కన్నా పూర్వం ఉన్న ప్రభుత్వం అమెరికన్ కాని ముస్లింలపై నిషేధాన్ని విధిస్తే, బైడెన్ దీన్ని రద్దు చేయడం గర్వంగా ఉందని వైట్ హౌజ్ ప్రతినిధి చెప్పారు. ఇజ్రాయిల్ మా మిత్రదేశం, మిత్రదేశాన్ని ఎన్నడూ లేనంతగా రక్షిస్తానని ట్రంప్ అన్నారు. ఇజ్రాయిల్-హమాస్ మధ్య పోరాటం నాగరికత-క్రూరత్వం, మంచి-చెడుల మధ్య పోరాటంగా ట్రంప్ అభివర్ణించారు. దీనికి ముందు ఇజ్రాయిల్-హమాస్ యుద్ధం ప్రారంభమైన కొన్ని రోజులకు లెబనాన్ లోని హిజ్బుల్లా మిలిటెంట్లను వెరీ స్మార్ట్ అంటూ ఇజ్రాయిల్ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహూను విమర్శించారు. తాజాగా ట్రావెల్ బ్యాన్ గురించి మాట్లాడారు. అక్టోబర్ 7న ప్రారంభమైన ఇజ్రాయిల్-హమాస్ యుద్ధంలో ఇజ్రాయిల్ వైపు 1400 మంది చనిపోగా.. ఇజ్రాయిల్ గాజాపై జరిపిన దాడుల్లో 7000 మందికి పైగా మరణించారు. గాజాలో హమాస్ మిలిటెంట్లు బందీలుగా పట్టుకున్న 200 మందికి పైగా ప్రజలను విడిపించేందుకు ఇజ్రాయిల్ కసరత్తు చేస్తోంది. ఇప్పటికే ఇజ్రాయిల్ భూతల దాడులను ప్రారంభించింది.

Exit mobile version